Kamareddy Master Plan Issue: కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్న రైతు జేఏసీ
Kamareddy Master Plan Issue: తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని రైతు జేఏసీ చెబుతోంది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తమ పోరాటం మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమయ్యారు అన్నదాతలు.
- కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు చేసే వరకు పోరాటం ఆగదన్న రైతు జేఏసీ
- భవిష్యత్ ప్రణాళికను ప్రకటించిన రైతు జేఏసీ
Kamareddy Master Plan Issue: కామారెడ్డి లో మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలంటూ గత కొన్ని రోజులుగా రైతులు చేస్తున్న ఉద్యమం ఇంకా చల్లారలేదు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని రైతు జేఏసీ చెబుతోంది. మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా తమ పోరాటం మరింత ఉదృతం చేసేందుకు సిద్ధమయ్యారు అన్నదాతలు. కామారెడ్డి కలెక్టర్ జితేష్ పాటిల్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాస్టర్ ప్లాన్ పై స్పందించిన్నప్పటికి రైతులు సంతృప్తి చెంద లేదు. మాస్టర్ ప్లాన్ ను రద్దు చేసేదాక ఊరుకునేది లేదన్నారు. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అడ్లూరు ఎల్లారెడ్డి లో 8 గ్రామాల మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు అత్యవసర సమావేశం జరిపారు. ఈ సమావేశంలో రైతులు తమ ఉద్యమ కార్యాచరణను ప్రకటించారు.
రైతులకు అన్యాయం చేసేలా రూపొందించిన కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని రైతు నేతలు నిర్ణయించారు. ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేష్ ప్రకటన పై రైతు జేఏసీ అసంతృప్తి వ్యక్తం చేసింది. రేవు ఉదయం (సోమవారం) నుంచి కామారెడ్డి పట్టణంలోని 49 మంది కౌన్సిలర్లు ఇళ్లకు వెళ్లి మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని వినతి పత్రాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. మాస్టర్ ప్లాన్ రద్దు కు కౌన్సిల్ తీర్మాణం చేయాలని కౌన్సిలర్లను కోరాలని నిర్ణయం తీసుకున్నారు. 11న మున్సిపాలిటీ ఎదుట రైతు జే.ఏ.సి. ధర్నా చేయాలని తీర్మానం. ఈనెల 11వ తేదీ తర్వాత ఉద్యమం మరింత ఉదృతం చేస్తామని ప్రకటించారు. రైతులకు నష్టం చేసే పని ఎవరు చేయవద్దని... విధ్వంసాలకు పాల్పడవద్దని రైతు జేఏసీ నేతలు సూచించారు.
హైకోర్టులో రైతులు వేసిన పిటిషన్ పై సోమవారం వాదనలు...
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ ను వ్యతిరేకిస్తూ గత కొన్ని రోజులుగా అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 8 గ్రామాల రైతులు వ్యవసాయ భూములు ఇండస్ట్రియల్ జోన్ లోకి వెళ్లాయని ఆందోళన చేస్తున్నారు. ఎలాంటి ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా... రాజకీయ నాయకుల స్వార్థం కోసం మాస్టర్ ప్లాన్ ను రూపొందించారని రైతులు ఆరోపించారు. దీంతో రైతులు తమ సాగు భూములు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతులు మాస్టర్ ప్లాన్ ను రద్దు చేయాలని హైకోర్టును ఆశ్రయించారు రైతులు. రైతుల పిటిషన్ పై హైకోర్టులో సోమవారం వాదనలు జరగనున్నాయి. తమకు న్యాయం జరుగుతుందని రైతులు ధీమాగా ఉన్నారు.
స్పందించిన మంత్రి కేటీఆర్
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ నిరసనలపై మంత్రి కేటీఆర్ స్పందించారు. హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో పట్టణ ప్రగతి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లాలో నెలకొన్న పరిస్థితులను ఆ జిల్లా అదనపు కలెక్టర్‌ను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. అసలు మాస్టర్ ప్లాన్ ఏంటని కామారెడ్డి కమిషనర్ ను ప్రశ్నించారు. ఈ అంశం గురించి తనకు తెలియదని చెప్పారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజీలో ఉందన్న విషయాన్ని ప్రజలకు ఎందుకు చెప్పలేకపోతున్నారని అధికారులను ప్రశ్నించారు. ప్రజాభిప్రాయం ప్రకారం మార్పులు చేర్పులు చేస్తామని చెప్పొచ్చు కదా అని అన్నారు. కేవలం మాస్టర్ ప్లాన్ ముసాయిదా మాత్రమే ఇచ్చారని కేటీఆర్ తెలిపారు. ప్రజల కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. అభ్యంతరాలు ఉంటే ముసాయిదాలో మార్పులు చేస్తామని ప్రకటించారు. వినతులు, అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ప్రజలకు అన్ని విషయాలు వివరించాలని సూచించారు.