Asifabad News: ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలు పట్టివేత, 2 నెలల్లో కోటి రూపాయల విత్తనాలు స్వాధీనం
Fake seeds in Asifabad | ఆసిఫాబాద్ జిల్లాలో భారీగా నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రైతులను మోసం చేస్తున్న ముఠాను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు.

ఆసిఫాబాద్: వర్షాకాలం మొదలైంది. రైతులు పంటలు వేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కానీ నకిలీ విత్తనాల సమస్య అన్నదాతలను వెంటాడుతోంది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాల దందా యథేచ్ఛగా కోనసాగుతోంది. కొందరు ఆక్రమార్కులు అమాయక రైతులకు మాయమాటలు చెప్పి నిండా ముంచుతున్నారు. నకిలీ విత్తనాల విక్రయాలకు అడ్డుకట్ట వేసేందుకు జిల్లా పోలీసులు అక్కడక్కడా మాటు వేసి పట్టుకుంటున్నా మోసాలు మాత్రం ఆగడంలేదు.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏటా వానాకాలంలో అత్యధికంగా 3.35 లక్షలకు పైగా ఎకరాల్లో రైతులు పత్తి పంట సాగు చేస్తుంటారు. దీనిని ఆసరా చేసుకున్న దళారులు జిల్లాలో కొన్నేళ్లుగా పత్తి విత్తనాల నకిలీ దందాను మొదలుపెట్టారు. ఈ దందా జిల్లాలోని సరిహద్దు మండలాల్లో మూడు పూవులు ఆరు కాయలుగా కోనసాగుతోంది. జిల్లాలో గత రెండు నెలల్లో సుమారు రూ.కోటి విలువైన దాదాపుగా 3 వేల కిలోలకు పైగా నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. దీంతో జిల్లాలో ఏస్థాయిలో నకిలీ విత్తనాల దందా సాగుతుందో అర్ధం చేసుకోవచ్చు.

కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి మండలంలో ఎల్,బిక్షపతి వద్ద రూ.10.50 లక్షల విలువైన మూడు క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు గత నెలలో పోలీసులు పట్టుకున్నారు. బెజ్జూర్ కు చెందిన కె.చంద్రశేఖర్ విజయవాడ నుంచి కాగజ్ నగర్ కు నకిలీ విత్తనాలు తరలించారు. ఏప్రిల్ 4న కాగజ్ నగర్ పట్టణంలో నవతా ట్రాన్స్ పోర్ట్ లో రూ.1.57 లక్షల విలువైన 45 కిలోల నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. అందవెల్లి బోడపల్లి గ్రామాల్లో రూ.3.50 లక్షల విలువైన 100 కిలోల నకిలీ బీటీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మే 7న పెంచికల్ పేట్ మండలంలో రెండు వాహనాల్లో తరలిస్తున్న రూ.12 లక్షల విలువైన 4 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలు పట్టుకుని నలుగురిని అరెస్టు చేశారు.
మే 24న కాగజ్ నగర్ మండలం పెద్దవాగు సమీపంలో ఐచర్ వాహనంలో తరలిస్తున్న రూ.60 లక్షల విలువైన 20 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. మే 25న బెజ్జూర్ మండలం సుశ్మీర్ లో రూ.6 లక్షల విలువైన 170 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు పట్టుకున్నారు. జిల్లాలో ఈసారి మొత్తం రూ.కోటి విలువ చేసే నకిలీ పత్తి విత్తనాలు పట్టుకున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని చింతలమానెపల్లి, బెజ్జార్, కౌటాల, సిర్పూర్(టీ), సరిహద్దు మండలాల కేంద్రంగా ఈ దందా జోరుగా సాగుతుందని ఆరోపణలున్నాయి. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన దళారులు ఖరీఫ్ సీజన్ కు ముందే నకిలీ విత్తనాలను జిల్లాకు సరఫరా చేస్తున్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని మారుమూల మండలాలైన కౌటాల, చింతలమానెపల్లి, బెజ్జూర్, పెంచికల్పేట్, సిర్పూర్(టి), తదితర మండలాల్లో సబ్ ఏజెంట్లను నియమించుకుంటున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి నకిలీ పత్తి విత్తనాలు నిషేధిత గడ్డిమందును పలు ప్రైవేట్ ట్రాన్స్పోర్టులు, లారీల్లో జిల్లాకు చేరవేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పలువురు దళారులు గోదాంలను ఏర్పాటు చేసుకుని నకిలీ విత్తనాలు నిల్వ చేస్తున్నారు. అక్కడి నుంచి కౌటాల మండలాల సరిహద్దులోని వార్ధా ప్రాణహిత నదుల మార్గాన నాటు పడవల్లో మండలాల్లోని సబ్ ఏజెంట్లకు సరఫరా చేస్తున్నట్లు సమాచారం. ఈ దందా ఏటా జిల్లాలో కొనసాగుతున్నప్పటికీ కేవలం చిన్న మొత్తంలో కొనుగోలు చేసి విక్రయిస్తున్న వారిని మినహా ఆసలు సూత్రధారులను పట్టుకున్న దాఖలాలు లేవు. ఆయా శాఖల అధికారులకు దందా చేసే అసలు వ్యక్తులు తెలిసినప్పటికీ మామూలుగానే వదిలేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో నకిలీ విత్తనాల వ్యాపారం రైతులను కలవర పెడుతోంది.
వానాకాలం సీజన్ ప్రారంభం కానుండటంతో అన్నదాతలు పోలాలను సాగుకు సిద్ధం చేసుకుంటున్నారు. భూసారం దెబ్బతినడంతో పాటు వాతావరణ కాలుష్యానికి కారణమవుతుందన్న శాస్త్రవేత్తల సూచనల మేరకు దేశంలో బీజీ 3 రకాలను నిషేధించారు. నాణ్యమైన బీటి2 విత్తనాలే నాటాలని ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తప్పనిసరిగా రశీదులు తీసుకోవాలని, నాసిరకం విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు.





















