Headlines Today : రాష్ట్రం, దేశంలో ఏం జరుగుతుందో తెలుసుకోండి, ఈ హెడ్‌లైన్స్‌తో మరింత అప్‌డేట్ అవ్వండి
అవినాష్ రెడ్డిని అరెస్టు చేస్తారా... అసలు తెలంగాణ హైకోర్టులో ఏం జరగబోతుంది.. కన్నా పార్టీలో చేరిన తర్వాత గుంటూరులో చాలా మార్పులు వచ్చాయని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు. ఇంతకీ ఆ మార్పులపై అధినేత ఏమంటారో?
Headlines Today :
గుంటూరులో చంద్రబాబు టూర్- పోలీసుల హైఅలర్ట్
గుంటూరు జిల్లాలో నేటి నుంచి ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటించనున్నారు. పార్టీలో విభేదాలు, ఇటు అధికార పక్షం ఎదురుదాడి వేళ టూర్ ఎలా జరుగుతుందనే ఆసక్తి కనిపిస్తోంది. మూడు రోజులు పాటు ఇదేమి ఖర్మ ఈ రాష్ట్రానికి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. నేటి నుంచి ప్రారంభమయ్యే చంద్రబాబు పర్యటన మొదటి రోజు పెదకూరపాడు నియోజకవర్గంలో ప్రారంభం కానుంది. ఈ సాయంత్రానికి అమరావతిలో రోడ్ షో నిర్వహించి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడతారు.
టీడీపీ అధినేత పర్యటన సందర్భంగా అమరావతి ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీ అధ్యక్షుడు పర్యటనకు సంబంధించి చంద్రబాబుకు స్వాగతం పలుకుతూ టీడీపీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఆ ఫ్లెక్సీలు ఎదురుగానే చంద్రబాబు నాయుడు పర్యటనను వ్యతిరేకిస్తూ వైకాపా కార్యకర్తలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చంద్రబాబు దళిత ద్రోహి అంటూ ఆయన పర్యటన అడ్డుకుంటామంటూ పోస్టర్లు వేశారు. ఈ పోటాపోటీ ప్లెక్సీలు ఏర్పాటుతో నియోజకవర్గాల్లో పరిస్థితులు హీట్ పుట్టిస్తున్నాయి. ఫ్లెక్సీల ఏర్పాటుతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో ఉదయం నుంచి అమరావతి ప్రాంతంలో పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు.
నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ సమావేశాలు
ఎన్నికల సంవత్సరం కావడంతో ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనం పేరుతో ప్రజల్లో ఉంటున్న బీఆర్‌ఎస్ నేతలు ఇప్పుడు మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. మంగళవారం అన్ని నియోజకవర్గాల్లో ప్రతినిధులు సమావేశాలు నిర్వహించనున్నారు. సుమారు నాలుగు వేల మందితో ఒక్కో సభను ఏర్పాటు చేయనున్నారు. ఎన్నికలకు ఎలా రెడీ కావాలి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సాధించిన ఫలితాలు, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం చేస్తున్న మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ సభల ముఖ్య ఉద్దేశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత వ్యవసాయ, సాగునీటి రంగాల్లో సాధించిన ప్రగతి, 24 గంటల విద్యుత్ పంపిణీ, రైతు బంధు పథకాలపై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరిగేలా చూడబోతున్నారు. సంక్షేమ రంగంలో తీసుకొచ్చిన విప్లవాత్మకమైన పథకాలను ప్రజలకు వివరిస్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన ఉద్యోగాలు పెరిగిన ఉపాధి అవకాశాలను తెలియజేస్తారు. అదే టైంలో బీజేపీ వైఫల్యాలు, పెరుగుతున్న ధరలు, రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని గుర్తు చేయనున్నారు.
300 రూపాయల టికెట్లు నేడు విడుదల
మే, జూన్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీనివాసుడి 300 రూపాయల దర్శన టికెట్లను ఇవాళ ఆన్‌లైన్‌లో టీటీడీ పెట్టనుంది. ఉదయం పదిగంటలకు ఈ ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను టీటీడీ వెబ్‌సైట్ tirupatibalaji.ap.gov.inలో ఉంచనున్నారు. ఈ టికెట్లను టీటీడీ యాప్‌లో కూడా బుక్ చేసుకోవచ్చు. ఈ మధ్య కాలంలో వెలుగు చూసిన నకిలీ వెబ్‌సైట్‌ల పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ భక్తులకు సూచిస్తోంది. ఒకటికి రెండు సార్లు చూసుకొని టికెట్లు బుక్ చేసుకోవాలి హితవు పలుకుతోంది.
తెలంగాణలో విద్యుత్ ఆర్టిజన్లు సమ్మె బాట
దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్న డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ తెలంగాణలో ఆర్టిజన్లు సమ్మె బాట పట్టారు. తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్, ఇత్తెహాద్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఎంప్లాయిస్ యూనియన్ ఈ సమ్మెలో పాల్గొంటుంది. అయితే ఇలాంటి సమ్మెలు నిరోధిస్తూ ఇప్పటికే ప్రభుత్వం ఎస్మాను ప్రయగించింది. సమ్మె చేస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు కూడా యాజమాన్యానికి ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వీళ్ల సమ్మె ఎలాంటి ఉద్రిక్తతకు దారి తీస్తుందన్నది ఉత్కంఠ నెలకొంది. విద్యుత్ సంస్థల్లో ఈ ఆర్టిజన్లు ఎక్కువ మంది ఉంటారు. సగానికిపైగా వీళ్లే ఉంటారు. చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో పని చేస్తున్నామని అయినా తమకు సరైన వేతనాలు లేవని ఆర్టిజన్లు వాపోతున్నారు.
తెలంగాణ హైకోర్టులో వాదనలు
వివేక హత్య కేసులో అవినాష్ రెడ్డి వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌పై నేడు తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. వారం రోజుల క్రితం విచారించిన తెలంగాణ హైకోర్టు 25 వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశించింది. మరిన్ని కీలకమైన ఆదేశాలు ఇచ్చింది.
హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సీబీఐ అడిగే ప్రశ్నలను నిందితులకు ఇవ్వాలనే సంప్రదాయం ఏంటని నిలదీసింది. అవినాష్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టేస్తే ముందస్తు బెయిల్‌పై వాదించుకోవచ్చని సూచించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మళ్లీ తెలంగాణ హైకోర్టులో వాదనలు జరగనున్నాయి.
నేడు షర్మిలకు మద్దతుగా ఆందోళనలు
పోలీసులపై చేయి చేసుకొని అరెస్టైన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ప్రస్తుతం చంచల్ గూడ జైలులో ఉన్నారు. ఆమె అరెస్టును నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు ఆందోళనలకు పిలుపునిచ్చారు. అన్ని జిల్లాల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన చేపట్టాలని పార్టీ నుంచి ఆదేశాలు వచ్చాయి. సీఎం, ప్రభుత్వ దిష్టి బొమ్మల దహానాలు చేపట్టాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మరోవైపు షర్మిల బెయిల్‌పై విచారణ నాంపల్లి కోర్టులో ఇవాళ కొనసాగనుంది.
వైట్ రేషన్‌కార్డుదారులకు ఉచిత దర్శనం
వైట్ రేషన్ కార్డు ఉన్న భక్తులు శ్రీశైలం మల్లేశ్వర స్వామి ఉచిత సామూహిక సేవలో పాల్గొనవచ్చు. ప్రతి నెలలో ఒకసారి ఈ సేవ చేసుకోవచ్చు. ఆరుద్రనక్షత్రాన్ని పురస్కరించుకొని సామూహిక అభిషేకాన్ని నిర్వహించనున్నారు. ఈ వేడుకలో వైట్ రేషన్ కార్డుదారులు ఉచితంగా పాల్గొనవచ్చు. ఈ వేడుక చంద్రావతి కల్యాణమండపంలో జరగనుంది. ఈ సేవలో ఉచితంగా పాల్గొనాలంటే వైట్ రేషన్ కార్డు భక్తులు శ్రీశైలం దేవస్థానం వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలి. ప్రతి నెల 250 టికెట్లు ఇలా ఇవ్వబోతున్నారు. ఈ సేవలో ఒక్కరు లేదా జంటగా పాల్గొనవచ్చు. ఈ సేవలో పాల్గొన్న భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు, కుంకుమ, విభూతి ఇస్తారు.
కేరళలో తొలి వందేభారత్ ప్రారంభించనున్న ప్రధాని
రెండు రోజుల కేరళ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ సోమవారం కొచ్చిలో రోడ్ షో నిర్వహించారు. ఇవాళ కేరళలోని తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును జెండా ఊపి ప్రారంభించనున్నారు. వాటర్ మెట్రోను కూడా ప్రారంభిస్తారు. తిరువనంతపురం-కాసర్గోడ్ మధ్య తొలి వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. తిరువనంతపురం, కొల్లం, కొట్టాయం, ఎర్నాకులం, త్రిసూర్, పాలక్కాడ్, పతనంతిట్ట, మలప్పురం, కోజికోడ్, కన్నూర్, కాసరగోడ్ సహా 16 జిల్లాల్లో ఈ 11 బోగీల రైలు ప్రయాణిస్తుంది. ఉదయం పదకొండున్నరకు తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ నుంచి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ జెండా ఊపి ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు నమో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ను ప్రధాని సందర్శిస్తారు. సాయంత్రం 4.30 గంటలకు దాద్రా నగర్ హవేలీ సిల్వస్సాలో రూ.4850 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, 6.10 గంటలకు డామన్ లో రోడ్ షో నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు డామన్ లోని దేవ్ కా సీఫ్రంట్ ను ప్రారంభిస్తారు.
