Srisailam: శ్రీశైలంకు ప్రత్యేక ఏసీ బస్సులు, భక్తులకు టీఎస్‌ఆర్టీసీ శుభవార్త
TSRTC Special Buses: శ్రీశైలం వెళ్లే ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. 10 ప్రత్యేక ఏసీ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.
Special Buses: శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చేసింది. వచ్చే నెలలో పరీక్షలు పూర్తైన తర్వాత విద్యార్థులకు వేసవి సెలవులు రానున్నాయి. విద్యార్థులకు హాలిడేస్ వస్తున్నాయంటే కుటుంబసభ్యులు విహారయాత్రకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. వేసవి సెలవులు ఎక్కువ రోజులు ఉంటాయి కనుక ఈ కాలంలో తల్లిదండ్రులు తన పిల్లలతో కలిసి టూర్స్‌కు వెళుతూ ఉంటారు. ప్రముఖ దేవాలయాలతో పాటు అందమైన ప్రదేశాలకు ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి ఎక్కువమంది తమ ఫ్యామిలీతో ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఒకటైన శ్రీశైలానికి వెళుతూ ఉంటారు. అలాంటి వారికి టీఎస్‌ఆర్టీసీ గుడ్‌న్యూస్ తెలిపింది. నగరం నుంచి శ్రీశైలంకు ఇప్పటివరకు నాన్ ఏసీ బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఏపీ బస్సులను కూడా అందుబాటులోకి తీసుకురావాలని టీఎస్‌ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్ నుంచి శ్రీశైలంకు 85 కొత్త బస్సులను టీఎస్‌ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో 10 ప్రత్యేక ఏసీ బస్సులు కూడా ఉండనున్నాయి. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో ఈ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా జెండా ఊపి ప్రారంభిస్తున్నారు. ఎండాకాలంలో చల్లని వాతావరణంలో శ్రీశైలంకు వెళ్లాలనుకునే భక్తులకు ఏసీ బస్సులు ఉపశమనం కలిగించనున్నాయి. ఇప్పటివరకు ఏసీ బస్సులు లేకపోవడంతో చాలామంది హైదరాబాద్ నుంచి సొంత కార్లు, అద్దె కార్లలో వెళ్తున్నారు. ఇప్పటివరకు నగరం నుంచి శ్రీశైలంకు రోజూ 30 సూపర్ లగ్జరీ బస్సు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉన్నాయి. కానీ ఏసీ బస్సులు లేకపోవడంతో ఎండాకాలంలో సదూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారికి ఇబ్బంది అవుతుంది. ఉక్కబోత, ఎండ వేడికి ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు ఏసీ బస్సులు తీసుకురావడంతో శ్రీశైలం వెళ్లేవారు చల్లటి ప్రయాణం చేయవచ్చు.
అయితే రాజధాని ఏసీ బస్సుల పొడవు ఎక్కువగా ఉండటంతో ఘాట్ రోడ్లలో మలుపులు తిరగడం కష్టంగా ఉంటుంది. దీంతో శ్రీశైలంకు సూపర్ లగ్జరీ బస్సులను మాత్రమే టీఎస్‌ఆర్టీసీ నడుపుతోంది. కానీ ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల తరహాలోనే రాజధాని బస్సులను తయారు చేయించారు. దీంతో ఘాట్ రోడ్లలో ప్రయాణానికి కూడా ఇవి సౌకర్యవంతంగా ఉంటాయి. ఈ బస్సులతో శ్రీశైలంకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని, తర్వాత టీఎస్‌ఆర్టీసీకి కూడా లాభం జరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రయాణికుల అవసరాలకు తగ్గట్లుగా టీఎస్‌ఆర్టీసీ కొత్త బస్సులను తీసుకొస్తుంది. పర్యాటక ప్రదేశాలకు బస్సుల సంఖ్యను పెంచుతుంది. దీని వల్ల టీఎస్‌ఆర్టీసీకి కూడా ఆదాయం వస్తుంది.
అటు ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే నిధులతో టీఎస్‌ఆర్టీసీ ఆదాయం మరింత పెరుగుతుంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీ బస్సులన్నీ మహిళలతో కిటకిటలాడుతున్నాయి. దీంతో మరిన్ని బస్సులను ప్రవేశపెట్టేందుకు అధికారులు సిద్దమవుతున్నారు. అలాగే పురుషుల కోసం కూడా ప్రత్యేక బస్సులను తీసుకొస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ఆ వార్తలను టీఎస్ఆర్టీసీ ఖండించింది. ఇప్పటివరకు అలాంటి ఆలోచన ఏమీ లేదని తెలిపింది. మహిళల రద్దీ దృష్ట్యా ఎక్కువ బస్సులను తీసుకొచ్చే ఆలోచన ఉందని స్పష్టం చేసింది. త్వరలో మరిన్ని ప్రాంతాలకు కొత్త బస్సులను తీసుకురానున్నారు.