Governor Tamilisai: పెండింగ్ బిల్లులపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు గవర్నర్ లేఖలు- తెలంగాణలో అనూహ్య పరిణామం
Governor Tamilisai: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అరుదైన రాజ్యాంగ నిబంధనను అమలు చేశారు.
Governor Tamilisai: తెలంగాణ ప్రభుత్వం - గవర్నర్ తమిళిసై మధ్య పరిస్థితి ఉప్పు - నిప్పులా ఉంది. విమర్శలు, ప్రతివిమర్శలతో రెండు రాజ్యాంగ వ్యవస్థలు ఘర్షణ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పలు బిల్లులపై గవర్నర్ చర్య వార్తల్లో నిలిచింది. ఆర్టీసీ బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తడం సహా ఆర్టీసీ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించడం వంటివి జరిగాయి. గవర్నర్ తీరుపై రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు గుర్రుగా ఉన్నారు. ఈ సమయంలోనే గవర్నర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చాలా అరుదుగా వాడే రాజ్యాంగ నిబంధన ఆర్టికల్ 174(2) ను గవర్నర్ వాడారు. చాలా అరుదుగా మాత్రమే వాడే ఈ ఆర్టికల్ ను తమిళిసై అమలు చేయడం మరోసారి రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.
ఆర్టికల్ 175(2) ప్రకారం గవర్నర్.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు నేరుగా లేఖ రాయవచ్చు. శాసనసభలో పెండింగ్ లో ఉన్న బిల్లుకు సంబంధించి రాష్ట్ర శాసనసభకు లేదా ఇరు సభలకు సందేశాలు పంపవచ్చు. అలాగే గవర్నర్ సూచనలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది అని ఆర్టికల్ 175(2) చెబుతోంది. అసెంబ్లీ సమావేశాల్లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ద్వారా పెండింగ్ బిల్లులపై తమిళిసై రాష్ట్ర అసెంబ్లీ ఉభయ సభలకు సందేశం పంపించారు. సాధారణంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ద్వారా గవర్నర్లు ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతారని, ఇది అరుదైన ఘటన అని న్యాయ నిపుణులు అన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు 2023, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయిస్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌అన్యువేషన్) (సవరణ) బిల్లు 2022, తెలంగాణ మున్సిపల్(సవరణ) బిల్లు 2022 లపై గవర్నర్ ఇరు సభల సభ్యులకు లేఖ రాశారు.
దశాబ్దాల తర్వాత సభ్యులకు గవర్నర్ సందేశం
బిల్లులను గవర్నర్ తమిళిసై ప్రభుత్వానికి తిరిగి పంపడంతో వాటిని మళ్లీ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. వీటిని ఇప్పుడు మళ్లీ రాజ్ భవన్ కు పంపితే, వాటిపై సంతకం చేయడం మినహా గవర్నర్ చేసేదేమీ లేదు. అలాగే గవర్నర్ ఇరు సభల సభ్యులకు పంపిన సందేశాన్ని చదివారా.. చర్చ జరిగిందా లేదా అని తెలుసుకోవాలని అనుకుంటున్నట్లు రాజ్ భవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే గవర్నర్ నుంచి ఒక సందేశం వచ్చిందని, దానిని సభ్యులందరికీ పంపించినట్లు స్పీకరం సభకు తెలియజేశారు.