Tiger Attacks in Asifabad: ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి టెన్షన్, దాడి నుంచి రక్షించుకునేందుకు ఈ కొత్త టెక్నిక్ తెలుసా?
Tiger spotted in Komaram Bheem Asifabad | ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి సంచారం టెన్షన్ పెడుతోంది. అటవీశాఖ అధికారులు రైతులు, గ్రామస్తులకు అవగాహన కల్పిస్తున్నారు. వారికి ఫేస్ మాస్కులు పంచుతున్నారు.
Face masks and whistles to help keep villagers to be safe from Tifer | కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి రైతులను భయాందోళనకు గురిచేస్తుంది. ఎప్పుడు ఏ వైపు నుండి వస్తుందో.. ఎవరిపై దాడి చేస్తుందోనని అందరూ బిక్కు భిక్కుమంటూ వణికి పోతున్నారు. ఇదివరకే గన్నారం గ్రామానికి చెందిన లక్ష్మీ అనే మహిళపై దాడి చేసి హతమార్చగా దుబ్బగూడా శివారులో సురేష్ అనే రైతుపై పులి దాడి చేసింది. కాగజ్ నగర్ మండలంలోని బెంగాలీ క్యాంప్ విలేజ్ నెంబర్ 11 నుండి గన్నారం కడంబా మీదుగా సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడా శివారుకు వచ్చింది. అక్కడినుండి ఇటుకల పహాడ్ ప్రాంతంలో పెద్దపులి వెళ్ళింది.
రైతులు చేనుకు వెళ్లొద్దు..
ఇటుకలపహడ్ సమీపంలో ఓ లెగదూడపై పులి దాడి చేసి అక్కడే మకాం వేసింది. రెండు రోజులుగా అక్కడే ఉంటోంది. సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎవరు పత్తి ఎరడానికి చేనులోకి వెళ్లకూడదని అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దాడులు చేస్తూ బెంబేలెత్తిస్తున్న బెబ్బులి ఆచూకీ కోసం అటవీ అధికారులు డ్రోన్ సహాయంతో అడవులను జల్లెడ పడుతున్నారు. పీసీసీఎఫ్ ఏలుసింగ్ మేరు, ఎఫ్డిపీటీ శాంతారాం, ఆసిఫాబాద్ డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, అటవీ శాఖ సిబ్బంది సహా అధికారులందరూ ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ క్రమంలో పులి పాదముద్రలు సైతం వీరికి లభించాయి. చెట్లపై పులి గీరల గీతలను గుర్తించారు. ఈ క్రమంలో పులి కదలికల పట్ల పరిసర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారితో సమావేశమై సూచించారు. అనంతరం గ్రామస్తులకు ఫేస్ మాస్కులు పంపిణీ చేశారు.
గుంపులు గుంపులుగా తిరగాలి, మాస్కులు ధరించాలి
అత్యవసరమైతే గుంపులుగా సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే బయట తిరగాలని ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సూచించారు. పీసీసీఎఫ్ ప్రధాన అటవీ అధికారి ఏలుసింగ్ మేరు మాట్లాడుతూ.... పులి దాడుల కారణంగా ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ప్రాంతాల్లో మహరాష్ట్ర నుండి పులులు జతకట్టడం కోసం వస్తున్నాయని, అవి వచ్చి పోయే మార్గంలో ఎవరైనా కనిపిస్తే వారిపై దాడులు చేస్తున్నాయని, కొద్ది రోజులపాటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పంట చేలకు వెళ్లిన 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు ఫేస్ మాస్కులు ముఖానికి కాకుండా, తల వెనుక భాగంలో ధరించి గుంపులు గుంపులుగా ఉండాలన్నారు.
రాత్రివేళ గ్రామాల శివార్లలో డ్రమ్స్ వాయించాలని అధికారులు సూచించారు. విజిల్ వెంట తీసుకెళ్లాలని, ఎక్కడైనా పులి కనిపిస్తే గట్టిగా శబ్దం చేయాలని సూచించారు. పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతంలో ఇలాగే ఫేస్ మాస్కులను తల వెనుక భాగంలో ధరించడం వల్ల పులి దాడులు కొంత మేర తగ్గాయని అధికారులు తెలిపారు.
సిర్పూర్ (టి) మండలంలోని దుబ్బగూడా శివారులో గల పత్తిచెనులో పులి దాడి ఘటనలో గాయపడ్డ రౌత్ సురేష్ మంచిర్యాల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న పిసిసిఎఫ్ ఏలూసింగ్ మేరు మంచిర్యాలలోని ఆస్పత్రిలో ఆయనను పరామర్శించి ఆయన ఆరోగ్య వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అటవీశాఖ తరపున వారిని అన్ని విధాల ఆదుకుంటామన్నారు.