Jayaprada BRS : బీఆర్ఎస్‌లోకి జయప్రద ? - మహారాష్ట్ర నుంచి పోటీ చేసే అవకాశం !
మాజీ ఎంపీ, సినీ నటి జయప్రద బీఆర్ఎస్‌లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. మహారాష్ట్ర నుంచి పోటీ చేయించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని తెలుస్తోంది.
Jayaprada BRS : ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద భారత రాష్ట్ర సమితిలో చేరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గతంలోనూ ఇలాంటి ప్రచారం జరిగింది. ఆమె బీఆర్ఎస్ తరపున రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని అనుకున్నారు. కానీ ఆ తర్వాత బీఆర్ఎస్ ఏపీలో రాజకీయ కార్యకలాపాలు తగ్గించుకుంది. కేసీఆర్ తెలంగాణతో పాటు మహారాష్ట్రపైనా గురి పెట్టారు. అందుకే భారత రాష్ట్ర సమితిలో చేరిన తర్వాత.. మహారాష్ట్ర నుంచి ఎన్నికల్లో పోటీ చేసేందుకు జయప్రద ఆసక్తి చూపించినట్లుగా చెబుతున్నారు. కేసీఆర్ కూడా సెలబ్రిట నేతల్ని పార్టీలోకి ఆహ్వానించాలన్న పట్టుదలతో ఉన్నారు. జయప్రదకు రాజకీయాల్లో ఇంకా ఆసక్తి ఉండటంతో ఆమెను పిలిచి.. టిక్కెట్ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది.
గతంలో యూపీ నుంచి ఎంపీగా గెలిచిన జయప్రద
తెలుదేశం పార్టీతో రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ జయప్రద తర్వాత ఉత్తరాది రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. బాలీవుడ్ సూపర్ హిట్ సినిమాల్లో నటించి దేశవ్యాప్తంగా గుర్తింప తెచ్చుకున్న జయప్రద.. సమాజ్ వాదీ పార్టీలో కీలకంగా పని చేశారు. రెండు సార్లు రాంపూర్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ములాయం సింగ్ యాదవ్ చేతి నుంచి సమాజ్ వాదీ పార్టీ.. అఖిలేష్ యాదవ్ చేతికి వెళ్లిన తర్వాత జయప్రదకు ఆదరణ లభించలేదు. జయప్రద రాజకీయ గురువు అయిన అమర్ సింగ్ చనిపోవడంతో.. రాజకీయంగా జయప్రద ఒంటరి అయ్యారు. ఇతర పార్టీల్లో చేరే ప్రయత్నాలు కూడా సక్సెస్ కాలేదు.
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫెయిల్
తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లోకి రావాలని జయప్రద చాలా సార్లు ఆసక్తి కనబరిచారు. పలు పార్టీల్లో చేరుతారన్న ప్రచారం జరిగింది కానీ..త ఏదీ కార్యకరూపంలోకి రాలేదు. ఆమెకు దేశవ్యాప్తంగా ఉన్న పేరు ప్రఖ్యాతుల కారణంగా ఎక్కడైనా పోటీ చేసే స్టేచర్ ఉందని కేసీఆర్ గుర్తించారు. అందుకే మహారాష్ట్రలో పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లుగా చెబుతున్నారు. మహారాష్ట్రలో గ్రామీణ ప్రాంత నియోజకవర్ం కాకుండా.. పట్టణ ప్రాంత ఎంపీ నియోజకవర్గం నుంచి నిలబడితే జయప్రద సునాయసంగా గెలుస్తారని బీఆర్ఎస్ అధినేత అంచనా వేస్తున్నరని అంటున్నారు.
మహారాష్ట్రపై కేసీఆర్ ప్రత్యేక దృష్టి
వచ్చే ఎన్నికల్లో మహారాష్ట్ర, తెలంగాణల్లోని అన్ని స్థానాలను గెలిచి కేంద్రంలో చక్రం తిప్పాలని కేసీఆర్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర కలిపితే అరవైకిపైగా లోక్ సభ సీట్లు బీఆర్ఎస్ కు వస్తాయని భావిస్తున్నారు. అందుకే బీఆర్ఎస్ అధినేత.. మహారాష్ట్రపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తరచూ అక్కడ పర్యటిస్తున్నారు. మరికొంత మంది మహారాష్ట్ర సెలబ్రిటీలను కూడా పార్టీలో చేర్చుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.