Minister Errabelli: నేషనల్ పార్టీ BRS పేరు మర్చిపోయిన మంత్రి, దానిబదులు మరో పేరు! అవాక్కైన జనం
ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కొత్తగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ అని మర్చిపోయారు. అది ఏంటని జనాల్ని అడిగారు.
ప్రజా ప్రతినిధులు ప్రముఖులు ప్రసంగిస్తుండగా నోరు జారుతుండడం షరా మామూలే. ప్రధాన వ్యక్తుల పేర్లు గానీ, పార్టీల పేర్లు గానీ ఏమరుపాటులో తప్పు పలికి మళ్లీ సరి చేసుకుంటారు. గతంలో ఎంతో మంది నాయకులు ఇలా పొరపాట్లు పడ్డారు. ప్రతిసారి దానికి సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యేవి. ఇప్పుడు కూడా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పొరపాటు పడి, సోషల్ మీడియాకు దొరికిపోయారు. తాజాగా ఆయన దసరా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంలో ఏకంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన పార్టీ కొత్త పేరునే మర్చిపోయారు. బీఆర్ఎస్ కు బదులుగా బీఎస్పీ అనేశారు.
వరంగల్ లోని ఉర్సుగుట్ట రంగలీలా మైదానంలో జరిగిన రావణ వధ, దసరా ఉత్సవాలకు రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, సీపీ తరుణ్ జోషి తదితరులు కూడా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఓ సందర్భంలో కొత్తగా మార్చిన టీఆర్ఎస్ పార్టీ పేరు బీఆర్ఎస్ అని మర్చిపోయారు. అది ఏంటని జనాల్ని అడిగారు. అక్కడున్న వారు బీఎస్పీ అనడంతో.. అదే ఫ్లోలో మంత్రి కూడా బీఎస్పీ అని అనేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. ‘‘మనందరికీ దసరా ముఖ్యమైన పండుగ. తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యం ఇచ్చే పండుగ. తెలుగు వారు దసరాని పది రోజులు జరుపుకుంటారు. విజయదశమి రోజున రాముడు రావణునిపై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. ఈ సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజ చేస్తుంటారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతణ్ని చంపి జయాన్ని పొందిన సందర్భంలో 10వ రోజు ప్రజలంతా సంతోషంతో పండగ జరుపుకున్నారు. అదే ప్రస్తుతం మనం జరుపుకుంటున్న విజయదశమి. పురాణ గాథలను బట్టి చెడుపై మంచి సాధించిన విజయంగా దీన్ని చెప్పుకుంటారు.
ఉర్సుగుట్ట రంగ లీలా మైదానంలో ఏళ్ళుగా జరుగుతున్న ఈ రావణ వధ, దసరా ఉత్సవాలకు నేను వస్తూనే ఉన్నాను. ప్రతి దసరాకి ఇక్కడకు రావడం నా అదృష్టం. మంచిని ఆదరించాలి, చెడు ని ఛీదరించాలి. ఎన్నో ఆటంకాలను అధిగమించి కేసీఆర్ తెలంగాణ సాధించారు. తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా కాపాడుతూ, బంగారు తెలంగాణ చేస్తున్నారు. అభివృద్ధి సంక్షేమం విడనాడకుండా కరోనా కష్ట కాలంలో సైతం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణను దేశంలో అగ్రగామిగా నిలిపారు.
ఎన్నిక ఏదైనా, గెలుపు మనదే, ప్రజల సంపూర్ణ మద్దతు కూడా బీఆర్ఎస్ కే. సీఎం కేసీఆర్, వారి కుటుంబం ఆయు ఆరోగ్యాలతో ఉండాలి. కేసీఆర్ కుటుంబానికి ప్రజలంతా అండగా నిలవాలి. దసరా పండుగ మనకు అత్యంత ప్రీతికరమైన పండుగ. ఆడ బిడ్డలను, అల్లుళ్లను ఇంటికి పిలిచి బట్టలు పెట్టి, గౌరవించుకోవడం ఈ పండుగ సంప్రదాయం. బంధుమిత్రులతో ఆనందంగా జరుపుకునే సరదా పండుగ దసరా. ఈ పండుగ అందరి కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ప్రజలందరి కోరికలు నెరవేరాలని, వారంతా వారివారి పనుల్లో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. మరోసారి ప్రజలందరికీ దసరా - విజయదశమి పండుగ శుభాకాంక్షలు’’ అని ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.