Telangana PCC: స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రకటనలు - సీతక్క, పొంగులేటి తీరుపై పీసీసీ చీఫ్ అసంతృప్తి
Telangana Congress: కేబినెట్‌లో చర్చించకుండా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటనలు ఎలా చేస్తారని మంత్రులపై పీసీసీ చీఫ్ అసహనం వ్యక్తం చేశారు. ఒకరి శాఖల గురించి మరొకరు మాట్లాడటం పైనా అసంతృప్తి వ్యక్తం చేశారు

PCC chief Mahesh Kumar Goud: తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు కోపం వచ్చింది. విధానపరమైన నిర్ణయాలను మంత్రులు ప్రకటించడంపై ఆయన అ సంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కేబినెట్ తీసుకోవాల్సిన నిర్ణయంపై ముందుగా ఎందుకు మాట్లాడారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఎన్నికల షెడ్యూల్ నెలాఖరులోపు వస్తుందని చెప్పడంతో మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది.
ముందుగా సీతక్క చేసిన ప్రకటన మీడియాలో వైరల్ అయింది. ఆమె అప్పుడే వివరణ ఇచ్చారు. తాను ఫలానా తేదీలోపు వస్తుందని చెప్పలేదని.. ఎన్నికలకు మాత్రమే సిద్ధం కావాలని పిలుపునిచ్చానని కానీ మీడియా బాధ్యతా రాహితంగా ప్రచారం చేసిందన్నారు. ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖమ్మంలో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఇలాంటి ప్రకటనే చేశారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ కు కోపం వచ్చింది. ఒక మంత్రి శాఖ వివరాలు , మరో శాఖ మంత్రి ఎలా చెప్తారని కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. మంత్రులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. పార్టీతో సంప్రదించకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరి కాదని స్పష్టం చేశారు.
తెలంగాణ మంత్రులు తమ పరిధిలో లేని అంశాలతో పాటు సున్నితమైన అంశాలపైనా సొంతంగా చేస్తున్న ప్రకటనలతో పార్టీకి నష్టం కలుగుతోందని మహేష్ గౌడ్ భావిస్తున్నారు. మంత్రులు .. తమ తమ శాఖలకు సంబంధించి ఇతరులు ప్రకటనలు చేయడం ఏమిటని పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో మహేష్ కుమార్ గౌడ్ సీరియస్ కావాల్సి ఉందని చెబుతున్నారు.
వివరణ ఇచ్చిన సీతక్క
హైదరాబాదులోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ వద్ద పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ఈ అంశంపై మాట్లాడారు. స్థానిక సంస్థ ల ఎన్నికలు త్వరలో ఉంటాయని మాత్రమే నేను అన్నాను..నేను ఎన్నికల డేట్ చెప్పినట్లు గా మీడియా లో ప్రచారం జరిగింది.. అది అవాస్తవం. మీడియా సంస్థలు వాస్తవాలు తెలుసుకుని వార్తలు వేయాలన్నారు. అనని మాటలు అన్నట్లు గా వార్తలు నడపడం నన్ను తీవ్ర ఆవేదన కు గురిచేసిందని తెలిపారు. కార్యకర్తల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై వారం పది రోజుల్లో స్పష్టత వస్తుందని మాత్రమే చెప్పానని వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని, నోటిఫికేషన్ వెలబడుతుంది అన్నట్టుగా కొందరు వార్తలు రాశారన్నారు. నేను వారం రోజుల్లో షెడ్యూల్ వస్తుందని చెప్పినట్లుగా ఒక్క ఆధారం అయిన చూపిస్తారా అని ప్రశ్నించారు. 20 సంవత్సరాలుగా ప్రజా సేవలో ఉన్నాను.. లోకల్ ఎన్నికలు ఎలా జరుగుతాయో నాకు తెలియదా ... క్యాబినెట్లో చర్చించిన తర్వాత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.





















