Revanth Reddy: కేటీఆర్‌కు ఎగ్జామ్ డేటా ఎలా వెళ్లింది, ఈడీ విచారించాలని రేవంత్ డిమాండ్
Revanth Reddy: టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసును ఈడీ విచారించాలని రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ పెద్దలను తప్పించాలనే రాష్ట్ర ప్రభుత్వం సిట్ వేసి తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తోందన్నారు.
Revanth Reddy: పోటీ పరీక్షల్లో ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయి, కటాఫ్ మార్కులు ఎన్ని అనే వివరాలు కేటీఆర్ కు ఎలా తెలుసో ఈడీ విచారించాలంటూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మంత్రి కేటీఆర్ కు ఎగ్జామ్ డేటా ఎలా వెళ్లిందని ప్రశ్నించారు. జగిత్యాల నుండి 415 మంది గ్రూప్ 1 పరీక్ష రాశారన్న విషయం కేటీఆర్ కు ఎలా తెలుసని ఆయన నిలదీశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ వ్యవహారంపై విచారణ జరిపించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇతర నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ఈడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేటీఆర్ కు నిజంగా పరువు ఉంటే టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసును సీబీఐకి అప్పగించాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. పరువు ఉన్నోళ్లు పరువు నష్టం దావా వేయాలన్న రేవంత్.. కేటీఆర్ కు చీము నెత్తురు ఉంటే పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలంటూ లేఖ రాయాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ పరువుకు 100 కోట్లని ఆయన ఎలా నిర్ణయించాడని రేవంత్ ప్రశ్నించారు. 100 కోట్లు ఇస్తే కేటీఆర్ ను ఏమైనా అనొచ్చా అని ప్రశ్నించారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసు విచారణలో “దొంగ”చేతికి తాళం ఇచ్చారన్న అనుమానం నిరుద్యోగుల్లో ఉంది.
— Revanth Reddy (@revanth_anumula) March 31, 2023
సీబీఐ - ఈడీ విచారణతోనే అసలు దొంగలు ఎవరన్నది తేలుతుంది. విచారణ జరపాల్సిందిగా ఈడీని కోరడం జరిగింది.#TSPSC #Paperleak pic.twitter.com/mRSOtdhS74
టీఎస్పీఎస్సీ పేపర్ లీకు కేసులో కావాల్సిన వాళ్లను కాపాడేందుకే సిట్ ఏర్పాటు చేశారని రేవంత్ ఆరోపించారు. గతంలో పలు కేసుల్లో ఇలాగే సిట్ ఏర్పాటు చేయగా.. వాటిని తప్పుదోవ పట్టించారని విమర్శలు చేశారు. ప్రభుత్వం ఇరుకున్న పడ్డప్పుడల్లా సిట్ ను ఏర్పాటు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. పేపర్ లీక్ కేసులో ఏ1గా శంకర్ లక్ష్మీని చేర్చాలని రేవంత్ డిమాండ్ చేశారు. శంకర్ లక్ష్మీకి తెలియకుండా టీఎస్పీఎస్సీలో ఏమీ జరగదని రేవంత్ అన్నారు. ఆర్థిక పరమైన నేరారోపణలు ఉన్నప్పుడు కేసును ఈడీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకు కేసుపై ఢిల్లీలో సీబీఐ, ఈడీకి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. లక్షల మంది నిరుద్యోగులు ఏళ్లకు ఏళ్లు కష్టపడి చదివి పోటీ పరీక్షలు సన్నద్ధమవుతున్నారని అలాంటి వారి జీవితాలతో ఆటలాడొద్దని రేవంత్ రెడ్డి కోరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం జరిగినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదని రేవంత్ విమర్శలు చేశారు. లక్షల మందిపై ప్రభావం పడిన ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటి వరకు ఎందుకు స్పందించడం లేదని రేవంత్ ప్రశ్నించారు.
పేపర్ లీక్ వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలకు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు గుప్పించారు. అందుకే సిట్ ద్వారా కేసును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. కింది స్థాయి ఉద్యోగులను బలి పశువులు చేసి కేసును మూసేయాలని ప్రభుత్వం యోచిస్తోందని రేవంత్ విమర్శించారు. పేపర్ లీకేజీ కేసులో ఇతర దేశాల్లో ఉన్న వాళ్లు కూడా ఉన్నారని రేవంత్ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. పేపర్లు అమ్మి డబ్బులు తీసుకున్న వాళ్లు ఇతర దేశాలకు హవాలా రూపంలో డబ్బులు పంపారని ఆరోపణలు ఉన్నాయని, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఏ నేరమైన ఈడీ విచారణ చేయాల్సిందే అంటూ రేవంత్ డిమాండ్ చేశారు.