Rythu Bharosa : ‘రైతు భరోసా’పై జిల్లాల వారీగా సదస్సులు, ప్రజాభిప్రాయ సేకరణ
Rythu Bharosa Conferences: రైతు భరోసాపై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా ప్రభుత్వం ఉమ్మడి జిల్లాల వారీగా సదస్సులు నిర్వహించబోతుంది. ఉమ్మడి జిల్లాల వారీగా రేపటి నుంచి 22 వరకు వర్క్ షాప్ జరుగనుంది.
Rythu Bharosa : ఎన్నికల హామీల్లో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు విధి, విధానాలు రూపొందించాలని నిర్ణయించింది. ఇందుకుగాను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చైర్మన్ గా, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలను సభ్యులుగా కమిటీని ఖరారు చేసింది. ఈ కమిటీ ఈనెల 10వ తేదీ నుంచి .. 23వ తేదీ వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించనుంది. రైతు భరోసా పై ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా జిల్లాల వారీగా సదస్సులను నిర్వహించబోతున్నారు. ఉమ్మడి జిల్లాల వారిగా రేపటి నుంచి ఈ సదస్సుల్లో అన్ని మండలాల నుంచి వ్యవసాయ శాఖ అభిప్రాయాలు సేకరించనున్నారు. రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, ఇతరుల నుంచి అభిప్రాయాలు స్వీకరిస్తారు. ఇప్పటికే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తూ.. అభిప్రాయాలను సేకరించారు.
రేపు ఖమ్మంతో సదస్సులు షురూ
రేపు ఖమ్మం జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న రైతు భరోసా సదస్సులో ముగ్గురు మంత్రులు పాల్గొననున్నారు. రైతు భరోసా విధివిధానాలు ఖరారు చేసేందుకు రైతు సదస్సులు, ఐదు ఎకరాలు ఉన్న వారికే రైతు భరోసా చెల్లించాలని విజ్ఞప్తులు చేయనున్నారు. రైతు సదస్సులు పూర్తి అయ్యాక అసెంబ్లీలో రైతు భరోసా పై ప్రభుత్వం చర్చించనుంది. అసెంబ్లీ వేదికగా రైతు భరోసా విధివిధానాలను రేవంత్ రెడ్డి సర్కారు ప్రకటించనుంది. ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా రైతు భరోసా స్కీం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ పథకానికి సంబంధించి అన్ని జిల్లాల్లో అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు వినాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. ప్రజల నుంచి వసూలు చేసిన పన్నుల నుంచే రైతు భరోసా కు నిధులు చెల్లిస్తారు కాబట్టే ప్రజా ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవాలని నిర్ణయించింది. పాత పది జిల్లాల్లో వర్క్ షాప్ ల ద్వారా ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను క్రోడీకరించి ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేయనుంది.
రైతు భరోసా పై తుమ్మల కీలక వ్యాఖ్యలు
తెలంగాణ రైతులు ఆశగా ఎదురుచూస్తున్న రైతు భరోసా స్కీముపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు ముందే మాట్లాడుకోవాలని మంత్రి సూచించారు. కౌలు తీసుకునే ముందే చర్చించుకోవాలని తెలిపారు. సాగు చేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలన్నది సీఎం రేవంత్ రెడ్డి కోరిక అని మంత్రి చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో సాగు చేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చిందన్నారు. దాని వల్ల రూ.25వేల కోట్లు దుర్వినియోగం అయినట్లు మంత్రి తెలిపారు. 10 నుంచి 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను సేకరించి సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందజేస్తుందని తుమ్మల తెలిపారు. రైతులకు రుణమాఫీ చేసిన తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. రైతు బీమా కూడా కొనసాగించాలని చెప్పినట్లు తెలిపారు. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేవిధంగా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడామన్నారు. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలని మంత్రి సూచించారు. కాగా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగలేకపోయినా ఆగస్టు 15 లోపు 30వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.