Telangana Doctors: నకిలీ డాక్టర్ల చికిత్సకు కర్ణాటక ప్రభుత్వాన్ని ఫాలో కావాలంటున్న తెలంగాణ వైద్యులు
Color Coded Boards: రాష్ట్రంలో నకిలీ, అర్హత లేని వైద్యులను గుర్తించేందుకు కర్ణాటక తరహాలో నీలం, ఆకు పచ్చ బోర్డుల విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ వైద్యులు కోరుతున్నారు.
Color Coded Boards In Telangana: తెలంగాణలో నకిలీ ప్రైవేటు డాక్టర్ల (Fake Doctors) గుర్తింపునకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గుర్తింపు పొందిన వైద్యులు కోరుతున్నారు. నకిలీ, అర్హత లేని వైద్యులను గుర్తించేందుకు కర్ణాటక (Karnataka Model) తరహా విధానాన్ని అమలు చేయాలని కోరుతున్నారు. కర్ణాటకలో ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు తమ ఆసుపత్రుల ముందు నీలం రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు ఏర్పాటు చేయాలని అక్కడి ప్రభుత్వం ఆదేశించింది. ఈ విధానాన్ని తెలంగాణలో అమలు చేయాలని స్థానిక వైద్యులు కోరుతున్నారు.
కర్ణాటక ప్రభుత్వం కలర్ కోడ్
పెరుగుతున్న రోగాలకు తోడు కర్ణాటకలో ప్రైవేటు ఆస్పత్రులు విపరీతంగా పెరిగిపోయాయి. రోగులు అసలైన వైద్యులు, ఆస్పత్రులను గుర్తించలేక డబ్బుతో పాటు ప్రాణాలు కోల్పోతున్నారు. వారికి చెక్ పెట్టేందుకు కర్ణాటక సర్కార్ ఆస్పత్రుల ముందు కలర్ కోడెడ్ బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించింది. నిజమైన వైద్యులను గుర్తించేందుకు, ఏ తరహా వైద్యుడో తెలుసుకునేలా బోర్డులు పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఎంబీబీఎస్, స్పెషలిస్ట్ ప్రైవేట్ డాక్టర్లు నీలం రంగు బోర్డులు, ఆయుర్వేద డాక్టర్లు ఆకుపచ్చ బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
ప్రజలకు కన్పించేలా బోర్డులు
కర్ణాటక ప్రైవేట్ మెడికల్ ఎస్టాబ్లిష్‌మెంట్ చట్టం ప్రకారం గుర్తింపు పొందిన ప్రతి వైద్యుడు తాము నిర్వహిస్తున్న ఆస్పత్రుల ముందు కలర్ కోడెడ్ బోర్డు ఏర్పాటు చేయాలి. అలాగే బోర్డుపై రిజిస్ట్రేషన్ నంబర్, ఆసుపత్రి పేరు, యజమాని, సంబంధిత వివరాలను తప్పనిసరిగా పొందుపరచాలి. ఆయా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులు అందిస్తున్న సేవలు ప్రదర్శించాలి. ఈ సమాచారం అంతా ప్రజలకు కనిపించేలా ఆసుపత్రి ఆవరణలో బహిరంగ ప్రదేశంలో ఉంచాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. దీనివల్ల అర్హత లేని ప్రాక్టీషనర్లను రోగులు గుర్తించేంచి మోసపోకుండా ఉండే అవకాశం ఉంటుందని కర్ణాటక ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు కలర్ కోడెడ్ బోర్డులు పెట్టని ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు కూడా చేపట్టనుంది. ఈ మేరకు అక్కడి ఆస్పత్రులకు దీని గురించి హెచ్చరికలు సైతం జారీ చేసింది.
నకిలీ డాక్టర్లకు చెక్ పెట్టొచ్చు
కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్థానిక గుర్తింపు పొందిన, స్పెషలిస్ట్ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు. ఇప్పుడు అది కాస్తా దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఆస్పత్రుల ముందు నీలం, ఆకుపచ్చ రంగు బోర్డులు ఉండడం వల్ల రోగులు మోసపోరని, నకిలీ డాక్టర్లను సులభంగా గుర్తించి వారిపై చర్యలు తీసుకోవచ్చని అక్కడి అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం సైతం జరిమానాలు విధించడానికి సిద్ధమవడంతో నకిలీ వైద్యుల్లో భయం కలుగుతుందని, తద్వారా ప్రజల ప్రాణాలు సైతం కాపాడవచ్చని చెబుతున్నారు.
తెలంగాణలోను అమలు చేయాలి
కర్ణాటక తరహాలోనే నీలం, ఆకుపచ్చ రంగుల బోర్డుల విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. తెలంగాణ వ్యాప్తంగా చాలా చోట్ల ఆర్‌ఎంపీ, పీఎంపీ ప్రాక్టీస్ చేసేవారు కూడా బోర్డులు పెట్టుకుని డాక్టర్లుగా చెలామణి అవుతున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో డాక్లర్లమని చెప్పుకునే నకిలీ వైద్యులకు ఇలాంటి నిబంధన చెక్ పెడుతుందని చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ సైతం దీనిపై సానుకూలంగా స్పందించారు. నకిలీ వైద్యుల నుంచి రోగులను రక్షించడానికి ఈ విధానం ఉపయోగపడుతుందని శ్రీనివాస్ చెప్పారు.