Telangana Assembly Elections 2023 : బీజేపీలో కనిపించని ఎన్నికల హడావుడి- కాంగ్రెస్,బీఆర్ఎస్‌పై ఆశలు పెట్టుకుందా!
Telangana Assembly Elections 2023 : ఎన్నికల ముందు తెలంగాణలో ఆసక్తికరంగా రాజకీయం సాగుతోంది. ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీల్లో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది.
Telangana Assembly Elections 2023 : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్. ఎన్నికల సంఘం అక్టోబరు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్...115 మందితో అభ్యర్థుల జాబితాను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోస్తోంది. రేపో మాపో స్క్రీనింగ్ కమిటీ సమావేశమై...అభ్యర్థులను ఖరారు చేసేందుకు రెడీ అవుతోంది. అయితే బీజేపీలో మాత్రం ఎలాంటి ఉలుకుపలుకు లేదు.
ఎన్నికల ముందు తెలంగాణలో ఆసక్తికరంగా రాజకీయం సాగుతోంది. ఇన్నాళ్లు అధికార బీఆర్ఎస్ పై విమర్శలు, ఆరోపణలు చేసిన బీజేపీల్లో ఏదో తెలియని గందరగోళం కనిపిస్తోంది. కొద్దిరోజుల క్రితం వరకు రాబోయేది తమ ప్రభుత్వం అంటూ...దూకుడు చూపించిన బీజేపీ నేతలు ప్రస్తుతం డిఫెన్స్ లో పడిపోయారు. టిక్కెట్ల కేటాయింపు తర్వాత గులాబీదళంలో లుకలుకలు మొదలవుతాయని...అది తమకు లాభిస్తుందని లెక్కలు వేసుకుంది కాషాయపార్టీ. అయితే బీజేపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయి. కేసీఆర్ ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినా... ఒకటీ, అరా తప్పా పెద్దగా అసంతృప్తులు లేకుండా గులాబీబాస్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక హస్తం పార్టీ విషయానికి వస్తే... 119 నియోజకవర్గాలకు 1025 దరఖాస్తులు వచ్చాయ్. అభ్యర్థులపై కాంగ్రెస్ పార్టీ సర్వే నిర్వహిస్తోంది. సర్వే ఆధారంగా నియోజకవర్గాలకు సీట్లు ఖరారు చేయనుంది.
బీజేపీలో మాత్రం ఏ నియోజకవర్గానికి ఎవరు పోటీ చేస్తారన్న దానిపై...ఇప్పటికీ క్లారిటీ లేదు. అసలు 119 నియోజకవర్గాలకు అభ్యర్థులు ఉన్నారా ? అన్న దానిపై సందిగ్తత కొనసాగుతోంది. బీజేపీలో కూడా కాంగ్రెస్ లాగే ఎలక్షన్ కమిటీ ఉంది. బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్ జవదేకర్ ఇన్‌చార్జిగా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి కన్వీనర్‌గా ఉన్నారు. ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ అంటూ ఈటల రాజేందర్ అధ్యక్షుడిగా మరో కమిటీ వేసినా.. బీజేపీలో అభ్యర్థుల ఎంపికపై ఇంతవరకు ఎలాంటి చర్చలు జరగలేదు. ఎలక్షన్ కమిటీయే అభ్యర్థుల ఎంపిక చూస్తుందని బీజేపీ వర్గాల చెబుతున్నాయ్. ఈ కమిటీ ఇన్‌చార్జిగా ప్రకాశ్ జవదేకర్ ఒకసారి హైదరాబాద్ వచ్చివెళ్లారే కాని అభ్యర్థుల ఎంపికపై ఎలా ముందుకు వెళ్లాలో రోడ్ మ్యాప్ ఇవ్వలేదని చెబుతున్నారు.
అధికార పార్టీ దాదాపు అన్ని నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించి ప్రచార పర్వంలోని దిగేసినా.. బీజేపీలో ఇంకా ఎన్నికల జోష్ కన్పించడం లేదు. ఎన్నికల వేళ కొందరు నేతలు...గుడ్ బై చెప్పడంతో పార్టీకి పెద్ద మైనస్ గా మారింది. బీఆర్ఎస్ నుంచి అసమ్మతి నేతలు వస్తారని అనుకుంటే...ఇప్పటి వరకు ఒక్కరు రాలేదు. ఆ చాప్టర్ ముగియడంతో...ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున టికెట్ దక్కని నేతల కోసం ఎదురుచూస్తోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లలో పరిణామాలను బీజేపీ జాగ్రత్తగా పరిశీలిస్తోంది. వివిధ నియోజకవర్గాల్లో ఆయా పార్టీల ముఖ్య నేతలు, గెలిచే, గణనీయంగా ప్రభావం చూపే వారు ఎవరెవరన్న విషయాన్ని ఆరా తీస్తోంది. అందులో గెలిచే అవకాశాలు ఉండీ... టికెట్లు దక్కనివారిని బీజేపీలోకి చేర్చుకుని, బరిలోకి దింపే అవకాశాలను పరిశీలిస్తోంది. ఈ నెల 27న బీజేపీ అగ్రనేత అమిత్‌షా రాష్ట్ర పర్యటన తర్వాత 40–45 మంది అభ్యర్థులతో తొలిజాబితా విడుదల చేస్తారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి.