(Source: ECI/ABP News/ABP Majha)
Tsrtc News: 'అమ్మను మర్చిపోలేరు, ఆర్టీసీనీ మర్చిపోలేరు' - కొత్త ఆవకాయ లాంటి వార్త చెప్పిన టీఎస్ఆర్టీసీ
Telangana News: అమ్మమ్మ కొత్త ఆవకాయను మిస్ అవుతున్నాం అనుకునే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. ఆవకాయ పచ్చడిని బంధు మిత్రులకు ఎవరైనా పంపాలనుకుంటే తమ సర్వీసుల ద్వారా పంపే ఏర్పాట్లు చేస్తోంది.
Tsrtc Avakaya Pickle Delivery: వేడి వేడి అన్నంలో కాస్త ఆవకాయ వేసుకుని కొంచెం నెయ్యి తగిలించి కలిపి తింటే ఆ రుచే వేరు. వేసవి వచ్చిందంటే మన అమ్మమ్మ పెట్టిన ఆవకాయ పచ్చడే గుర్తొస్తుంది. ప్రస్తుతం పనుల బిజీ, ఫాస్ట్ కల్చర్ కారణంగా ఆనాటి ఆవకాయ రుచిని మరిచిపోతున్నాం. ఎక్కువగా టమాటా, గోంగూర, మామిడి వంటి పచ్చళ్లు బయటనే కొంటున్నాం. ఈ క్రమంలో అమ్మమ్మ చేసే కొత్త ఆవకాయను మిస్ అవుతున్నాం అనుకునే వారికి టీఎస్ఆర్టీసీ (Tsrtc) గుడ్ న్యూస్ చెప్పింది. రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు సులువుగా పంపించేలా ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు పంపించవచ్చని తెలిపారు. తెలంగాణతో పాటు టీఎస్ఆర్టీసీ బస్సు సర్వీసులు తిరిగే ఏపీ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలకు ఆవకాయ పచ్చడిని సంస్థ డెలివరీ చేస్తుందని చెప్పారు. పూర్తి వివరాలకు కాల్ సెంటర్ నెంబర్లు 040 - 23450033, 040 - 69440000, 040 - 69440069 ను సంప్రదించాలని సూచించారు.
ఆవకాయ పచ్చడి ప్రియులకు శుభవార్త! రుచికరమైన అమ్మమ్మ చేతి ఆవకాయ పచ్చడిని మీ బంధువులు, స్నేహితులకు #TSRTC ద్వారా సులువుగా పంపించుకోవచ్చు. మీ సమీపంలోని టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్ల ద్వారా ఆవకాయ పచ్చడిని బంధుమిత్రులకు చేరేవేసే సదుపాయాన్ని సంస్థ కల్పిస్తోంది. తెలంగాణతో పాటు… pic.twitter.com/g0jDldYdJ7
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 20, 2024
గడువు పొడిగింపు
మరోవైపు, శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును టీఎస్ఆర్టీసీ పొడిగించింది. తొలుత ఈ నెల 18 వరకే భక్తులకు బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. ఈ నెల 25 వరకూ బుక్ చేసుకోవచ్చని సంస్థ ఎండీ సజ్జనార్ ట్వీట్ చేశారు. విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు రూ.151లకే పొందే సదవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. కాగా, ఈ నెల 17న రామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించిన సీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తులకు నేరుగా ఇంటికే అందించేలా ఆర్టీసీ చర్యలు చేపట్టింది. టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్ విభాగం వెబ్ సైట్ https://www.tsrtclogistics.in ను సందర్శించి తలంబ్రాలు బుక్ చేసుకోవాలని సజ్జనార్ తెలిపారు. అలాగే, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే వారు 040 - 23450033, 040 - 690000, 040 - 694400669 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలో జరిగిన శ్రీ సీతారామచంద్రుల కల్యాణ తలంబ్రాల బుకింగ్ గడువును #TSRTC పొడిగించింది. ఈ నెల 25 తేదీ వరకు బుకింగ్ చేసుకునే వెసులుబాటును కల్పించింది. రూ.151లకే విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలు పొందే సదావకాశాన్ని వినియోగించుకోవాలని భక్తులను సంస్థ… pic.twitter.com/LK4drrU5Dg
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) April 19, 2024
తలంబ్రాల బుకింగ్ ఇలా
☛ రాములోరి కల్యాణ తలంబ్రాల బుకింగ్ ను టీఎస్ఆర్టీసీ లాజిస్టిక్స్ విభాగం సైట్ లో అందుబాటులో ఉంచారు. తొలుత https://www.tsrtclogistics.in కు వెళ్లి.. తలంబ్రాలు బుకింగ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి.
☛ ఆ తర్వాత మీ చిరునామా, ఇతర వివరాలను ఎంటర్ చేయాలి. తర్వాత తలంబ్రాలు ఎన్ని ప్యాకెట్లు కావాలో ఎంచుకోవాలి. ఒక్కో ప్యాకెట్ ధర రూ.151గా నిర్ణయించారు.
☛ అన్ని వివరాలు పూర్తి చేసిన తర్వాత ఆన్ లైన్ పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. యూపీఐ ద్వారా పేమెంట్ చెయ్యొచ్చు.
☛ పేమెంట్ చెల్లించిన తర్వాత బుకింగ్ సక్సెస్ అయినట్లు ఓ ట్రాన్సాక్షన్ నెంబర్ తో ఆర్టీసీ నుంచి ఓ మెసేజ్ వస్తుంది. ఆ తర్వాత మీ చిరునామాకు కల్యాణ తలంబ్రాలు వస్తాయి.
☛ అటు, ఆఫ్ లైన్ లో తలంబ్రాలు బుక్ చేసుకోవాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ల నెంబర్లైన 040 - 23450033, 040 - 690000, 040 - 694400669ను సంప్రదించి వివరాలు తెలపాలి.