BRS News: ప్రెస్‌మీట్ నుంచే బీఆర్‌ఎస్ నేతను తీసుకెళ్లిపోయిన మాజీ మంత్రి- హనుమకొండలో హైడ్రమా
Aruri Ramesh: హనుమకొండ బీఆర్‌ఎస్‌లో హైడ్రామా నడుస్తోంది. ఆ పార్టీ లీడర్ ఆరూరి రమేష్ పార్టీకి రాజీనామా చేస్తారనే ప్రచారంతో అధినాయకత్వం బుజ్జగింపులు చేస్తోంది.
Hanamkonda News: లోక్‌సభ ఎన్నికల ముందు తెలంగాణలో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు జరుగుతున్నాయి. ముఖ్యంగా బీఆర్‌ఎస్‌లో పరిస్థితులు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతున్నాయి. అధికారానికి దూరమైన కారణంగా చాలా మంది నేతలు ఆ పార్టీని వీడి వేరే పార్టీల్లోకి వెళ్లిపోతున్నారు. ఇది ఆ పార్టీ కేడర్‌కు తీవ్ర నిరాశకు గురి చేస్తోంది.
అలా పార్టీ మారాలని ఆలోచన ఉన్న వారిలో హనుమకొండకు చెందిన ఆరూరి రమేష్. ఆయన పార్టీ మారాలని నిర్ణయించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్న టైంలో స్టోరీ మరో మలుపు తీసుకుంది. ఆయన రాజీనామా విషయాన్ని తెలుసుకున్న బీఆర్‌ఎస్ అధినాయకత్వం దూతలను పంపించింది. ఆయన్ని బుజ్జగించాలని పార్టీ మారొద్దని సర్దిచెప్పాలని సూచించింది.
అధినాయకత్వం ఆదేశాలతో రంగ ప్రవేశం చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఆరూరి రమేష్ ఇంటికి వచ్చి మాట్లాడారు. మీడియాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్న ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి బుజ్జగించే ప్రక్రియ చేపట్టారు.
తాము హరీష్‌రావు ఆదేశాలతోనే వచ్చామన్నారు బీఆర్‌ఎస్ నేతలు. పార్టీకి రాజీనామా చేయాలనే ఆలోచన మానుకోవాలని సూచించారు. సాయంత్రానికి హరీష్ హనుమకొండ చేరుకుంటారని సమస్యలు ఉంటే ఆయనతో చర్చించాలని హితవు పలికారు.
ఆరూరి కీలక ప్రకటన చేసే ముందు తన అనుచరులతో మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ఆయన ఇంటికి అనుచరులు, అభిమానులు భారీగా చేరుకున్నారు. జై ఆరూరీ అంటూ నినాదాలు చేశారు. బుజ్జగించేందుకు నాయకులు వచ్చే టైంలో కూడా పెద్ద పెద్దగా నినాదాలు చేశారు.
ఈ నినాదాల మధ్య ఇంటిలో కాసేపు మంతనాలు జరిగిన నేతలు... ఆయన్ని వెంటనే కారులో ఎక్కించుకొని హరీష్‌రావు వద్దకు తీసుకెళ్లారు. సాయంత్రం వరకు ఎదురు చూస్తేపరిస్థితులు ఎలా మారతాయనే తెలియదని గ్రహించి హనుమకొండ నుంచి బయల్దేరారు.
అమిత్‌షా హైదరాబాద్‌లో పర్యటనలో ఉన్న టైంలో ఆరూరి రమేష్ ఆయన్ని కలిశారు. బీజేపీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. దీనిపై ప్రకటన చేసేందుకు సిద్ధమవుతున్న టైంలో బీఆర్‌ఎస్ నేతలు అలర్ట్ అయి ఆయన్ని బుజ్జగించే పనిలో పడ్డారు.