Automatic Tractor : మొబైల్ యాప్ తో ట్రాక్టర్ డ్రైవింగ్, వరంగల్ కిట్స్ పరిశోధకుల ఆవిష్కరణ
Automatic Tractor : మొబైల్ అప్లికేషన్ సాయంతో ట్రాక్టర్ నడిచేలా చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు వరంగల్ కిట్స్ నిపుణులు.
Automatic Tractor :అత్యధునిక పరికరాలు, సాంకేతిక వ్యవసాయ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లున్నాయి. రైతులకు సాంకేతికను మరింత చేరువ చేసే దిశగా పరిశోధనలు చేస్తున్నారు వరంగల్ కిట్స్ బృందం. డ్రైవర్ అవసరంలేకుండా ట్రాక్టర్ పనిచేసే విధంగా ప్రయోగాలు చేస్తున్నారు. రైతులు ఎక్కడైనా కూర్చొని పొలంలో ట్రాక్టర్‌ను మొబైల్ సాయంతో నడపవచ్చు. డ్రైవర్ అవసరం లేకుండా గేర్లు మార్చవచ్చు. ఎక్స్‌లేటర్ కూడా ఇవ్వొచ్చు. స్టీరింగ్ దానంతట అదే తిరుగుతుంది. ట్రాక్టర్ వెనక్కి, ముందుకు ఎటు కావాలంటే అటు నడిపేయవచ్చు. ఈమేరకు వ్యవసాయంలో అన్నదాతకు ప్రయోజనకరంగా.. వరంగల్ ‘కిట్స్’ కళాశాల అధ్యాపకులు డ్రైవర్ లేకుండా ట్రాక్టర్ నడిపే పరిజ్ఞానాన్ని ఆవిష్కరించారు. ‘డ్రైవర్ రహిత ట్రాక్టర్’గా దీనికి నామకరణం చేశారు. మూడేళ్లపాటు శ్రమించి దీన్ని విజయవంతంగా అభివృద్ధి చేశారు. కేంద్ర శాస్త్ర సాంకేతిక విభాగం (డీఎస్టీ) కింద 2020 ఫిబ్రవరిలో రూ.41 లక్షల విలువైన ఈ ప్రాజెక్టు మంజూరైంది. కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ నిరంజన్‌రెడ్డి కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా, సహాయ ఆచార్యుడు షర్ఫుద్దిన్ వసీమ్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా, అధ్యాపకుడు నరసింహారెడ్డి ప్రాజెక్టుకు మెంటర్‌గా వ్యవహరించగా, బీటెక్ సీఎస్‌ఈ చివరి సంవత్సరం విద్యార్థి సాకేత్ ఈ ప్రాజెక్టులో పాలుపంచుకున్నాడు.
ఆటోమెటిక్ ట్రాక్టర్
ట్రాక్టర్‌కు మైక్రో కంట్రోలర్‌ను అమర్చి, డ్రైవర్ అవసరం లేకుండానే క్లచ్, బ్రేకు, ఎక్స్‌లేటర్ తిరగడానికి మూడు యాక్చువేటర్స్ వినియోగించారు. స్టీరింగ్ తిరిగేందుకు మరో మోటార్‌ను అమర్చారు. డ్రైవర్ రహిత ట్రాక్టర్‌ను మొబైల్ ద్వారా నియంత్రించేలా రూపొందించామని ప్రిన్సిపల్ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. ఐవోటీ పరిజ్ఞానంతో మెసేజ్ క్లౌడ్‌కు వెళుతుందని, అక్కడి నుంచి మొబైల్‌కు మనమిచ్చే ఆదేశాలు వస్తాయని వివరించారు. మన ఇంట్లో లేదా వేరే ఎక్కడి నుంచైనా పొలంలో ట్రాక్టర్‌ను మొబైల్ ఫోన్‌తో నడిపించవచ్చని, 45 హెచ్‌పీ ట్రాక్టర్‌పై ప్రాంగణంలో ప్రయోగాలు చేసి తెలిపారు. ట్రాక్టర్ ఉన్న రైతులు ఈ సాంకేతికతను అమర్చుకోవాలంటే రూ.20 వేలు ఖర్చవుతుందని చెప్పారు.
రైతుల ఆదాయం రెట్టింపు లక్ష్యంగా ఆవిష్కరణలు
కిట్స్ కళాశాల యాజమాన్యం, మాజీ ఎంపీ వి. లక్ష్మీకాంతరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు రూ.40 లక్షలు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ వర్క్ ను మొబైల్ అప్లికేషన్ ను ఉపయోగించి స్మార్ట్ వ్యవసాయం కోసం స్మార్ట్ సాధనాలను రూపొందిస్తున్నామన్నారు. ఈ మేరకు కిట్స్ వరంగల్ ప్రిన్సిపాల్ కె.అశోక రెడ్డి మాట్లాడుతూ కిట్స్ వరంగల్‌లో అత్యాధునిక సాంకేతికతో ప్రాజెక్ట్ రూపొందించామన్నారు. వినూత్న రీతిలో డ్రైవర్ లెస్ ట్రాక్టర్ ను కిట్స్ వరంగల్ నిపుణులు అభివృద్ధి చేశారని చెప్పారు. వ్యవసాయం భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిందన్నారు. తక్కువ ఖర్చుతో ఆటోమేషన్ సాధనాలను ప్రోత్సహించడంతో రైతులు మరింతగా భూమిని సాగుచేయడం, పెట్టుబడి ఖర్చును తగ్గించుకోవడం, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి సహాయపడుతుందన్నారు. ఈ ప్రాజెక్ట్ రైతుల కోసం తక్కువ-ధర ఆటోమేటెడ్ సాధనాలను రూపొందించడానికి ఉద్దేశించిందని చెప్పారు.
మొబైల్ అప్లికేషన్ తో ట్రాక్టర్ రన్నింగ్
సాంకేతిక అంశాల అభివృద్ధిలో పాశ్చాత్య దేశాలతో పోల్చినప్పుడు భారతీయ రైతులు ఉపయోగించే సాధనాలు తక్కువగా ఉన్నాయని ప్రిన్సిపాల్ అశోక్ రెడ్డి తెలిపారు. దేశంలో వరి, గోధుమలు, పండించడానికి అధునాతన సాధనాలు ఉన్నాయని, కానీ వ్యవసాయ పరికరాలను ఆపరేట్ చేయడానికి మానవప్రమేయం అవసరమన్నారు. అంతేకాకుండా మరింత నైపుణ్యం కలిగిన కార్మికులు అవసమన్నారు. ఈ విషయాల్ని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాజెక్ట్‌లో వ్యవసాయంలో మానవ శ్రామిక పనిని తగ్గించాలని ఆలోచించి ఈ వినూత్న రీతిలోప్రాజెక్ట్ చేపట్టామన్నారు. ఇక్కడ రైతులు తమ చిన్న తరహా పొలాలను ఆటోమేటెడ్ టూల్స్‌తో దున్నవచ్చని తెలిపారు. ప్రాజెక్ట్‌లో డ్రైవింగ్ ఇంజిన్‌ను ఉపయోగించి దున్నుతున్న యంత్రం ఆటోమేట్ చేశారని, దీనిని మొబైల్ అప్లికేషన్ (ఒక గేమ్ లాగా) ద్వారా నడుపవచ్చని చెప్పారు.