Sharmila Vs Tammineni : షర్మిల, తమ్మినేని మధ్య బీ టీమ్ పంచాయతీ - అసలు గొడవెక్కడంటే ?
షర్మిల , తమ్మినేని వీరభద్రం పరస్పరం విమర్శలు చేసుకున్నారు. మీ పార్టీనే బీటీమ్ అంటూ పరస్పరం ఆరోపించుకున్నారు.
Sharmila Vs Tammineni : బీ టీమ్ మీ పార్టీ అంటే మీ పార్టీ అని వాదులాడుకున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. టీ సేవ్ పేరుతో ఓ ఫోరం పెట్టి అందరం కలిసి పోరాడదామని షర్మిల తిరుగుతున్నారు. అన్ని పార్టీల నేతల్ని కలుస్తున్నారు. అలా.. కమ్యూనిస్టుల కార్యాలయాలకూ వెళ్లారు. సీపీఎం నేత తమ్మినేని వీరభద్రంతో ఈ అంశంపై చర్చించిన సమయంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బీజేపీకి బీ టీం అని విమర్శించారు. ఈ విమర్శలపై షర్మిల మండిపడ్డారు. తాము బీజేపీని మత తత్వ పార్టీ అని విమర్శిస్తున్నామని తాము ఎవరికీ బీ టీమ్ కాదని స్పష్టం చేశారు. కమ్యూనిస్టులే బీఆర్ఎస్ బీ టీంగా మారారారని విమర్సించారు.
నిజానికి షర్మిల వచ్చి కలవక ముందే తమ్మినేని వీరభద్రం షర్మిల తీరుపై విమర్శలు గుప్పించారు. నిరుద్యోగుల భవిష్యత్తు కోసం కలిసి పని చేద్దామని షర్మిల తనకు కూడా ఫోన్ చేసిందని.. అది వాస్తవమేనని అన్నారు. ఆమెతో కలిసి పని చేయడానికి తాము కూడా సిద్ధమే అని చెప్పుకొచ్చారు. కానీ షర్మిలకు ఆదాని, మోడీల దోపిడీ ఎందుకు గుర్తుకు రావడం లేదని తమ్మినేని వీరభద్రం మండిపడ్డారు. మైనారిటీల మీద విపరీతంగా దాడులు జరుగుతున్నాయి. కానీ, వీటి మీద ఆమెకు నోట మాటరావడం లేదు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. షర్మిల వ్యవహారం జగుస్సాకరంగా ఉంది.. అంటూ నిప్పులు కురిపించారు.
వైయస్సార్ టిపి అధినేత్రి షర్మిల ఇలాంటి రాజకీయ నాటకాలను మానుకోవాలని హితవు పలికారు. ఉద్యమాల్లో కలిసి రమ్మని ఎన్నోసార్లు మేము పిలిచాం.. కానీ ఆమె ఒక్క రోజు కూడా రాలేదు. ఇప్పుడు లిసి పని చేద్దాం అంటూ ఫోన్ చేశారంటూ మండిపడ్డారు. కెసిఆర్ మీద, బీఆర్ఎస్ మీద బిజెపి వేధింపులు మానుకోవాలని.. కక్ష సాధింపు కేసులు మానుకోవాలని చెప్పుకొచ్చారు. నిజంగానే కవిత తప్పు చేస్తే శిక్షించాలి అన్నారు. తెలంగాణలో పరీక్ష పత్రాల లీక్ పై సిట్టింగ్ జడ్జిని పెట్టి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. టిఆర్ఎస్ తో వచ్చే ఎన్నికల్లో కలుస్తామా లేదా అనేది చర్చనే లేదన్నారు.
తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ప్రయత్నిస్తున్న షర్మిల .. పేపర్ లీకేజీలపై అన్ని పార్టీలతో కలిసి పోరాటం చేయాలని అనుకుంటున్నారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలకు ఫోన్ చేశారు. వీరద్దరూ ఆయా పార్టీలతో కలిసి పని చేసే ప్రశ్నే లేదని తేల్చి చెప్పారు. అయినా షర్మిల తన ప్రయత్నాలు మానుకోలేదు. ఇతర పార్టీలను కలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దాదాపుగా అన్ని పార్టీలనూ సంప్రదిస్తున్నారు కానీ.. కావాలంటే షర్మిలను వచ్చి తమ పార్టీతో కలిసి పోరాటం చేయమంటున్నారు కానీ అందరూ కలిసి టీ సేవ్ ఫోరంగా ఏర్పడటానికి మాత్రం ఆసక్తి చూపించడం లేదు.