(Source: ECI/ABP News/ABP Majha)
Telangana ACB Kaleswaram : కాళేశ్వరంపై ఏసీబీకి కంప్లైంట్ - అప్పుడే మెదలు పెట్టారా ?
Kaleswaram Complaint : కాళేశ్వరంలో అవినీతిపై ఏసీబీకి ఓ లాయర్ ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేయించాలని కోరారు.
Telangana New CM Revanth Reddy : తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా బీఆర్ఎస్ సర్కార్ చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని విచారణ చేపట్టాలని తెలంగాణ ఏసీబీకి ఫిర్యాదు అందింది. హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది రాపోలు భాస్కర్ మాజీ సీఎం కేసీఆర్, హరీశ్‌రావు, కవిత, మేఘా కృష్ణారెడ్డి, ఇంజనీర్ ఇన్ చీఫ్ వెంకటేశ్వర్లపై కేసు నమోదు చేయాలని వినతిపత్రం అందజేశారు. ఫేక్ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్లు దోపీడీ జరిగిందని భాస్కర్ చెప్పారు. తాగు, సాగునీటి ప్రాజెక్టు పేరిట ఆర్థిక అవతవకలకు పాల్పడ్డారని భాస్కర్ తెలిపారు. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి విచారణ జరపాలని కోరారు.
తాగు, సాగు నీటి ప్రాజెక్టు పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా ఆర్థిక అవతవకలు జరిగాయని, నకిలీ ఎస్టిమేషన్ల ద్వారా వేలాది కోట్ల ప్రజాధనం దోపిడీకి గురైందని ఆరోపించారు. తెలంగాణ ప్రాంతంలోని ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు తాగునీరు, సాగునీరు అందించేందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే నిర్ణయం జరిగిందన్నారు. మొత్తం ప్రాజెక్టు పనులు 7 లింకుల కింద 228 ప్యాకేజీలు నాటి ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని అయితే పనులు జరుగుతున్న సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ముఖ్యమంత్రిగా కేసీఆర్, మంత్రులుగా హరీష్ రావు, కేటీఆర్, ఎంపీగా కవిత ఎన్నికయ్యారని ఆ తర్వాత వీరంతా ప్రాజెక్టు అలైన్మెంట్లు, డిజైన్లు మార్చివేసి కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిని, అంచనాలను పెంచారని ఆరోపించారు.
మొత్తంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచుకోవాలని ప్రణాళిక రచించారని దీనిపై కేసు నమోదు చేసి సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. ఇలా ప్రభుత్వం మారగానే అలా ఏసీబీకి ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. కేసీఆర్ ప్రభుత్వం.. కాళేశ్వరంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తాము వచ్చిన తర్వాత అవినీతిని బయటకు తీస్తామని ఆ సంపదను ప్రజలకు పంచుతామని ఎన్నికల ప్రచారంలో చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా, అన్నారం బ్యారేజీ వద్ద లీకులు కనిపించాయి. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారని ఆరోపించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలిరోజే ఏసీబీకి ఈ ఫిర్యాదు రావడంతో ఎటువంటి చర్యలు ఉండబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.కాళేశ్వరం ప్రాజెక్టు దాదాపుగా లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టు . మేఘా కంపెనీ రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు చేపడుతుంది. ఈ సంస్థలపై ఫిర్యాదు వెళ్లడంతో ఏం జరగబోతోందోనన్న చర్చ ప్రారంభమయింది. తెలంగాణ మంత్రులు సహా అనేక మందిపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఎవర్నీ వదిలి పెట్టే అవకాశం ఉండదని కాంగ్రెస్ వర్గాలు ఇప్పటికే ప్రకటించాయి.