CM Revanth Reddy: మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమే - కేసీఆర్ పాలనపై సీఎం రేవంత్ సెటైర్లు
Kaleshwaram: కట్టిన మూడేళ్లోల కూలిన ప్రాజెక్ట్ కాళేశ్వరం మాత్రమేనని రేవంత్ అన్నారు. సాయిల్ టెస్టు కూడా చేయకుండా కాళేశ్వరం బ్యారేజీలు నిర్మించారన్నారు.

Jalasoudha: మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమేనని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. జలసౌధలో జరిగిన కొలువుల పండుగ కార్యక్రమంలో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రసంగంలో కీలక వ్యాఖ్యలు చేశారు. నీళ్లు మన నాగరికత.. నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం పుట్టిందని .. నీళ్ల కోసం మొదలైన మన ఆకాంక్షనే రాష్ట్రాన్ని సాధించి పెట్టిందని గుర్తు చేశారు. ఇది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం.. ఆ భావోద్వేగానికి మీరే ప్రతినిధులని తెలిపారు.
భావోద్వేగంతో కొన్ని పార్టీలు రాజకీయ లబ్ది పొందాయి .. 2 లక్షల కోట్లు ఖర్చుపెట్టినా తెలంగాణలో ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులు పూర్తి కాలేదని తెలిపారు. తెలంగాణ వచ్చి పదేళ్లయినా ప్రాజెక్టులు ఇంకా ఎందుకు పూర్తి కాలేదని ప్రశ్నించారు. ఆ నిధులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయి? మేధావులు, ఉద్యోగులు ఈ విషయంపై ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. ప్రాజెక్టులను పూర్తి చేయాలనే సంకల్పంతో మా ప్రభుత్వం పనిచేస్తుందిని.. అందుకే నీటిపారుదల శాఖలో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తున్నామన్నారు. ఈ పదిహేను నెలల్లో ఒక నీటిపారుదలశాఖలోనే 1161 ఉద్యోగా ఖాళీలను భర్తీ చేశామని తెలిపారు. అత్యంత ప్రాధాన్యమైన శాఖ నీటిపారుదల శాఖ అందుకే ఆనాడు ఇరిగేషన్ ప్రాధాన్యతగా తీసుకుని నెహ్రూ సాగునీటి ప్రాజెక్టులు కట్టారన్నారు.
గతంలో కట్టిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఇప్పటికీ చెక్కు చెదరలేదని.. కానీ కాళేశ్వరం మూడేళ్ళలోనే కట్టడం, కూలడం రెండూ జరిగిపోయాయని విమర్శించారు. లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరంతో 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు ఇవ్వలేకపోయారని తెలిపారు. కట్టిన మూడేళ్లలో కుప్పకూలిన ప్రాజెక్టు భూ ప్రపంచంలో కాళేశ్వరం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ఎలా కట్టకూడదో, ఎలా కడితే ప్రజలకు నష్టం జరుగుతుందో అనే దానికి ఉదాహరణ కాళేశ్వరం అన్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులు కట్టిన చోట కనీసం సాయిల్ టెస్ట్ చేయలేదని.. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి ఇంజనీరుగా మారి కట్టిన కాళేశ్వరం పరిస్థితి ఇది అని విమర్శించారు. ఇంజనీర్ల పని ఇంజనీర్లే చేయాలి.. రాజకీయ నాయకుల పని రాజకీయ నాయకులే చేయాలన్నారు.
ఇంజనీర్లు తమ విచక్షణతోనే పనిచేయాలని.. పరిమిత జ్ఞానంతో రాజకీయ నాయకులు చెప్పే మాటలు వింటే నష్టపోయేది మీరేనని హెచ్చరించారు. గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్ట నిర్మాణాలతో ప్రాజెక్టులు పూర్తి చేస్తే ఎప్పడు ఏది కూలుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎవరి నిర్లక్ష్యంతో ఎస్ఎల్బీసీ పూర్తి కాలేదో అందరికీ తెలుసు ...తెలంగాణ ప్రజల బిగ్గెస్ట్ సెంటు మెంట్ నీళ్లు నీళ్లు అందించే సాగునీటి ప్రాజక్టుల నిర్మాణంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎసెల్బీసీ, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్టులను మొదటి ప్రాధాన్యతగా తీసుకుని పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. గ్రూప్ వన్ నియామకాలను అడ్డుకోవడం వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరో తెలుసు ..త్వరలోనే గ్రూప్స్ ఉద్యోగాల నియామకాలు పూర్తి చేస్తామన్నారు.





















