Kadiyam Srihari Challenge: అటవీ భూముల కబ్జాపై నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా, దమ్ముంటే ట్రై చేయండి: కడియం శ్రీహరి సవాల్
హనుమకొండ జిల్లా దేవూనూరు అటవీ భూములు కబ్జా అయినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా, దమ్ముంటే ట్రై చేయాలంటూ పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్యలకు కడియం శ్రీహరి సవాల్ విసిరారు.

Kadiam Srihari | వరంగల్: ఓవైపు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, అటవీ భూములను కాంగ్రెస్ ప్రభుత్వం సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. అటవీ భూములను నాశనం చేసి భూముల్ని వేలం వేయాలని చూస్తుందని పిటిషన్లు రావడంతో అటు సుప్రీంకోర్టులో కంచె గచ్చబౌలి భూములపై విచారణ జరిగింది. తమ తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. అదే సమయంలో రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో అటవీ భూముల కబ్జా జరిగిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఆరోపణలు వచ్చాయి.
అవన్నీ నిరాధారమైన ఆరోపణలు
హనుమకొండ జిల్లా దేవూనూరు అటవీ భూముల కబ్జా వివాదంపై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హనుమకొండలోని దేవునూర్ గుట్టల్లో అటవీ భూమిని కడియం శ్రీహరి కబ్జా చేస్తున్నారని కొన్ని రోజులుగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపిస్తున్నారు. ఆ కబ్జా ఆరోపణలపై కడియం శ్రీహరి అంతే ఘాటుగా స్పందించారు. హనుమకొండలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అటవీ భూమి కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. అవన్నీ నిరాధారమైన ఆరోపణలు అని.. దమ్ముంటే అక్కడ కబ్జా జరిగినట్లు నిరూపించాలని సవాల్ విసిరారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్యలు, రెవెన్యూ అధికారులను, అటవీ అధికారులను, మీడియాను తీసుకెళ్ళి అందరి సమక్షంలో మీరే విచారణ జరిపి 2 వేల ఎకరాలు కబ్జా చేశాడని తేలితే నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని చాలెంజ్ చేశారు.
ఇంకా పల్లా రాజేశ్వర్ రెడ్డి, తాటికొండ రాజయ్య ఇళ్లలో తాను గులాంగా పని చేస్తానన్నారు. ఒకవేళ నిరూపించకపోతే రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య లు ఇద్దరు కడియంశ్రీహరి ఇంట్లో గులాములుగా పని చేస్తారా అంటూ ఎమ్మెల్యే సవాలు విసిరారు. రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యలకు తెలంగాణ పౌరుషం, చీము, నెత్తురు ఉంటే తనపై చేసిన ఆరోపణలకుగానూ తాను చేసిన ఈ సవాలును స్వీకరించాలని కడియం ఛాలెంజ్ చేశారు. అటవీ భూములను కాపాడి, పట్టా భూములు కలిగిన రైతులకు న్యాయం చేస్తానని కడియం శ్రీహరి అన్నారు. దేవునూరు గుట్టలను ఎకో టూరిజం హాబ్ గా అభివృద్ధి చేసేందుకు పాటుపడుతా అన్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

