Tiger Attack In Komaram Bheem Asifabad: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఇద్దరిపై దాడి చేసింది ఒకే పులి, స్పష్టం చేసిన అధికారి
కాగజ్‌నగర్ డివిజన్ ను ప్రత్యేక టైగర్ కారిడార్ గా డెవలప్ చేసే ఉద్దేశం ఉందని తెలిసిన ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆర్.ఎం డోబ్రియాల్.. ఇటీవల ఇద్దరిపై దాడి చేసింది ఒకటే పులి అని తెలిపారు.
Tiger Attack In Asifabad: ఇటీవల వేర్వేరు చోట్ల ఇద్దరిపై దాడి చేసింది ఒకటే పులి అని ప్రిన్సిపాల్ చీఫ్ కన్జర్వేటివ్ ఫారెస్ట్ ఆర్.ఎం డోబ్రియాల్ తెలిపారు. ఆయన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించారు. కాగజ్‌నగర్ డివిజన్ అటవి ప్రాంతాన్ని చూడాలనే ఉద్దేశ్యంతో ఇక్కడికి రావడం జరిగిందని పిసీసీఎఫ్ డోబ్రియాల్ తెలిపారు. గత రెండు రోజులుగా కాగజ్‌నగర్, పెంచికల్ పేట్, సిర్పూర్ అటవీ ప్రాంతాలను పరిశీలించి అటవి శాఖ సిబ్బందితో పలు వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా పీసీసీఎఫ్ కాగజ్‌నగర్ డివిజన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. కాగజ్‌నగర్ డివిజన్ ను ప్రత్యేక టైగర్ కారిడార్ గా డెవలప్ చేసే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. ఇందుకు అవసరమైన ప్రతిపాదనలను కన్జర్వేషన్ ఆఫ్ పారెస్ట్ కార్యాలయానికి పంపిస్తామన్నారు.
పెద్దపులి దాడిలో నలుగురు మృత్యువాత పడ్డారు
తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా కాగజ్‌నగర్ డివిజన్లోనే ఏనిమల్- హ్యుమెన్ కాన్ ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది. మహారాష్ట్ర- తెలంగాణ అడవి సరిహద్దులు ఎంత, అన్ని విషయాలను లోతుగా పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు. గతంలో ఏనుగు సంచారం వలన రెండు ప్రాణాలు పోయాయనీ, ఇక ఈ జిల్లాలో ఇదివరకు పెద్దపులి వలన నలుగురు మృత్యువాత పడటం చాలా బాధాకరమన్నారు. పెద్దపులులను కాపాడుకోవాల్సిన అవసరముందని, అలాగే మనుషులకు హాని జరుగకుండా చూడాల్సిన బాధ్యత కూడా ముఖ్యమని చెప్పారు. ఈ ప్రాంతానికి మహారాష్ట్రలోని తాడోబా నుండి పులులు ఎక్కువగా వస్తున్నాయని, ఇక్కడ ఇతర జంతువులు లేకపోవడం కూడా ఒక కారణమని, ఇతర జంతువులను ఇక్కడకు తరలించడంపై కూడా దృష్టి పెడుతున్నామన్నారు.
మనుషులకు ముప్పు లేకుండా చర్యలు తీసుకుంటాం
రాబోయే రోజులలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఇక్కడికి వచ్చినట్లు తెలిపారు. పూర్తి స్తాయిలో అధ్యయనం చేసి పులులకు మనుషులకు ముప్పు వాటిల్లకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. గత వారం రోజుల క్రితం మహిళ మృతికి కారణం అయ్యింది అలాగే ఓ యువకునిపై దాడి చేసి గాయపర్చింది కుడా ఒకే పులిగా నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా పులి తమ కెమెరాకు చిక్కిందని చూపించారు. మహారాష్ట్ర నుండి ఈ మగ పులి వస్తూ పోతుందని.. వచ్చిపోయే క్రమంలో ఈ దాడులకు పాల్పడుతుందని అన్నారు.
బాధితులకు నష్టపరిహారం అందిస్తామన్న అధికారి
పశువులను పులి హతమార్చితే వెంటనే బాదితులకు నష్టపరిహారం అందజేస్తున్నామని, గ్రామస్తులు పశువులపై విషం చల్లి పులిని చంపే ప్రయత్నాలు చేయవద్దని అది చాలా పెద్ద నేరం అవుతుందని అన్నారు. అటవి సంరక్షణ, వన్య ప్రాణుల సంరక్షణ, ప్రజల సంరక్షణ కోసం అన్ని విధాల మేలు జరిగేలా చర్యలు చూస్తామన్నారు. పులి దాడుల నుంచి తప్పించుకునేందుకు ఇటీవల ఫేస్ మాస్కులను అటవీశాఖ అధికారులు సమీప గ్రామాల్లో ప్రజలకు, రైతులకు పంపిణీ చేశారు. పులి సమీపంలో కనిపిస్తే పెద్ద శబ్ధాలు చేస్తే అరుపులకు అది పారిపోతుందని అధికారులు చెబుతున్నారు.
Also Read: Komaram Bheem Aasifabad Latest News: రైతు మొహంపై గాండ్రించిన మచ్చల పులి- తర్వాత ఏమైందీ...