తెలంగాణ ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్ లైలా
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్‌జెండర్ లైలాను ఎంపిక చేసింది.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు రచిస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్...115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు భారీ హామీలు ఇచ్చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. డిసెంబరులో ఎన్నికలు జరగనుండటంతో... ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రచారకర్తగా తొలిసారి ట్రాన్స్‌జెండర్ లైలాను ఎంపిక చేసింది.
ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్ ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇందు కోసం పేరున్న నటులు, సెలబ్రిటీలు, సామాజిక వేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది. వరంగల్ నగరంలోని కరీమాబాద్‌కు చెందిన లైలా 3,600 మంది ట్రాన్స్‌జెండర్లకు నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయించారు.