Secunderabad Bjp Meeting : బీజేపీ విజయసంకల్ప సభ, భారీగా తరలివచ్చిన శ్రేణులు, హాజరైన ప్రజాగాయకుడు గద్దర్
Secunderabad Bjp Meeting : సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప సభ నిర్వహిస్తుంది. ఈ సభలో పాల్గొన్న బీజేపీ నేతలు సీఎం కేసీఆర్ పై విమర్శలు చేశారు. ప్రధాని మోదీ ఈ సభలో ప్రసంగించనున్నారు.
Secunderabad Bjp Meeting : సికింద్రాబాద్ పేరెడ్ గ్రౌండ్ లో బీజేపీ విజయ సంకల్ప సభకు ఆ పార్టీ శ్రేణులు భారీగా తరలివచ్చాయి. హెచ్ఐసీసీలో రెండురోజుల పాటు నిర్వహించిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు హైదరాబాద్ లో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ప్రధాని మోదీ ప్రజలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.
ప్రధాని మోదీ బంగారు తెలంగాణ తెస్తారు- ఈటల
బీజేపీ విజయ సంకల్ప సభలో ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. రూ. 33 కోట్ల ప్రజాధనంతో టీఆర్ఎస్ ఫ్లెక్సీలు, హోర్డింగ్ పెట్టారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ముఖం చూసేందుకు ప్రజలు ఇష్టపడకపోయినా బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రధాని మోదీ ఫ్లెక్సీలు లేకుండా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. ఫ్లెక్సీలు చింపేసినంత మాత్రాన 130 కోట్ల మంది హృదయాల్లో ప్రధాని మోదీ ఉన్నారని ఈటల అన్నారు. ప్రధాని మోదీ దళితులకు అగ్రపీఠం ఇచ్చారని, కానీ సీఎం కేసీఆర్ దళిత ముఖ్యమంత్రిని చేస్తానని చెప్పి మాటతప్పారని విమర్శించారు. దళితులు, గిరుజనులపై సీఎం కేసీఆర్ కు గౌరవం ఉంటే ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు తెలిపాలన్నారు. ప్రధాని మోదీ అండతో బంగారు తెలంగాణ తెస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. బీజేపీ సంకల్ప సభలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి కాషాయ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ జాతీయాధ్యక్షుజు జేపీ నడ్డా కొండా విశ్వేశ్వరరెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.
బీజేపీ సభలో గద్దర్
బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రజాగాయకుడు గద్దరు పాల్గొన్నారు. ప్రధాని మోదీ ఏం మాట్లాడతారో వినడానికి వచ్చానని గద్దర్ అన్నారు. దేశం, తెలంగాణ గురించి ప్రధాని ఏం చెప్తారో చూడాలన్నారు. ప్రధాని మోదీ మాట్లాడిన తర్వాత తాను స్పందిస్తానని చెప్పారు.
బీజేపీ శ్రేణులపై దాడులు
సర్దార్ పటేల్ కృషి వల్లే తెలంగాణ స్వతంత్ర భారతంలో విలీనం అయిందన్నారు. దేశానికి బీజేపీ అవసరం గురించి ప్రధాని మోదీ సవివరంగా చెప్పారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. బంగాల్, కేరళలో బీజేపీ శ్రేణులపై దాడులు జరిగాయన్నారు. కేరళ, తెలంగాణలో కార్యకర్తలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుదీర్ఘకాలం పాలించిన పార్టీలు ఇప్పుడు నిష్క్రమణ దిశలో ఉన్నాయన్నారు. ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్, సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ తమ నినాదమని మోదీ చెప్పారన్నారు. ప్రధాని మోదీ దూరదృష్టితో సవాళ్లను అధిగమించామన్నారు.