TGSRTC: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ - ప్రధాన దేవాలయాలకు ప్రత్యేక బస్సులు, పూర్తి వివరాలివే!
Telangana News: కార్తీక మాసం వేళ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు సంస్థ ఎండీ సజ్జనార్ ప్రకటించారు.
TGSRTC Special Buses To Siva Temples: తెలంగాణ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పవిత్ర కార్తీకమాసం వేళ తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన శివాలయాలకు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ (VC Sajjanar) తెలిపారు. శ్రీశైలం, వేములవాడ, ధర్మపురి, కీసరగుట్ట తదితర దేవాలయాలకు హైదరాబాద్ నుంచి ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ఆర్టీసీ పనితీరు, కార్తీక మాసం ఛాలెంజ్, శబరిమల ఆపరేషన్స్, మహాలక్ష్మి - మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వంటి అంశాలపై హైదరాబాద్ బస్ భవన్ నుంచి సజ్జనార్ వర్చువల్‌గా ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్తీక మాసం, శబరిమల యాత్రలు ఆర్టీసీకి ఎంతో కీలకమని.. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఆది, సోమవారాల్లో శైవ క్షేత్రాలకు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని.. అందుకు అనుగుణంగా ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
➡️ కార్తీక మాసంలో శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు
— VC Sajjanar - MD TGSRTC (@tgsrtcmdoffice) November 2, 2024
➡️ అరుణాచలం, పంచారామాలకు ప్రత్యేక ప్యాకేజీలు
➡️ టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ వెల్లడి
➡️ ఆర్టీసీ పనితీరుపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం
పవిత్ర కార్తీక మాసంలో ప్రసిద్ధ శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం… pic.twitter.com/9QVcSK5YmX
ఈ నెల 15న కార్తీకపౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని అరుణాచలానికి ప్రత్యేక ప్యాకేజీ అందిస్తున్నట్లు సజ్జనార్ తెలిపారు. అలాగే, ఏపీలోని పంచారామాలకు ప్రతి సోమవారం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు చెప్పారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం ప్రయాణికులు https://tgsrtcbus.in లో చూసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్లు 040 - 69440000, 040 - 23450033ను సంప్రదించాలని సూచించారు.
బస్ ఆన్ కాంట్రాక్ట్ ఛార్జీలు తగ్గింపు
అటు, అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ బస్సు ఛార్జీలు తగ్గించినట్లు సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. పల్లెవెలుగు కిలోమీటరుకు రూ.11, ఎక్స్ ప్రెస్ రూ.7, డీలక్స్ రూ.8, సూపర్ లగ్జరీ రూ.6, రాజధాని రూ.7 మేర తగ్గించినట్లు చెప్పారు. శబరిమలకు, శుభ ముహూర్తాలకు అద్దెకు ఆర్టీసీ బస్సులను బుకింగ్ చేసుకుని.. క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు.
కురుమూర్తి జాతరకు..
మరోవైపు, మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రసిద్ధ క్షేత్రమైన శ్రీకురుమార్తి జాతరకు వెళ్లే భక్తులకు సౌకర్యార్థం ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు అధికారులు తెలిపారు. జాతరలో ప్రధాన ఘట్టమైన ఉద్దాల ఉత్సవం ఈ నెల 8వ తేదీన ఉండగా.. 7 నుంచి 9వ తేదీ వరకూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో ఆయా రోజుల్లో స్పెషల్ సర్వీసులను హైదరాబాద్ నుంచి అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. ఎంజీబీఎస్ (MGBS) నుంచి ఆరాంఘర్, మహబూబ్‌నగర్ మీదుగా బస్సులు కురుపూర్తి జాతరకు వెళ్తాయి. ఈ స్పెషల్ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్‌ను ఆర్టీసీ సంస్థ కల్పిస్తోంది. టికెట్ల బుకింగ్ కోసం tgsrtcbus.in వెబ్ సైట్‌ను సంప్రదించాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. ఈ ప్రత్యేక బస్సులను ఉపయోగించుకుని సురక్షితంగా శ్రీ కురుమూర్తి స్వామిని దర్శించుకోవాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం భక్తులను కోరుతోంది.
Also Read: Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం