Priyanka Tour: జూపల్లికి మరోసారి నిరాశ - ప్రియాంక గాంధీ కొల్లాపూర్ సభ మరోసారి వాయిదా !
ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ సభ మరోసారి వాయిదా పడింది. ఆగస్టు ఐదో తేదీన నిర్వహించే అవకాశం ఉంది.
Priyanka Tour: కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్న జూపల్లి కృష్ణారావుకు పరిస్థితులు కలసి రావడం లేదు. కొల్లాపూర్‌లో భారీ బహిరంగసభ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 30వ తేదీన ప్రియాంకా గాంధీ వచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే వర్షాల కారణంగా సభను వాయిదా వేయక తప్పలేదు. వచ్చే నెల ఐదో తేదీన సభను నిర్వహించాలని నిర్ణయంచారు. ప్రియాంకా గాంధీ కొల్లాపూర్ సభ వాయిదా పడటం ఇది రెండో గతంలో గతంలో ఇరవయ్యో తేదీన సభను నిర్వహించాలనుకున్నారు. కానీ ప్రియాంకా గాంధీ బిజీగా ఉండటంతో వాయిదా పడింది. ఈ సారి ప్రియాంకా గాంధీ సమయం ఇచ్చినా వర్షాల కారణంగా వాయిదా వేయక తప్పలేదు.
కొల్లాపూర్ సభలో బలప్రదర్శన చేసేందుకు జూపల్లి కృష్ణారావు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఉమ్మడి మహబాబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా తన అనుచరుల్ని పార్టలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సభలోనే మహిళల అభ్యున్నతి కోసం ప్రియాంక గాంధీ మహిళా డిక్లరేషన్ ప్రకటించేందుకు ఏర్పాట్లు చేశారు. కొల్లాపూర్ సభలో పెద్ద ఎత్తున చేరికలకు కాంగ్రెస్ నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుతో పాటు ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్‌రెడ్డి, ఆయన తనయుడు రాజేష్‌రెడ్డి, గద్వాల జడ్పీ చైర్‌పర్సన్ సరిత తదితర అనేక మంది నేతలు కాంగ్రెస్ తీర్థం తీసుకోనున్నారు.
పాలమూరు ప్రజా భేరి పేరుతో సభ నిర్వహించి మూడు లక్షల మంది జన సమీకరణ చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ఆగస్టు 14వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలో సభ నిర్వహిస్తున్నారు. ఆ సభకు టార్గెట్ నిర్దేశించేలా భారీగా జన సమీకరణ చేయాలనుకుంటున్నారు. యావత్తు తెలం గాణ రాష్ట్రానికి వినపడేటట్టుగా, కనపడేటట్టుగా పాలమూరు ప్రజాభేరీ సభను నిర్వహిం చుకుందామని జూపల్లి కృష్ణారావు గట్టిగా శ్రమిస్తున్నారు. వారం రోజులు మాత్రమే సభ వాయిదా పడిందని.. సభను అనుకున్న విధంగా విజయవంతం చేస్తామని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.
జూపల్లి కృష్ణారావు ఇటీవలి వరకూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. ఆయనతో పాటు ఎమ్మెల్సీ కూచుకుళ్ల జనార్దన్ రెడ్డి కూడా బీఆర్ఎస్ లోనే ఉన్నారు. కానీ పార్టీలో ఉన్న అంతర్గత రాజకీయాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జూపల్లిని ముందుగానే సస్పెండ్ చేశారు. దీంతో వారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి జిల్లాలో ఒక్క సీటు కూడా రాకుండా చూస్తామని చాలెంజ్ చేస్తున్నారు. టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారే కావడంతో.. అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుని సభను సక్సెస్ చేయాలని అనుకుంటున్నారు. రెండు సార్లు వాయిదా పడటంతో.. జూపల్లి వర్గీయులు నిరుత్సాహుపడినా.. తర్వాత సభను విజయవంతం చేస్తామని నమ్మకంతో ఉన్నారు.