శ్రీధర్ బాబు సిక్సర్ కొడతారా ? సబితా పంచ్ ఇస్తారా ?
తెలంగాణలో కొందరు నేతలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమ నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ ప్రజల్లో పట్టు సాధించారు. రాష్ట్రం వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచినా వారిని విజయాలే వరించాయ్.
తెలంగాణలో కొందరు నేతలు ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. తమ నియోజకవర్గాల్లో వరుసగా గెలుస్తూ ప్రజల్లో పట్టు సాధించారు. రాష్ట్రం వ్యాప్తంగా వ్యతిరేక పవనాలు వీచినా వారిని విజయాలే వరించాయ్. అలాంటి వారిలో శ్రీధర్ బాబు ముందు వరుసలో ఉంటారు. 1999 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ గాలి వీచింది. మంథనిలో మాత్రం శ్రీధర్ బాబు గెలుపొందారు.
తండ్రి వారసత్వంతో శ్రీధర్ బాబు
మాజీ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్‌బాబు, ఆరోసారి కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్నారు. 1999, 2004, 2009, 2018 వరుస ఎన్నికల్లో గెలుపొందారు. ఒక్క 2014లో మాత్రమే శ్రీధర్ బాబు ఓటమి పాలయ్యారు. బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు చేతిలో పరాజయం పొందారు. ఆ తర్వాత 2018 ఎన్నికల్లో పుట్ట మధుపై శ్రీధర్ బాబు గెలుపొందారు. 2009 లో గెలిచిన శ్రీధర్ బాబు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఆయన తండ్రి దుద్దిళ్ల శ్రీపాదరావు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఉమ్మడి రాష్ట్రంలో స్పీకర్ గా పని చేశారు. స్పీకర్ పదవికే వన్నె తెచ్చారు శ్రీపాదరావు.
సబితా ఇంద్రారెడ్డి పాంచ్ పటాకా పేలుస్తారా ?
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి...ఇప్పటికే నాలుగుసార్లు విజయం సాధించారు. మొదటి సారి 2000 సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో...చేవెళ్ల నుంచి పోటీ చేసి తొలిసారి గెలుపొందారు. ఆ తర్వాత 2004లోనూ అక్కడి నుంచే విజయం సాధించారు. రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు తొలి మహిళా హోం శాఖ మంత్రిగా పని చేశారు. అంతకు ముందు ఆమె భర్త ఇంద్రారెడ్డి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హోం శాఖ మంత్రిగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండు వేర్వేరు పార్టీల నుంచి గెలుపొందారు. భార్యాభర్తలు ఇద్దరు హోం శాఖ మంత్రులుగా పని చేసి రికార్డు నెలకొల్పారు ఇంద్రారెడ్డి, సబితా రెడ్డి. 2009లో మహేశ్వర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగి...కాంగ్రెస్ తరపున గెలుపొందారు. వైఎస్ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో పోటీ దూరంగా ఉన్న ఆమె...2018లో గెలుపొందిన తర్వాత గులాబీ కండువా కప్పుకున్నారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే...ఐదోసారి గెలుచినట్లవుతుంది.
మైనంపల్లి ఫోర్ కొడతారా ?
మల్కాజ్‌గిరి సిట్టింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు...ఇప్పటికే మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. నాలుగోసారి అదృష్టం పరీక్షించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలోని రామాయంపేట నుంచి 2008 ఉప ఎన్నికల్లో మొదటిసారి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో తెలుగుదేశం అభ్యర్థిగా మెదక్ స్థానం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2014లో మల్కాజిగిరి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2017లో ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2018లో మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు.
రాజేంద్ర నగర్ లో ప్రకాశ్ గౌడ్ హ్యాట్రిక్
రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు గెలుపొందారు టి.ప్రకాశ్‌గౌడ్. 2009, 2014లో తెలుగుదేశం పార్టీ తరపున విజయం సాధించిన ప్రకాశ్‌గౌడ్...రాష్ట్ర విభజన తర్వాత బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 2018లో రాజేంద్రనగర్ నుంచి గెలుపొంది హ్యాట్రిక్ కొట్టారు. 2023లోనూ బరిలోకి దిగారు. పార్టీలు మారినా వరుస ఎన్నికల్లో విజయం సాధిస్తున్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్ కొట్టారు మంచిరెడ్డి కిషన్‌రెడ్డి. నాలుగోసారి గులాబీ పార్టీ తరుపున పోటీ చేస్తున్నారు. 2009లో తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2014లోనూ అదే పార్టీ నుంచి గెలుపొందారు. రాష్ట్ర విభజనతో బీఆర్ఎస్‌లో చేరారు. గత శాసనసభ ఎన్నికల్లో గులాబీ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం నుంచి నాలుగోసారి పోటీ చేస్తున్నారు.