Sircilla CESS Election : సిరిసిల్ల సెస్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ హవా, వేములవాడ రూరల్ ఓట్ల లెక్కింపులో గందరగోళం!
Sircilla CESS Election : రాజన్న సిరిసిల్ల సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగుతోంది. 15 స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది.
Sircilla CESS Election : సిరిసిల్ల సెస్ ఎన్నికల కౌంటింగ్ లో బీఆర్ఎస్ పార్టీ 15 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులు అంతగా సత్తాచాటలేకపోయాయి. సెస్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర కొనసాగించడంతో జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. విజయం సాధించిన బీఆర్ఎస్ అభ్యర్థులకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల (సెస్) కౌంటింగ్ లో సోమవారం జరిగింది. సెస్ ఎన్నికల ఫలితాల్లో ముందు నుంచి బీఆర్ఎస్ అభ్యర్థుల హవా కొనసాగింది. వేములవాడ రూరల్ ఓట్ల లెక్కింపులో గందరగోళం నెలకొంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ముందుగా ప్రకటించారు. 5 ఓట్ల మెజార్టీ మాత్రమే ఉండడంతో బీఆర్ఎస్ శ్రేణులు రీకౌంటింగ్ కు పట్టుబట్టాయి. దీంతో పోలీసులు స్వల్ప లాఠీఛార్జ్ చేసి ఆందోళనకారులను అక్కడి నుంచి పంపించేశారు.
రేపు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక
సిరిసిల్ల జిల్లాలో జరిగిన సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఎన్నికల కౌంటింగ్ సోమవారం జరిగింది. ఉదయం 8 గంటలకు సెస్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభించారు. ఈ ఎన్నికల్లో 15 స్థానాలకు అభ్యర్థులు పోటీపడ్డారు. వేములవాడ జూనియర్ కళాశాలలో సెస్ పోలింగ్ ఓట్ల లెక్కింపు నిర్వహించారు. సెస్ ఎన్నికల్లో 15 స్థానాలకు వివిధ పార్టీలకు చెందిన 75 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లో ఉన్న 87,130 మంది ఓటర్లకు గాను 73,189 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నికల అనంతరం 84 శాతం పోలింగ్ నమోదు అయిందని ఎన్నికల అధికారులు ప్రకటించారు. సెస్ ఎన్నికల కౌంటింగ్ కోసం వేములవాడకు సంబంధించి ఏడు కౌంటింగ్ కేంద్రాలు, సిరిసిల్లకు 8 కౌంటింగ్ కేంద్రాలను అధికారులు సిద్ధం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. మంగళవారం సెస్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ల ఎన్నిక నిర్వహించనున్నారు.
విలీన గ్రామాల ఓటర్ల నిరసన
సెస్ ఎన్నికల కౌంటింగ్ లో గందరగోళం నెలకొంది. వేములవాడ రూరల్ బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ముందుగా అధికారులు ప్రకటించారు. అయితే మెజార్టీ 5 ఓట్లు మాత్రమే ఉండటంతో రీకౌంటింగ్ నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు ఆందోళన చేశారు. దీంతో బీజేపీ నేతలు కూడా ఆందోళన చేపట్టారు. ఇరుపార్టీల నేతల ఆందోళనత కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అధికారులు, పోలీసులు బీఆర్ఎస్ కు మద్దతు పలుకుతున్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. అధికారుల తీరుకు నిరసనగా బీజేపీ నేతలు కౌంటింగ్ కేంద్రం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ఇరు పార్టీల నేతలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని అక్కడ నుంచి పంపించేశారు. సిరిసిల్ల మున్సిపల్ విలీన గ్రామాలలో అధికార పార్టీకి ఓటర్లు చిట్టిలతో నిరసన తెలిపారు. బలవంతంగా ఇష్టం లేకుండా మున్సిపాలిటీలో విలీనంపై కొన్ని గ్రామాలు అసహనంతో ఉన్నాయి. సిరిసిల్ల సెస్ ఎన్నికల పోలింగ్ బ్యాలెట్ బాక్స్ లో మున్సిపల్ వద్దు గ్రామపంచాయతీ ముద్దు అంటూ ఓటర్లు చిట్టిలపై రాసి బ్యాలెట్ పేపర్ తో కలిపి చీటీలు వేసి నిరసన తెలిపారు,విలీన గ్రామాల ఓటర్లు అధికార పార్టీ మెజార్టీపై ప్రభావం చూపే పరిస్థితులు ఏర్పడ్డాయి.