Hydra Ordinance : కబ్జా దారులకు చట్టబద్దమైన హెచ్చరిక - హైడ్రా ఆర్డినెన్స్‌కుగవర్నర్ ఆమోదం !
Telangana : హైడ్రాకు చట్టబద్దతపై వస్తున్న ప్రశ్నలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆన్సర్ ఇచ్చింది. ఆర్డినెన్స్ తీసుకు వచ్చింది. గవర్నర్ ఆమోదించారు.
Telangana Governor approved the Hydra Ordinance : హైడ్రా కూల్చివేతల్ని ఇక ఎవరూ ఆపలేరు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆర్డినెన్స్‌కు గవర్నర్ ఆమోద ముద్రవేశారు. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ జీహెచ్ఎంసీ చట్టంలో సవరణ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ ను గవర్నర్‌కు పంపింది. జీహెచ్ఎంసీ చట్టంలో కొత్తగా 374(బి) సెక్షన్ చేరుస్తున్నట్లుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఆస్తులు కాపాడేందుకు జీహెచ్ఎంసీ అధికారాలు హైడ్రాకు అప్పగించారు. జలాశయాలు, రోడ్లు, పార్కులు, ఇతర ఆస్తులను కాపాడే బాధ్యత అధికారి లేదా ఏజెన్సీకి అప్పగించే అధికారం ప్రభుత్వానికి కల్పిస్తూ ఆర్డినెన్సు జారీ చేశారు. అంటే ఆ అధికారి లేదా ఏజెన్సీ హైడ్రా అవుతుంది.
హైడ్రా చట్టబద్దతను ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్లు
హైడ్రా కూల్చివేతలను వ్యతిరేకిస్తూ.. ఆ సంస్థ చట్టబద్ధతను ప్రశ్నిస్తూ న్యాయస్థానాల్లో అనేక పిటిషన్లు దాఖలవుతున్నాయి. ఈ కారణంగా చట్టబద్దత కలిపించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా అసెంబ్లీని నిర్వహించి చట్టాన్ని ఆమోదించాలని అనుకున్నా.. అంత అవసరం లేదని ముందుగా ఆర్డినెన్స్ జారీ చేస్తే సరిపోతుందని నిర్ణయానికి వచ్చారు. ఆ మేరకు ఆర్డినెన్స్ తయారు చేసి గవర్నర్‌కు పంపారు. పరిశీలన జరిపిన గవర్నర్ ఆమోద ముద్ర వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా ఇప్పుడు హైడ్రాకు చట్టబద్ధత వచ్చేసినట్లే.
కొండా సురేఖకు పదవీ గండం - రాజీనామా చేయాలని హైకమాండ్ ఒత్తిడి !
కూల్చివేతలు ఆపేందుకు శుక్రవారం హైకోర్టు నిరాకరణ
శుక్రవారమే హైడ్రాకు తెలంగాణ హైకోర్టు నుంచి గుడ్ న్యూస్ వినిపించింది. హైడ్రా కూల్చివేతలు తక్షణమే ఆపాలని ప్రజాశాంతి అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు ఇప్పటికిప్పుడు హైడ్రా కూల్చివేతలు ఆపలేమని స్పష్టం చేసింది. హైడ్రా, రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు పంపింది. తదుపరి విచారణ అక్టోబర్ 14 కి వాయిదా వేసింది. చట్టబద్దత కల్పించినందున ఇప్పుడు ఈ పిటిషన్లను హైకోర్టు తిరస్కరించే అవకాశం ఉంది.
నాగార్జునకు వరుస సమస్యలు - మాదాపూర్ పీఎస్‌లో కబ్జా కేసు నమోదు
ప్రభుత్వ భూములు, చెరువుల కబ్జాల్లో మాత్రమే హైడ్రా కూల్చివేతలు
హైడ్రా ఎలాంటి ప్రైవేటు భవనాలను కూల్చబోదని ప్రభుత్వ స్థలాలు, చెరువులను కబ్జా చేసి నిర్మించిన వాటిని మాత్రమే కూలుస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెప్పారు. రెండు నెలల నుంచి జరుగుతున్న కూల్చివేతల వల్ల.. మొదట్లో పెద్దల ఫామ్ హౌస్‌లు కూల్చేసినప్పుడు ప్రజల్లో పాజిటివ్ స్పందన వచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా హైడ్రా లాంటి వ్యవస్థలు ఉండాలని అనుకున్నారు. అయితే ఆ తర్వాత మధ్యతరగతి ప్రజల ఇళ్లు కూల్చేస్తున్నారని ప్రచారం ఉద్ధృతంగా సాగడంతో వ్యతిరేకత వచ్చింది. మూసీలోని ఇళ్లు కూడా హైడ్రా మార్కింగ్ చేస్తోందని ప్రచారం జరగడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఆ తర్వాత హైడ్రా మళ్లీ కూల్చివేతలు చేపట్టలేదు. ఇప్పుడు ఆర్డినెన్స్ వచ్చినందున తదుపరి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.