TSPSC Group 2 Exam: తెలంగాణ గ్రూప్ 2 పరీక్షలు వాయిదా, కొత్త తేదీలు ప్రకటించిన టీఎస్ పీఎస్సీ
TSPSC postponed Group 2 exams: తెలంగాణలో గ్రూప్ 2 పరీక్షలను టీఎస్ పీఎస్సీ మరోసారి వాయిదా వేసింది. ఎన్నికల కారణంగా ఎగ్జామ్ వాయిదా వేసినట్లు కమిషన్ తెలిపింది.
TSPSC Group 2 exam date:
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగ నియామక పరీక్షలు మరోసారి వాయిదా వేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కారణంగా గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేసినట్లు టీఎస్ పీఎస్సీ తెలిపింది. నవంబర్ 2, 3 తేదీలలో జరగాల్సిన పరీక్షలను వచ్చే ఏడాది జనవరి 6, 7 తేదీలలో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీఎస్ పీఎస్పీ గ్రూప్ 2 వాయిదా వేసినట్లు స్పష్టం చేసింది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. నవంబర్ 30న అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయని ఈసీ ఇదివరకే ప్రకటించింది. గతంలో ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలను అభ్యర్థు కోరిక, భవిష్యత్ దృష్టిలో ఉంచుకుని నవంబర్ కు వాయిదా వేయడం తెలిసిందే. తాజాగా ఎన్నికల నేపథ్యంలో మరోసారి వచ్చే ఏడాదికి గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా వేశారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని సమావేశంలో కమిషన్ నిర్ణయించింది. కొత్త తేదీల ఖరారుకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు.
పరీక్షలకు హాజరుకానున్న 5.5 లక్షల అభ్యర్థులు..
రాష్ట్రంలో మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు సంబంధించి 5,51,943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వీరికి ఓఎంఆర్ విధానంలో పరీక్షలు నిర్వహించనుంది టీఎస్‌పీఎస్సీ. గతంలో గ్రూప్-2 పరీక్ష నిర్వహించాక డబుల్ బబ్లింగ్‌పై న్యాయవివాదాలు తలెత్తాయి. దీంతో ఫలితాల వెల్లడికి దాదాపు రెండేళ్లకు పైగా సమయం పట్టింది. ప్రస్తుతం గ్రూప్-2 నిర్వహణలో ఎలాంటి సమస్యలు లేకుండా, వివాదాలకు ఆస్కారం లేకుండా కమిషన్ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలుగా గుర్తించిన పాఠశాలలు, కళాశాలలకు జిల్లా విద్యాధికారులు, ఇంటర్‌బోర్డు ద్వారా సమాచారం పంపించింది. వారాంతపు సెలవుల్లో పరీక్ష నిర్వహించాలని భావించినప్పటికీ, అప్పటికే వేర్వేరు కేంద్రప్రభుత్వ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. దీంతో ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్షలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించింది. కానీ అభ్యర్థులు రిక్వెస్ట్ చేయడంతో నవంబర్ 2, 3 తేదీలలో ఎగ్జామ్ కు నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణ కారణంగా జనవరి 6, 7 తేదీలలో గ్రూప్ 2 నిర్వహించాలని టీఎస్ పీఎస్సీ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణలో ఖాళీగా ఉన్న 783 'గ్రూప్-2' పోస్టుల భర్తీకి డిసెంబరు 29న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ పోస్టుల భర్తీకి జనవరి 18న ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16తో ముగిసింది. ఆగస్టులో పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. అయితే అదే సమయంలో ఒకటేసారి పలు రిక్రూట్ మెంట్ పరీక్షలు ఉన్నాయని, అన్ని ఎగ్జామ్స్ కు ప్రిపరేషన్ కు టైమ్ లేదని అభ్యర్థులు కోరడంతో సీఎం కేసీఆర్ మన్నించారు. ఎగ్జామ్స్ వాయిదా వేసి, అభ్యర్థుల భవిష్యత్ కోసం సరైన నిర్ణయం తీసుకుని షెడ్యూల్ ఇవ్వాలని సూచించగా నవంబర్ కు ఎగ్జామ్స్ మార్చారు. కానీ ఎన్నికలు ఉంటాయని తెలిసినా టీఎస్ పీఎస్సీ నవంబర్ చివర్లో గ్రూప్ 2 షెడ్యూల్ చేయడంతో పరీక్ష మరోసారి వాయిదా పడిందని అభ్యర్థులు, నిరుద్యోగులు భావిస్తున్నారు.
గ్రూప్-2 టిఫికేషన్ ద్వారా మున్సిపల్ కమిషనర్, ఏసీటీవో, తహసిల్దార్, సబ్-రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, మండల పంచాయతీ అధికారి, ప్రొహిబిషన్ & ఎక్సైజ్ సబ్ ఇన్‌స్పెక్టర్, అసిస్టెంట్ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ప్రొబేషన్ ఆఫీసర్, అసిస్టెంట్ బీసీ డెవలప్‌మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.