Congress: వరి దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలి... దిల్లీలో విందు చేసుకుని వచ్చారు ... కాంగ్రెస్ నేతల హాట్ కామెంట్స్
తెలంగాణ కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష ముగిసింది. వరి వేస్తే ఉరి కాదు రైతులు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉరి వేస్తారని కాంగ్రెస్ నేతలు ఘాటుగా విమర్శించారు. ఈ సభలో 9 తీర్మానాలు చేశారు.
హైదరాబాద్ ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద రెండ్రోజుల పాటు కాంగ్రెస్ చేపట్టిన వరి దీక్ష ముగిసింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు.
కేసీఆర్, మంత్రులు విందు చేసుకుని వచ్చారు : రేవంత్
రాష్ట్రంలో రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై చర్చలు జరిపేందుకు అవగాహన లేని మంత్రులను దిల్లీకి పంపారని విమర్శించారు. వరి పంట గురించి మంత్రులు కేటీఆర్, మహమూద్ అలీకి ఏంతెలుసని రేవంత్ ప్రశ్నించారు. ధాన్యం దిగుబడి వచ్చి 45 రోజులు గడిచినా సేకరణ చేయడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నిర్లక్ష్యం వల్లే వేల టన్నుల ధాన్యం వానల్లో తడిసిపోయిందన్నారు. వద్దంటే వరి వేశారనే కక్షతోనే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేయటంలేదని ఆరోపించారు. దిల్లీ వెళ్లిన సీఎం కేసీఆర్ ప్రధాని అపాయింట్‌మెంట్ కూడా కోరలేదన్నారు. కేసీఆర్, మంత్రులు దిల్లీలో విందు చేసుకుని వచ్చారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ లో అందరూ పీసీసీ ప్రెసిడెంట్లే : కోమటిరెడ్డి
కాంగ్రెస్ వరి దీక్ష సభలో మాట్లాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలపై విమర్శలు చేశారు. వరి వేస్తే ఉరి కాదు రైతులంతా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉరి వేస్తారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా అందరం కలిసి పనిచేస్తామన్నారు. కాంగ్రెస్ లో అందరం పీసీసీ ప్రెసిడెంట్లే అన్న కోమటిరెడ్డి... పదవులు ముఖ్యం కాదన్ని తెలిపారు. కేసీఆర్ సంపాదన నిజాం కంటే ఎక్కువ అని కోమటిరెడ్డి విమర్శించారు. రైతులకు మద్దతుగా దిల్లీలో వెయ్యిమందితో దీక్ష చేస్తామన్నారు. ఈ దీక్షకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను ఆహ్వానిస్తామన్నారు.
సమస్యను పక్క దారి పట్టిస్తున్నారు : జానారెడ్డి
కాంగ్రెస్ వరి దీక్షతో రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కావాలని సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. కాంగ్రెస్ వరి దీక్షకు సంఘీభావం తెలిపిన పార్టీలు, ప్రజాసంఘాలకు ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ దేశంలో అనేక సమస్యలను పరిష్కరించిందని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిందన్నారు. ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని జానారెడ్డి గుర్తుచేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరి మీద ఒకరు నేపాన్ని నెడుతూ సమస్యను పక్క దారిపట్టిస్తున్నాయని ఆరోపించారు. ప్రజలు రెండు పార్టీలను పక్కకు పెట్టే సమయం వచ్చిందన్నారు.
తొమ్మిది తీర్మానాలు ఆమోదం
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన వరి దీక్షలో 9 తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు. కిసాన్ కాంగ్రెస్ నేతలు కోదండరెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ తీర్మానాలు ప్రవేశపెట్టారు.
1. ప్రస్తుత ఖరీఫ్ వరి ధాన్యాన్ని తక్షణమే కొనుగొలు చేయాలి. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి
2. తడిసిన ధాన్యాన్ని కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలి.
3. ధాన్యం కొనుగోలు వ్యవస్థలో రైస్ మిల్లర్ల ప్రమేయం ఉండకూడదు.
4. గత రబీ పంట సేకరణలో జరిగిన అవకతవకల వల్ల రైతుకు జరిగిన ఆర్థిక నష్టాల మీద సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలి.
5. యాసంగి పంటల సాగు విషయంలో ఆంక్షలు పెట్టకూడదు. భూమి స్వభావం, వనరుల అనుకూలత ఆధారంగా రైతుకు సాగుపై స్వేచ్ఛ ఉండాలి.
6. మద్దతు ధరల పరిధిలో ఉన్న ప్రధానమైన పంటలను మద్దతు ధరకు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలి.
7. వ్యవసాయ పంటలకు సమగ్ర మద్దతు ధర, కొనుగోలు విషయంలో చట్ట బద్ధత కల్పించాలి.
8. సమగ్రమైన విత్తన చట్టాన్ని తెచ్చి కల్తీ విత్తనాల బారి నుంచి రైతును కాపాడాలి.
9. ఏకకాలంలో లక్ష రూపాయల పంటల రుణమాఫీ చేయాలి. ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన పంట నష్టం 2020- 21 సంవత్సరాలకు కోర్టు ఆదేశల అనుసరం పంట నష్ట పరిహారం వెంటనే రైతులకు చెల్లించాలి.
Also Read: వేదికపై పాదాభివందనం చేసిన రేవంత్ రెడ్డి.. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా?
రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదు : సీతక్క
రైతు పోరాటం మోదీ ప్రభుత్వ మెడలు వంచిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. రైతుల పోరాటానికి కేసీఆర్ మద్దతు ఇవ్వలేదని, వారిని పట్టించుకోలేదన్నారు. రైతు మరణాలకు అసెంబ్లీలో కనీసం సంతాపం కూడా తెలపలేదన్నారు. కేంద్రం, రాష్ట్రం కుమ్మక్కై వరి సాగు చేయొద్దంటున్నారని విమర్శించారు. ఓవైసీ, మోదీ వేరు వేరు కాదన్నారు. మోదీ వ్యతిరేక ఓట్లను ఓవైసీ చీల్చి బీజేపీకి సహాయం చేస్తున్నారన్నారు. రైతుల కోసం ఎంతటి త్యాగానికైనా కాంగ్రెస్ సిద్ధమని సీతక్క అన్నారు.
Also Read: సెప్టిక్ ట్యాంకులోకి దిగిన కూలీలు.. లోపలే ఇద్దరు దుర్మరణం, కారణం ఏంటంటే..
రైతుకు పట్టిన చీడ కేసీఆర్ : కోదండరాం
కేసీఆర్ రైతుకు పట్టిన పెద్ద చీడగా మారారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం అన్నారు. ఇసుక లారీలను పదిరోజులు ఆపితే వరి ధాన్యం ట్రాన్స్ పోర్ట్ చేయొచ్చన్నారు. దిల్లీకి వెళ్లి తేల్చుకు వస్తా అన్న కేసీఆర్ ఫామ్ హౌజ్ లో పడుకున్నారన్నారు. దిల్లీకి వెళ్లి వచ్చాక ఏం జరిగిందో ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ను పోతం పెట్టడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. రైతులు ఏ పంట వేయాలో చెప్పలేని అసమర్థ ప్రభుత్వం ఉందన్నారు. కేసీఆర్ రైతు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని ఆరోపించారు.
Also Read: హాస్టల్‌లో భూతం! ఒంటిపై రక్కుతూ, వింత అరుపులు.. అసలేం జరిగిందంటే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి