Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
Sabarimala Trains: శబరిమల అయ్యప్ప భక్తులకు ద.మ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. తెలుగు రాష్ట్రాల నుంచి వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది.
Special Trains To Sabarimala: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) గుడ్ న్యూస్ చెప్పింది. యాత్ర దృష్ట్యా ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. ఏపీ, తెలంగాణల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ 8 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఈ నెల 22, 29 తేదీల్లో మౌలాలి (హైదరాబాద్) - కొల్లాం, ఈ నెల 24, డిసెంబర్ 1వ తేదీల్లో కొల్లాం - మౌలాలి, నవంబర్ 18, 25 తేదీల్లో మచిలీపట్నం - కొల్లాం, నవంబర్ 20, 27 తేదీల్లో కొల్లాం - మచిలీపట్నం ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.
"SCR to run Additional Pre - Sabarimala Special Trains" @drmsecunderabad @drmvijayawada pic.twitter.com/6VvQjsFfk5
— South Central Railway (@SCRailwayIndia) November 15, 2024
మరిన్ని ప్రత్యేక రైళ్లు
- ఈ నెల 17, 24 తేదీల్లో కాచిగూడ - కొట్టాయం (రైలు నెం. 07131/07132) రైలు కాచిగూడ నుంచి ఆదివారం మధ్యాహ్నం 12:30కు బయలుదేరి తర్వాతి రోజు సాయంత్రం ఆరున్నరకు కొట్టాయం చేరుకుంటుంది. ఈ రైలు మల్కాజిగిరి, చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికూడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట్, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో అవే స్టేషన్ల మీదుగా కాచిగూడ చేరుకుంటుంది.
- ఈ నెల 18, 25 తేదీల్లో కాచిగూడ - కొట్టాయం - కాచిగూడ రైలు (07133/07134) సోమవారం రాత్రి 8:50కు కాచిగూడ నుంచి బయలుదేరి బుధవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కొట్టాయం చేరుతుంది. ఈ రైలు కాచిగూడ నుంచి షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట, సేలం, ఈరోడ్, తిర్పూర్, కోయంబత్తూర్, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకుళం, ఎట్టుమనూర్ స్టేషన్ల మీదుగా కొట్టాయం చేరుతుంది.
- ఈ నెల 19, 26 తేదీల్లో హైదరాబాద్ - కొట్టాయం - హైదరాబాద్ (07135/07136) మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు బయల్దేరి బుధవారం సాయంత్రం 4 గంటలకు కొట్టాయం చేరుతుంది.
- ఈ నెల 16, 23, 30 తేదీల్లో సికింద్రాబాద్ - కొట్టాయం - సికింద్రాబాద్ (07137/07138) రైలు కొట్టాయంలో శనివారం రాత్రి 9:45 గంటలకు బయల్దేరి తిరిగి సోమవారం రాత్రి 12:50కు సికింద్రాబాద్ చేరుతుంది. సికింద్రాబాద్‌లో ఈ రైలు నవంబర్ 15, 22, 29 తేదీల్లో బయల్దేరుతుంది.
- నాందేడ్ - కొల్లం - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (07139/07140) ఈ నెల 16న నాందేడ్‌లో, 18న కొట్టాయంలో బయల్దేరుతుంది. అలాగే, ఈ నెల 23, 30 తేదీల్లో మౌలాలి - కొల్లం - మౌలాలి రైలు (07141/07142) మౌలాలి నుంచి బయల్దేరుతుంది. కొల్లాంలో ఈ నెల 25న బయల్దేరుతుంది.
దర్శనాలు ప్రారంభం
అటు, శబరిమల అయ్యప్ప క్షేత్రంలో దర్శనాలు శుక్రవారం నుంచి ప్రారంభమయ్యాయి. మండలం - మకరవిళక్కు సీజన్‌లో భాగంగా సాయంత్రం నుంచి దర్శనాలకు భక్తులను అనుమతిచ్చారు. తొలి రోజే వర్చువల్ బుకింగ్ ద్వారా దాదాపు 30 వేల మంది భక్తులు నమోదు చేసుకున్నట్లు సమాచారం. భక్తుల రద్దీ దృష్ట్యా గంట ముందే ఆలయాన్ని తెరిచినట్లు ట్రావెన్ కోర్ దేవస్వం బోర్డు వెల్లడించింది. ఈ సీజన్‌లో దర్శన సమయాలను 18 గంటలకు పొడిగించినట్లు తెలిపింది. శనివారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ గర్భగుడిని ప్రధానార్చకుడు అరుణ్ కుమార్ నంబూద్రి తెరవనున్నట్లు పేర్కొంది.