Warangal: వరంగల్ పర్యటనలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ.. కోర్టు కొత్త భవనాల ఆవిష్కరణ
సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు.
వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ జిల్లా కోర్టు భవనాలను ప్రారంభించారు. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ, హైకోర్టు న్యాయమూర్తులు ఉజ్జల్ బుయాన్, రాజశేఖర్ రెడ్డి, జస్టిస్ నవీన్ రావ్, వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ జడ్జి నందికొండ నర్సింగరావు, న్యాయవాదులు, సిబ్బంది తదితరులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఆధునిక సదుపాయాలతో నిర్మించిన పది కోర్టుల సముదాయాన్ని, పోక్సో కోర్టు, ఫ్యామిలీ కోర్టును సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోర్టు ప్రాంగణంలో శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మతో కలిసి సీజేఐ కోర్టు ప్రాంగణాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ వేదికపై సీజేఐ మాట్లాడుతూ.. కాళోజీ కవితలతో ప్రసంగం ప్రారంభించారు. ‘‘వరంగల్‌లో 3 సాహిత్య పాఠశాలకు హాజరయ్యాను. ఈ ప్రాంతంతో ఆత్మీయ సంబంధం ఉంది. పోరాట గడ్డ, కలలకు పుట్టినిల్లు వరంగల్. సరస్వతి పుత్రులు పుట్టిన నేల వరంగల్. రామప్ప చూసి మురిసిపోయాం, వెయ్యి స్తంభాలు గుడి, భద్రకాళి మాత దర్శనం చేసుకున్నాం. దేశంలో ఉన్న అన్ని కోర్టులు ఆధునీకరణ చేపట్టాలని ఆలోచన చేసాం. కేంద్రం సహకరిస్తుందని ఆశగా ఎదురు చూస్తున్నాం. వరంగల్ కోర్ట్ లో 10 కోర్ట్ ల భవన సముదాయం ఏర్పాటు చేయడం అభినందనీయం. మౌలిక వసతులు లేకపోవడం వలన కేసులు పెండింగ్ లో ఉంటున్నాయి. కేంద్రం ఈ అంశం పరిశీలించాలి.
‘‘సమాజంలో న్యాయవాదులకు అరుదైన గౌరవం ఉంది. కుటుంబంతో పాటు సమాజం గురించి కూడా న్యాయవాదులు ఆలోచించాలి. న్యాయ వ్యవస్థపై కొవిడ్ ప్రభావం చూపింది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పట్టణ ప్రాంతంలో మాత్రమే న్యాయ సేవలు అందించగలిగాం. దీనివలన గ్రామీణ ప్రాంత న్యాయవాదులు తీవ్రంగా నష్టపోయారు. ఈ సమస్య పరిష్కారం కోసం తాలూకాకు ఒక మొబైల్ నెట్ వర్క్ కోర్ట్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించాం. కోవిడ్ వలన ఉపాధి కోల్పోయిన న్యాయ వాదులకు ఆర్థిక సహాయం అందించాలని కేంద్రాన్ని కోరాను. కానీ ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదు. చాలా వరకు న్యాయ వ్యవస్థలో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమిస్తేనే సేవలు అందించగలం. తెలుగు భాషను ప్రేమించండి, తెలుగులోనే మాట్లాడండి. భాషను భావి తరాలకు అందించండి.’’ అని సీజేఐ మాట్లాడారు.
భద్రకాళీ అమ్మవారి దర్శనం
అంతకుముందు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు భద్రకాళీ అమ్మవారిని దర్శించుకున్నారు. తొలుత ఆలయం వద్దకు చేరుకున్న వారికి అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత వేయి స్తంభాల గుడిని కూడా జస్టిస్ ఎన్వీ రమణ సందర్శించారు. నేడు హన్మకొండలో 10 కోర్టుల భవన సముదాయాన్ని సీజేఐ ప్రారంభించారు.
Also Read: Gay Marriage in Telangana: తెలంగాణలో తొలి ‘గే’ వివాహం.. మంగళ స్నానాలు, సంగీత్ అన్నీ..
Also Read: Warangal: వరంగల్ బాలుడికి గ్రేట్ ఛాన్స్.. ఏకంగా ఎలన్ మస్క్‌నే మెప్పించి.. అదేం అంత సులువు కాదు!
Also Read: ఫైజర్ ఒమిక్రాన్ పిల్ అత్యవసర వినియోగానికి ఈయూ అనుమతి... 90 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోన్న టాబ్లెట్
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి