Prashant Kishore vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని వదిలి పెట్టను - ఓడించి తీరుతా - ప్రశాంత్ కిషోర్ శపథం !
PK On Revanth: రేవంత్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ఓడిస్తానని ప్రశాంత్ కిషోర్ మరోసారి హెచ్చరించారు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో మోదీ, రాహుల్ .. రేవంత్ ను కాపాడలేరన్నారు.

Prashant Kishor once again warns Revanth Reddy: జన్ సురాజ్ పార్టీ అధినేత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డిపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "వచ్చే ఎన్నికల్లో తెలంగాణకు వెళ్లి రేవంత్‌ను ఓడించి తీరుతాను.. రాహుల్ గాంధీ, మోడీ ఎవరూ కాపాడలేరు" అని తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రకటించారు. బిహార్ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తన జన్ సురాజ్ పార్టీని బలోపేతం చేసుకోవడానికి రేవంత్ రెడ్డిని ప్రశాంత్ కిషోర్ ఉపయోగించుకుంటున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
2023 డిసెంబర్‌లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ తన కేబినెట్‌లో బిహార్‌కు చెందిన అధికారులను ఎక్కువగా నియమించారని, వారిని అడ్డం పెట్టుకుని కుట్రలు చేస్తున్నారని..దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు. ఆ సమయంలో ఓ టీవీ చానల్ తో మాట్లాడుతున్న సమయంలో "తెలంగాణ DNA బిహార్ DNA కంటే బెటర్.. బిహార్ వాళ్ల DNAలోనే కూలీ పని ఉంది" అని రేవంత్ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు బిహార్ ప్రజలను అవమానించినట్లుగా ఉన్నాయని బీజేపీ, ఆర్జేడీ, జేడీయూ వంటి పార్టీల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి.
We will show our mettle to Revanth Reddy who spoke wrongly about the people of Bihar, and we will show our strength in the next elections in Telangana too: Prashant Kishor
— 𝐆𝐮𝐦𝐩𝐮 𝐌𝐞𝐬𝐭𝐫𝐢 (@gumpumestri) October 3, 2025
vc: Times Now
VL: https://t.co/Cw2HxhI8Zx pic.twitter.com/Z7R8zS67vx
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ప్రశాంత్ కిషోర్ సీరియస్ గా తీసుకున్నారు. "రేవంత్ బిహార్ ప్రజలను అవమానిస్తున్నాడు. బిహార్ వాళ్ల DNA తక్కువ అంటే, మీరు మా సహాయం ఎందుకు అడిగారు?" అని ప్రశాంత్ కిషోర్ ప్రశ్నించారు. రేవంత్ తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఢిల్లీలో తనను మూడుసార్లు సంప్రదించి, ఎన్నికల వ్యూహాలకు సహాయం అడిగారని కూడా పీకే తెలిపారు. 2025 ఆగస్టులో బిహార్‌లో కాంగ్రెస్-ఆర్జేడీ కలిసి నిర్వహించిన 'వోటర్ అధికార్ యాత్ర'లో రేవంత్ రెడ్డి పాల్గొనడం ప్రశాంత్ కిషోర్‌కు ఆగ్రహం తెప్పించింది. రాహుల్ గాంధీ, తేజస్వి యాదవ్ నేతృత్వంలో జరిగిన ఈ 16 రోజుల యాత్రలో రేవంత్ ప్రచారం చేయడం బిహార్ ప్రజల అవమానమని ప్రశాంత్ కిషోర్ అప్పుడే ఖండించారు. "రేవంత్ బిహార్ వాళ్లపై దుర్మార్గ వ్యాఖ్యలు చేస్తాడు. బిహార్ గ్రామాలకు వస్తే, ప్రజలు అతన్ని తరిమికొడతారు" అని హెచ్చరించారు. రాహుల్ గాంధీ రేవంత్‌ను ఆహ్వానించడం "బిహార్ గౌరవానికి అవమానం" అని కూడా విమర్శించారు.
ప్రశాంత్ కిషోర్ 2025లో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీతో పోటీ పడుతున్నారు. ఆత్మగౌరవ నినాదం ద్వారా బిహార్ ప్రజల్లో తమ పార్టీకి మద్దతు పెంచుకోవాలని, కాంగ్రెస్‌పై రేవంత్‌తో లింక్ చేసి విమర్శలు రేకెత్తించాలని వ్యూహమని భావిస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ తనను టార్గెట్ చేస్తూ చేస్తున్న విమర్శలు, ఆరోపణలపై ఇప్పటి వరకూ రేవంత్ రెడ్డి స్పందించలేదు.





