ముంబయి ఇండియన్స్ వర్సెస్ గుజరాత్ టైటాన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో మరో థ్రిల్లింగ్ మ్యాచ్‌కు టైమైంది! డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌తో ఐదుసార్లు విజేత ముంబయి ఇండియన్స్ తలపడుతోంది. ఇందులో గెలిచి టేబుల్‌లో పైకి వెళ్లాలని హిట్‌మ్యాన్ సేన పట్టుదలగా ఉంది. ఐదో విజయం అందుకోవాలని టైటాన్స్ ఉవ్విళ్లూరుతోంది.
పడుతూ.. లేస్తూ!
డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) ఈ సీజన్లో విజయాలు అంత సులభంగా దక్కడం లేదు. ప్రతి మూమెంట్‌లోనూ గట్టిగా పోరాడాల్సి వస్తోంది. ఆఖర్లో అనూహ్యంగా గెలుస్తోంది. టీమ్‌లో చక్కని బ్యాలెన్స ఉండటం పాజిటివ్ అంశం. ఓపెనర్ వృద్ధిమాన్ దూకుడుగా ఆడుతున్నాడు. శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) కొంత వెనకబడ్డాడు. ఆపద ఎదురైనప్పుడల్లా కెప్టెన్ హార్దిక్ పాండ్య (Hardik Pandya) ముందుకొస్తున్నాడు. లక్నో మ్యాచులో బిష్ణోయ్ బౌలింగ్‌లో అతడు కొట్టిన సిక్సర్లు మ్యాచును గెలిపించాయి. మిడిలార్డర్లో కాస్త పస తగ్గింది! సాయి సుదర్శన, డేవిడ్ మిల్లర్, అభినవ్ మనోహర్, రషీద్ తక్కువేమీ కాదు. టైటాన్స్ బౌలింగ్‌కు తిరుగులేదు. ఓడిపోయే మ్యాచుల్నీ తమ వైపు లాగేస్తున్నారు. షమీ బంతులకు బ్యాటర్లు జవాబు ఇవ్వడం లేదు. మోహిత్ శర్మ రాకతో బౌలింగ్ డిపార్ట్‌మెంట్ మరింత మెచ్యూరిటీగా మారింది. జయంత్ యాదవ్, సాయి కిషోర్ ఫర్వాలేదు.
ముందుకెళ్లాలనీ..!
ఈ సీజన్లో ఆరు మ్యాచులాడిన ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) ఆరు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది. హ్యాట్రిక్ విజయాలు అందుకోవడం వారిలో జోష్ పెంచింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (Rohit Sharma), ఇషాన్ కిషన్ (Ishan Kishan) ఫియర్‌లెస్ క్రికెట్ ఆడుతున్నారు. వికెట్ పోయినా సరే దూకుడుగా సిక్సర్లు బాదేస్తున్నారు. తిలక్ వర్మ (Tilak Varma) మిడిలార్డర్లో విలువైన రోల్ ప్లే చేస్తున్నాడు. కామెరాన్ గ్రీన్, టిమ్ డేవిడ్ ఫామ్‌లోకి రావడం పాజిటివ్ న్యూస్. సూర్యకుమార్ యాదవ్ ఫర్వాలేదు. లోయర్ మిడిలార్డర్లో మ్యాచ్ ఫినిషర్లు లేకపోవడం ముంబయిని ఇబ్బంది పెడుతోంది. బౌలింగ్ కొంత మెరుగైంది. జోఫ్రా ఆర్చర్‌తో పనవ్వడం లేదు. అర్జున్ తెందూల్కర్ (Arjun Tendulkar) పవర్ ప్లేలో బంతిని బాగానే స్వింగ్ చేస్తున్నాడు. కొన్నిసార్లు రన్స్ లీక్ అవుతున్నా జట్టుకు బ్యాలెన్స్ తెస్తున్నాడు. హృతిక్ షోకీన్, కుమార్ కార్తికేయ స్పిన్ ఫర్వాలేదు. ఇప్పటికీ పియూష్ చావ్లా బంతితో మాయాజాలం చేస్తున్నాడు. డువాన్ ఎన్‌సన్, గ్రీన్, డేవిడ్ పేస్ చూస్తున్నారు.
ప్రవీణ్ ప్రకాష్‌పై ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం
ఉత్తరాంధ్రలోని వివిధ ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేసిన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ టీచర్లను సస్పెండ్ చేయడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తప్పుబడుతున్నాయి. దీనికి వ్యతిరేకంగా ఆందోళనకు ఫ్యాప్టో పిలుపునిచ్చింది. ఉపాధ్యాయులను సస్పెండ్ చేయడమే కాకుండా కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడుతుంది. ఇవాళ రేపు అన్ని ప్రాంతాల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరుకావాలని పిలుపునిచ్చింది. భోజన విరామ సమయంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు.