Komaram Bheem Aasifabad Latest News: రైతు మొహంపై గాండ్రించిన మచ్చల పులి- తర్వాత ఏమైందీ...
Asifabad News: పులి మొహంపై గాండ్రించడంతో ఓ రైతు మూర్చుపోయాడు. పొలంలోనే స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించారు.
Komaram Bheem Asifabad News: కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం శివారు ప్రాంతంలో పులి సంచారం ప్రజల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇవాళ ఉదయం పులి గాండ్రించడంతో ఓ రైతు స్పృహతప్పి పడిపోయాడు. స్థానికులు గమనించి అతన్ని ఆసుపత్రికి తరలించారు.
పంట చేలో రైతు శంకర్ పని చేస్తున్న టైంలో ఒక్కసారిగా తన సమీపంలో పులి గాండ్రిస్తూ పరుగెత్తింది. అప్పటి వరకు పని ధ్యాసలో ఉన్న శంకర్... మచ్చల పులి గాండ్రిపతో ఒక్కసారిగా స్పృహ కోల్పోయాడు. గాండ్రిస్తూనే పులి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెంటనే స్థానికులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఆయన కోలుకుంటున్నాడు.
శంకర్ పని చేస్తున్న చోటే పులి గాండ్రిస్తూ రావడంతో శంకర్‌పై దాడి చేసిందేమో అని రైతులంతా కంగారు పడ్డారు. అయితే పులి గాండ్రింపు వినడంతోనే శంకర్ కింది పడిపోవడంతో మేలు జరిగిందని అంటున్నారు. ఆయన అలికిడి విని పులి గాండ్రించి అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుందని అంటున్నారు.
పులి సంచారంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకుని వారికి ధైర్యం చెబుతున్నారు. అప్రమత్తంగా ఉండేలా సూచనలు చేస్తున్నారు.
Also Read: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
సోమవారమే వాంకిడి మండలంలోని పలు ప్రాంతాల్లో పులి కనిపించింది. ఇటన్కర్ తుకారాం పత్తి చేనులో ఉదయం 7గంటల సమయంలో పులి కనిపించిందని స్థానికులు చెప్పారు. పొలంలో పని చేస్తున్న వారు పులిని గుర్తించి అక్కడి నుంచి పారిపోయి వచ్చారు. వెంటనే అటవీ శాఖా సిబ్బందికి సమాచారం ఇచ్చారు. స్పాట్‌కు వెళ్లి చూసిన అధికారులకు ఫుట్‌ప్రింట్స్ స్పష్టంగా కనిపించ లేదు. అది పులి కాకపోవచ్చని చెబుతున్నారు.
ఇదిగో పులి అదుకో దాడి అన్నట్టు జిల్లాలో పరిస్థితి ఉంది. పుకార్లు జనాలను మరింతగా భయపెడుతున్నాయి. పులి లేకపోయినా, చూడకపోయినా చాలా మంది పుకార్లు వ్యాప్తి చేస్తున్నారు. ఎక్కడ ఏ పొదల్లో కదలికలు కనిపించినా పులి అంటూ ప్రచారం చేస్తున్నారు. అధికారులకు సమాచారం అందిస్తున్నారు. అధికారులు వచ్చి అక్కడ పరిశీలించి పులి లేదని చెబుతున్నారు. ఇలాంటి ప్రచారంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.