Tatikonda Rajaiah: ప్రశ్నార్థకంగా రాజయ్య పొలిటికల్ ఫ్యూచర్! మాజీ డిప్యూటీ సీఎంకు అన్నీ అడ్డంకులే!
Tatikonda Rajaiah: ఈ నెల 3వ తేదీన బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్య.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో రాజయ్య చేరికకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
Tatikonda Rajaiah Political Future: తెలంగాణ తొలి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటకొండ రాజయ్య రాజకీయ భవిష్యత్తు రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది. ఈ నెల 3వ తేదీన బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన రాజయ్య.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ లో రాజయ్య చేరికకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
గత ఏడాది డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజయ్యకు గులాబీ పార్టీ టికెట్ ఇవ్వకుండా కేటాయించారు. టికెట్ కు బదులు రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పదవి ఇచ్చారు. మొన్నటి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి కావడంతో రాష్ట్రంలో గులాబీ పార్టీ అధికారం కోల్పోవాల్సి వచ్చింది. టికెట్ రాకపోవడంతో తాటికొండ రాజయ్య వరంగల్ ఎంపీ కోసం ప్రయత్నాలు చేశారు. ఎంపీ టిక్కెట్ రాదని తెలుసుకున్న రాజయ్య బీఆర్ఎస్ పార్టీ, పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్ లపై ఆరోపణలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా రోజు ఏ పార్టీలో చేరుతాననే విషయాన్ని చెబుతానని రాజయ్య మీడియాతో చెప్పారు. ఇంతలో సీన్ రివర్స్ అయ్యింది.
మహిళా నేతల నిరసన
రాజయ్యను కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దని స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలోని ఆయా మండల పార్టీ అధ్యక్షులు అధిష్టానానికి విన్నవించుకున్నారు. అంతటితో ఆగకుండా రెండురోజుల క్రితం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్ లోని కాంగ్రెస్ భవన్ ఎదుట ఆందోళన చేశారు. కామాంధుడైన రాజయ్యను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకురావద్దని అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.
పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దామోదర రాజనర్సింహలతో రాజయ్య మంతనాలు చేయడంతో సీఎం రేవంత్ రెడ్డి ఒకే చెప్పారు. అయితే నియోజకవర్గ కాంగ్రెస్ నేతల నుంచి వ్యతిరేకత ఎదురవడంతో పాటు వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, నాయకులు రాజయ్య పై విముక్త వ్యక్తం చేస్తున్నారు. అయినా రాజయ్య తన ప్రయత్నాలను ఢిల్లీ కేంద్రంగా కొనసాగించిన ఢిల్లీ పెద్దలు మొహం చాటేసినట్లు సమాచారం. దీంతో రాజయ్య రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారింది.
తొలుత కాంగ్రెస్ లోనే..
2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మన వరంగల్ జిల్లా స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి తాటికొండ రాజయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమం ఎగిసిపడుతుండడంతోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేకపోవడంతో అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో తాటికొండ రాజయ్య ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉద్యమ పార్టీ టిఆర్ఎస్ లో చేరారు. అనంతరం జరిగిన ఉప ఎన్నికల తో పాటు 2014, 2018 ఎన్నికల్లో స్టేషన్ ఘన్పూర్ నుండి గెలిచారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జరిగిన మంత్రివర్గ విస్తరణలో రాజయ్య తొలి ఉపముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే కొద్ది రోజులకే వివిధ ఆరోపణలు ఎత్తడంతో పార్టీ అధినేత కేసీఆర్ రాజయ్య పదవికి రాజీనామా చేయించారు. దీంతో రాజయ్య ఎమ్మెల్యేకే పరిమితమయ్యారు. రాజయ్య పై సొంత పార్టీకి చెందిన మహిళ లైంగిక ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపాయి.