ఇందిరమ్మ ఇళ్లపై కేంద్రం-రాష్ట్రం వార్: పేదల అభివృద్ధికి అడ్డంకా? లేక రాజకీయ కక్ష సాధింపా? తాజా పరిణామాలివే!
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఇక రాష్ట్రంలో ఇది సాంకేతిక అంశాలను దాటి, రాజకీయ యుద్ధానికి దారితీస్తోంది.

Telangana Latest News: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదానికి కారణమవుతోంది. ఇక రాష్ట్రంలో ఇది సాంకేతిక అంశాలను దాటి, రాజకీయ యుద్ధానికి దారితీస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం తెలంగాణ రాష్ట్రంపై "సవతి తల్లి ప్రేమ చూపిస్తోందని" తెలంగాణ మంత్రులు అంటుంటే, ఈ పథకం కాంగ్రెస్‌కు "ఓట్ల పథకంగా మారిందని, అనర్హులకు దక్కుతోందని" కేంద్ర మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. అయితే ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణకు దారితీస్తుండగా, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వర్సెస్ రాష్ట్ర మంత్రుల మధ్య వాగ్యుద్ధానికి కారణంగా మారింది
ఇందిరమ్మ ఇళ్లలో నిధుల దుర్వినియోగం, లోపించిన పారదర్శకత - బీజేపీ
ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) నిబంధనలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం ఇళ్ల నిర్మాణం చేపట్టడం లేదని కేంద్రం ఆరోపిస్తోంది. కేంద్రం నుంచి ఇచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం అదనంగా కేటాయించే నిధుల వినియోగంలో "పారదర్శకత పాటించడం లేదన్నది" కేంద్ర ప్రభుత్వ వాదన. ఇళ్ల విస్తీర్ణం పీఎంఏవై నిబంధనల ప్రకారం ఉండాలని, అందుకు అనుగుణంగా లేకపోతే "కేంద్ర వాటా నిలిపివేస్తామని" ఇప్పటికే హెచ్చరించింది. దీంతోపాటు గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చే మొత్తం తమ నిబంధనల ప్రకారం పరిమితంగా ఉంటుందని, అంతకు మించి ఖర్చు చేస్తే "రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఖర్చు భరించాలని" చెబుతోంది. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా లేదని, ఇందులో "అనర్హులను గుర్తించినట్లు" కేంద్రం రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తోంది. "అనర్హులను లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించాల్సిందేనని" పట్టుబడుతోంది.
కేంద్రం ఆంక్షలు పేదవాడి అభివృద్ధిని అడ్డుకోవడమే - రాష్ట్ర ప్రభుత్వం
ఇందిరమ్మ ఇళ్లు తమ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ అని, దాన్ని స్వంత నిధులతోనే అమలు చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చే 72,000 ఇంటి నిర్మాణానికి "ఎలా సరిపోతాయని" ప్రశ్నిస్తోంది. "నాణ్యమైన ఇళ్లను ఈ మొత్తంతో నిర్మించడం సాధ్యం కాని పని" అని తెలంగాణ సర్కార్ కేంద్రం ఇచ్చే నిధుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి స్వంత నిధులను వినియోగిస్తుందని, ఒక్కో ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్లు చెబుతోంది. తమ స్వంత నిధులతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నందున కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు, నిబంధనలు "తమకు వర్తించవని" వాదిస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక ఎంతో పారదర్శకతతో జరిగిందని, నిధుల వినియోగంలోనూ తమ ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వ్యవహరిస్తోందన్నది తెలంగాణ ప్రభుత్వ వాదన. తాము 5 లక్షల వ్యయంతో పేదవాడికి నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తుంటే కేంద్రం నిబంధనల పేరుతో అడ్డుతగలడం "పేదవాడి అభివృద్ధిని అడ్డుకోవడమేనని" కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబడుతోంది.
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రులు వర్సెస్ రాష్ట్ర మంత్రులు
కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిబంధనల పేరుతో వాగ్యుద్ధం జరుగుతుంటే, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వర్సెస్ రాష్ట్ర మంత్రులు అన్నట్లు మాటల యుద్ధం సాగుతోంది. ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ, తాము నిధులు ఇచ్చే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే "నిధులు ఇచ్చేది లేదని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో నిర్మిస్తేనే నిధులు ఇస్తామని" రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తమ పథకాలకు "ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని" ప్రశ్నిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం నుంచి అందిన నిధుల వినియోగంలో "పారదర్శకత లేదని, లెక్కలు సరిగా చూపడం లేదని" ఆరోపించారు. ఈ పథకం "కాంగ్రెస్‌కు ప్రయోజనం తప్ప పేదలకు కాదని" బండి సంజయ్ విమర్శలు చేయడం గమనార్హం. మరో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ల పథకం "కేంద్ర నిబంధనలకు అనుగుణంగానే నిర్మించాలని" రాష్ట్ర ప్రభుత్వానికి సూచిస్తున్నారు. నిధుల వినియోగంలో "పారదర్శకత లోపించిందని" పలు మార్లు కిషన్ రెడ్డి బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాము ఇచ్చే నిధులు, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న నిధులు "లెక్కలు స్పష్టంగా చెప్పాలని" డిమాండ్ చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని పీఎంఏవై పోర్టల్‌లో "ఎప్పటికప్పుడు అప్‌లోడ్ చేయాలని" కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేశారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలో "అనర్హులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు చోటు దక్కుతోందన్నది" కిషన్ రెడ్డి ప్రధాన ఆరోపణ. ఇలా ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రులు రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు వెనుకాడటం లేదు.
ఇందిరమ్మ ఇళ్లను విమర్శించే నైతిక హక్కు కేంద్రానికి లేదు - రాష్ట్ర మంత్రులు
ఇందిరమ్మ ఇళ్లపై కేంద్ర మంత్రులు చేస్తోన్న విమర్శలను అంతే వాడి వేడిగా తెలంగాణ మంత్రులు తిప్పికొడుతున్నారు. పేదవాడి ఆత్మగౌరవం నిలబెట్టేందుకు "తమ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తోందని" తెలంగాణ మంత్రులు చెబుతున్నారు. "కేవలం ఓట్ల కోసం తాము ఈ పథకం చేపట్టలేదన్నది" వారి వాదన. కేంద్రం గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 71,000 ఇస్తే, పట్టణ ప్రాంతాల్లో 1.5 లక్షలు ఇస్తోందని, "ఇది ఏ మూలకు సరిపోవని" వారు చెబుతున్నారు. నాణ్యమైన ఇళ్ల కోసం తమ ప్రభుత్వం 5 లక్షలు ఖర్చు చేస్తోందని, "ఇది పేదల పట్ల తమ చిత్తశుద్ధికి నిదర్శనమని" చెబుతున్నారు. పూర్తి భారం మోస్తోన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించే "నైతిక హక్కు కేంద్రానికి, కేంద్ర మంత్రులకు లేదని" వారు తిప్పికొడుతున్నారు. లబ్ధిదారుల ఎంపిక "పారదర్శకంగా జరిగిందని" చెబుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమపై "రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగుతుందన్నది" తెలంగాణ మంత్రుల వాదన. కేంద్రం ఇందిరమ్మ ఇళ్లకు నిధులు ఆపినా "తాము ఈ పథకం ఆపేది లేదని" గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. తమపై ఆరోపణలు చేస్తోన్న ఎన్డీఏ సర్కార్ గత పదేళ్లలో "పేదల కోసం ఏం చేసిందని" ప్రశ్నించారు. బీజేపీవి "కేవలం రాజకీయ విమర్శలేనని" ఆరోగ్య, వైద్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కొట్టి పారేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం "ప్రజలకు వివరించాలని" ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఇలా ఇందిరమ్మ ఇళ్లపై నిబంధనల పేరుతో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల వార్ నడుస్తుండగా, రాష్ట్రంలో కేంద్ర మంత్రులు వర్సెస్ రాష్ట్ర మంత్రులు అన్నట్లు మాటల యుద్ధం సాగుతోంది. రానున్న రోజుల్లోనూ ఇదే అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం ఉండక తప్పదని తెలుస్తోంది.






















