BRS MLC Race : రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం 20 మంది పోటీ - కేసీఆర్ ఎవరికి చాన్సిస్తారు ?
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ స్థానాల కోసం టీఆర్ఎస్‌లో సీనియర్లు పోటీ పడుతున్నారు. కేసీఆర్ దృష్టిలో ఎవరున్నారు ?
BRS MLC Race : తెలంగాణలో రెండు గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవులపై గులాబీ అధిష్టానం తీవ్రంగా వడపోత మొదలు పెట్టింది. శాసనమండలిలో మే 27న గవర్నర్ కోటాలో రెండు ఎమ్మె ల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. క్రిస్టియన్ మైనార్టీ నుంచి డి. రాజేశ్వర్ రావు, ముస్లిం మైనార్టీ నుంచి ఫారూఖ్ హుస్సేన్ పదవి కాలం ముగుస్తోంది. మూడు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. వీరిద్దరిలో ఎవరికైనా మళ్లీ చాన్స్ ఇస్తారా లేదా అన్నదానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. గవర్నర్ కోటా కావడంతో .. మరింత జాగ్రత్తగా అభ్యర్థుల్ని కేసీఆర్ ఎంపిక చేయాల్సి ఉంది. కేసులు ఉంటే గవర్నర్ తిప్పి పంపే అవకాశం ఉంది. హుజూరాబాద్ ఎన్నికల తర్వాత గవర్నర్ కోటాలో తెలంగాణ కేబినెట్ పాడి కౌశిక్‌ను సిపార్సు చేసింది. ఆ ఫైల్‌ను గవర్నర్ తమిళ సై మూడు నెలల పాటు పెండింగ్‌లోనే పెట్టారు. తర్వాత వెనక్కి పంపారు.
రెండు ఎమ్మెల్సీల కోసం ఇరవై మందికిపైగా పోటీ
బీఆర్‌ఎస్ అధినేత పరిశీలనలో చాలా మంది పేర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా కొందరి పేర్లు వడపోతలో భాగంగా పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. విద్యా వేత్తలకు ఇస్తే అందులో టీఎస్‌పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, పీఎల్ శ్రీనివాస్‌తో పాటు మరో ఇద్దరు ముగ్గురు పేర్లు వినిపి స్తున్నాయి. బీసీ కోటలో దాసోజు శ్రవణ్, బూడిద బిక్షమయ్య గౌడ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోం ది. ఇప్పటి వరకు ఎమ్మెల్సీ కోటాలో విద్యార్థి నేతలకు అవ కాశం కల్పించలేదు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండ టంతో వీరికి ఒక్క స్థానం కేటాయించే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో పార్టీకి చేసిన సేవలకు గతంలో సీఎం కేసీఆర్ రెండు మూడు స్థానాల్లో పోటీ చేయాలని ఘంటా చక్రపాణిని అడిగారు. అప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లో ఆసక్తి లేదని తెలపడంతో టీఎస్‌పీఎస్సీ తొలి చైర్మన్‌గా నియమించారు. పదవి ముగిసిన తర్వాత ప్రస్తుతం ఖాళీగా ఉన్నారు.
ఖాళీ అవుతున్న రెండూ మైనార్టీ కోటానే.. ఒక్కటైనా మైనార్టీకి కేటాయిస్తారా ?
క్రిస్టియన్, ముస్లిం మైనార్టీల ఎమ్మెల్సీ పదవి కాలం ముగుస్తోంది కాబట్టి.. ఆ వర్గాల నుంచి వారికి చాన్సివ్వాల్సి ఉంది. ప్రస్తుతం రాజేశ్వరరావు క్రిస్టియన్ మైనార్టీ, ఫారూఖ్ హుస్సేన్ ముస్లిం మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్నారు. తనకు మరో మారు రెన్యూవల్ చేయాలని రాజేశ్వరరావు కోరుతున్నారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన రాజేశ్వర్ రావు వరుసగా మూడో సారి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. జీహెచ్ఎంసీకి మాజీ కో ఆప్షన్ సభ్యురాలు విద్యావర్ధని కూడా క్రిస్టియన్ సామాజికవర్గం నుంచి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. ఇదే కోటాలో ఎమ్మెల్సీ కవిత అనుచరుడు, తెలంగాణ ఫుడ్స్ చైర్మన్ మేడే రాజీవ్ సాగర్ పేరు కూడావినిపిస్తోంది. మెదక్ జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కూడా వచ్చే నెలలో రిటైర్ కానున్నారు. ఫారూఖ్ హుస్సేన్ మరోమారు రెన్యూవల్ చేయాలని అధినేతను కోరినట్టు తెలుస్తోంది. కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్ మైనార్టీ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు.
పార్టీలో అంతర్గత సమస్యల పరిష్కారానికి కొంత మందికి పదవులివ్వక తప్పదు!
గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇటీవలే బీజేపీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన శ్రవణ్ దాసోజు, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో పార్టీలో టిక్కెట్ల కోసం పోటీ కారణంగా తుమ్మల నాగేశ్వర్ రావుకు అవకాశం కల్పిస్తారనే చర్చ కూడా ఉంది. పాలేరు నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్‌లో చేరారు. ఆయనకే టిక్కెట్ ఖరారు చేసే అవకాశం ఉంది. తుమ్మలను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం ద్వారా ఎలాంటి ఇబ్బంది ఉండదని అధినేత భావిస్తున్నారని అంటున్నారు. గౌడ సామాజికవర్గానికి చెందిన వారెవరూ అసెంబ్లీలో, మండలిలో లేరు.. నిజామాబాద్ జిల్లాకు చెందిన వీజీగౌడ్ ఇటీవలే ఎమ్మెల్సీగా రిటైర్ అయ్యారు. గౌడ్ ఈక్వేషన్ ను పరిగణనలోకి తీసుకుంటే మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్ లో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. మరో ఆరు నెలల్లో ఎన్నికలు ఉన్నందున పొలిటికల్ ఈక్వేషన్లు, సర్దుబాట్లను పరిగణనలోకి తీసుకొన్న మీదటే సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.