(Source: ECI/ABP News/ABP Majha)
Sadar Sammelan: యాదవుల సదర్ సమ్మేళనను రాష్ట్ర పండుగగా ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం
Telangana State Festivals | యాదవుల సదర్ సమ్మేళన ను తెలంగాణ రాష్ట్ర పండుగగా గుర్తించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం సదర్ సమ్మేళనంను రాష్ట్ర పండుగగా ఉత్తర్వులు జారీ చేసింది.
Telangana Govt has declared Sadar Sammelan as state festival - హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని యాదవ సోదరులకు శుభవార్త చెప్పింది. యాదవులు ఎంతో ఘనంగా నిర్వహించే సదర్ వేడుకలను రాష్ట్ర ప్రభుత్వ పండుగగా గుర్తించారు. సదర్ వేడుకలను రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. హైదరాబాద్ (Hyderabad), సికింద్రాబాద్ జంట నగరాల్లో యాదవులు సదర్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటారు. యాదవ సోదరులు వేడుకగా నిర్వహించే పండుగను ఇక నుంచి రాష్ట్ర పండుగ (Telangana State Festival)గా ప్రభుత్వం సదర్ వేడుకలు నిర్వహించనుంది.
దీపావళి సమయంలో సదర్ వేడుకలు
ఈ సదర్ వేడుకలకు దాదాపు 70 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. సికింద్రాబాద్, హైదరాబాద్ జంట నగరాలతో సదర్ సమ్మేళన నిర్వహణ చాలా ఫేమస్. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా యాదవ సోదరులు సదర్ వేడుకలు నిర్వహిస్తుంటారు. దీపావళి పండుగ సమయంలో యాదవులు సదర్ పండగను ఘనంగా నిర్వహించుకుంటారు. నగరంలోని ముషీరాబాద్లో అతిపెద్ద సదర్ సమ్మేళనం నిర్వహిస్తారు. దీపావళి తరువాత రెండో రోజు నిర్వహించే దున్నపోతులతో నిర్వహించే సదర్ వేడుకలకు పెద్ద ఎత్తున హాజరవుతుంటారు. యాదవులు దున్నపోతులను ప్రదర్శించి వేడుక చేస్తారు.
సదర్ అర్థమేంటో తెలుసా..
సదర్ అంటే హైదరాబాదీ వ్యవహారికం ప్రకారం 'ప్రధానమైనది' అని అర్థం. అంటే యాదవ సామాజికవర్గం ఒక ప్రధాన ఉత్సవంగా ఈ సదర్ సమ్మేళనం నిర్వహించుకుంటారు. దున్నపోతులతో కుస్తీ పట్టడానికి యువకులు పోటీపడతారు. నగరంలోని ఖైరతా బాద్, సైదాబాద్, కాచిగూడ, నారాయణగూడ, బోయిన్‌పల్లి, ఈస్ట్‌మారెడ్ పల్లి, కార్వాన్, పాతబస్తీ చప్పల్ బజార్, మధురాపూర్, ముషీరాబాద్ ప్రాంతాల్లో ఈ ఉత్సవాలు జరుగుతాయి. గతంలో తెలంగాణలోని జిల్లాల నుంచి దున్నలను హైదరాబాద్ తీసుకొచ్చి సదరన్ వేడుకల్లో పోటీల్లో నిలిపేవారు. గత 10, 15 ఏళ్ల కిందట నుంచి పంజాబ్, హర్యానా లాంటి రాష్ట్రాల నుంచి సైతం భారీ దున్నపోతులను హైదరాబాద్ తీసుకొచ్చి ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణ పండుగలు..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం నుంచి అంత ఆధరణకు నోచుకోని బతుకమ్మ, బోనాలను తెలంగాణ రాష్ట్ర ఏర్పాటయ్యాక గుర్తించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ, బోనాలను రాష్ట్ర పండుగలుగా ప్రకటించింది. దాంతో దసరా, బతుకమ్మ, బోనాలను రాష్ట్ర ప్రభుత్వాలు వేడుకగా నిర్వహిస్తూ వస్తున్నాయి. తాజాగా సదర్ సమ్మేళనం వేడుకను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం గుర్తించింది. వచ్చే ఏడాది నుంచి సదర్ వేడుకను సైతం ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనుంది.