TRS Vs RSP : ప్రవీణ్‌కుమార్‌పై దూకుడుగా టీఆర్ఎస్ ఎదురుదాడి.. బీజేపీ కుట్రలో పావుగా ఉన్నారని విమర్శలు..!
నల్లగొండలో బీఎస్పీలో చేరిక కార్యక్రమంలో టీఆర్ఎస్, కేసీఆర్‌నే ప్రవీణ్ కుమార్ టార్గెట్ చేశారు. బీజేపీ కుట్రలో పావుగానే ఇదంతా చేస్తున్నారని టీఆర్ఎస్ నేతలు విమర్శించారు.
ఏనుగెక్కి ప్రగతి భవన్‌కు వస్తామని చాలెంజ్ చేసిన మాజీ ఐపీఎస్ అధికారి, ప్రస్తుత బీఎస్పీ నేత ఆర్.ఎస్. ప్రవీణ్‌కుమార్‌పై టీఆర్ఎస్ విరుచుకుపడింది. ఆయన బీజేపీ మాయలో పడి తెలంగాణలో రాజకీయాలు చేస్తున్నారని ఆ పార్టీ నేతలు మండిపడ్డారు. నల్లగొండ జిల్లాలో భారీ సభ పెట్టి బీఎస్పీలో చేరిన ప్రవీణ్ కుమార్ టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు. దాంతో నల్లగొండ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆయనపై విరుచుకుపడ్డారు. రాజ్యాధికారం దిశగా వెళ్తున్నామని ప్రవీణ్ కుమార్ అన్నారని.. అసలు ఆ పదానికి అర్థం తెలుసా అని ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. పోలీసు అధికారిగా ఉండి.. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థుల్ని హింసించారని కిషోర్ ఆరోపించారు. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రవీణ్ కుమార్ పని చేస్తే.. స్వీయ రాజకీయ అస్తిత్వం కోసం తెలంగాణను కేసీఆర్ నిలబెట్టారని ఎమ్మెల్యేలు గుర్తు చేశారు.
ఏనుగు ఎక్కి ప్రగతి భవన్‌కు వెళ్తానన్న ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపైనా ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు. ఏనుగు మీద ఎంతమంది పడతారని ప్రశ్నించారు. నల్లగొండ మీటింగ్కు ఏనుగు ఎక్కే వెళ్ళావా.. అసలు బీ ఎస్ పీ సిద్ధాంతం ఏమిటో తెలుసా అని విరుచుకుపడ్డారు. ప్రస్తుతం యూపీలోనే బీఎస్పీ అవసాన దశలో ఉందని.. అక్కడ ప్రధాన కార్యదర్శిగా బ్రాహ్మణుడు ఉన్నాడని గుర్తు చేశారు.
అదే సమయంలో బీజేపీని ఒక్క మాట కూడా విమర్శించని ప్రవీణ్ తీరును వైసీపీ ఎమ్మెల్యే ఎత్తి చూపారు. బీజేపీ బెదిరింపులకు భయపడే ప్రవీణ్ ఐపీఎస్‌కు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారని.. అందుకే వారిపై మాట్లాడటం లేదని ఆరోపించారు. బలమైన ప్రాంతీయ పార్టీ లను విచ్చిన్నం చేయడం చేయాలనుకుంటున్న బీజేపీ కుట్రలో పావుగా మారొద్దని ప్రవీణ్‌కు నేతలు హితవు పలికారు. గురుకులాల్లో ప్రవీణ్ పేరు తెచ్చుకున్నారంటే.. అది కేసీఆర్ ప్రోత్సహించడం వల్లేనని గుర్తు చేశారు. ఏ పార్టీ లోనైనా చేరే హక్కు ఉన్నా.. ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. ప్రవీణ్ భాష మార్చుకోకపోతే మేము కూడా మరింత తీవ్రంగా స్పందిస్తామని హెచ్చరించారు. దళిత బంధు పథకంపై ప్రవీణ్ కుమార్ చేస్తున్న విమర్శలపైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విరుచుకుపడ్డారు.
కేసీఆర్‌ను విమర్శించాలంటే ఆయన కంటే గొప్పోళ్లు అయి ఉండాలని.. టీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. స్వేరోను చూసుకుని విర్రవీగుతున్నారని.. స్వేరో నుంచి మొన్న నాగార్జున సాగర్ లో పోటీ చేసిన అభ్యర్థికి 3వేల ఓట్లు మాత్రమే వచ్చాయని గుర్తు చేశారు. కెసిఆర్ నచ్చనపుడు ఆయన కింద ప్రవీణ్ ఎందుకు ఇంతకాలం పని చేశారని.. ఆయన ఆలోచనలు ఎందుకు అమలు చేశారని నేతలు ప్రశ్నించారు. రాజకీయాల్లో విఫలమైన ఇతర సివిల్ సర్వీస్ అధికారులు జేపీ ,జేడీ లక్ష్మీనారాయణ లాగే ప్రవీణ్ పరిస్థితి ఉంటుందని టీఆర్ఎస్ నేతలు తేల్చి చెప్పారు.