Adilabad News: చుక్క బొట్టు వేస్తే గాని అక్కడి అమ్మాయిలకు పెళ్లి జరగదు, తరతరాలుగా అదే సాంప్రదాయం
Thoti Tribe Lives in Adilabad district, Telangana | ఆదిలాబాద్ జిల్లాలో తోటి ఆదివాసీ తెగల వారి సంస్కృతి, సంప్రదాయాలు కాస్త భిన్నంగా ఉంటాయి. పచ్చబొట్లతో పాటు భిన్నమైన వాయిద్య పరికరాలు ఉన్నాయి.
Thoti Tribe lives in tribal areas of Adilabad district, Telangana | ఆదిలాబాద్: అడవుల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్ జిల్లాలో అడవిబిడ్డల సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు అందరికన్నా కాస్త భిన్నంగా ఉంటాయి. ఆదివాసిల్లోని తోటి తెగవారు పూర్వకాలం నుంచి పెద్దలు పాటిస్తున్న ఆచార సంప్రదాయాన్ని కులవృత్తిగా నేటికీ కొనసాగిస్తూ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తోటి తెగవారిని బిరుదు గోండులు అని కూడా పిలుస్తుంటారు. వీరి కులవృత్తి చుక్కబోట్లు వేయడం.. కిక్రి.. డక్కి.. వాయిద్యాలు వాయించడం.. పాటలు పాడడం.. ఆదివాసీల్లోని కొన్ని తెగలకు తరతరాలుగా తోటి తెగవారు చుక్కబొట్లు వేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ఇంతకీ తోటి తెగలోని ఆదివాసీలు చుక్కబొట్లను ఎలా వేస్తారు..? ఎలా తయారు చేస్తారు..? ఎవరికీ వేస్తారు...? ఈ సాంప్రదాయం ఎప్పటినుండి వస్తుంది..? ఏబీపీ దేశం స్పెషల్ స్టోరీలో చూద్దాం.
పూర్వీకుల నుంచి కొనసాగుతోన్న సంప్రదాయాలు ఇవే
ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం గ్రామానికి చెందిన తోటి తెగ ఆదివాసీలు.. తాత ముత్తాతల కాలంగా తమ కుల వృత్తిని నమ్ముకుని నేటికీ తమ సంస్కృతికి జీవం పోస్తున్నారు. తోటి తెగ ఆదివాసీలకు కిక్రి.. డక్కి.. వాయిద్యాలు వాయించడం అలాగే పచ్చబొట్లు (చుక్క బొట్లు) వేసే ఆచారం పూర్వీకుల నుండి కొనసాగుతావస్తోంది. ఆదివాసి తెగలలోని కొన్ని తెగలకు మాత్రమే వీరు పచ్చబొట్లు తమ ఆచార సాంప్రదాయాలకు కట్టుబడి వేస్తూ ఉంటారు. ఆదివాసీల్లోని గోండు, కోలాం, తోటి, నాయకపోడ్ తదితర తెగల వారి శరీరాలపై ఎక్కువగా పచ్చబొట్లు కనిపిస్తూ ఉంటాయి. ఆదివాసుల సాంప్రదాయాల ప్రకారం సూర్యచంద్రుల చిహ్నాలను ఎక్కువగా తమ నుదుటిపైన, చేతులపైన వేసుకుంటారు. అలాగే పువ్వులు, అక్క చెల్లెల అనుబంధం, బావి వద్దకు వెళ్లే సన్నివేశాలు, రథం, తులసి చెట్టు, ఇతర రకాల చుక్కబోట్లను ఆదివాసీలు వేసుకుంటారు.
సూర్యచంద్రులు వారి ఆది దైవాలుగా భావిస్తూ ఎక్కువగా ఆ చిహ్నాల పచ్చబొట్లనే వేసుకుంటారు. తోటి తెగ వారు మాత్రమే ఈ చుక్కబొట్లు వేస్తేనే ఈ ఆదివాసీ తెగలవారు చుక్కబొట్లు వేసుకుంటారు ఇతరుల వద్ద వారు వేసుకోరు. ఇది తమ సంస్కృతి... తమ సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు కట్టుబడి పూర్వకాలం నుండి నేటికీ ఈ ఆచారం కొనసాగుతావస్తోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో తోటి తెగల సంఖ్య చాలా తక్కువగా ఉంది. తమ కుల వృత్తి నమ్ముకునే చాలామంది జీవనం కొనసాగిస్తున్నారు. పచ్చబొట్లు వేయడం అంటే ఆషామాషి కాదు.. అడవుల్లో లభించే వనములికలను సేకరించి రంగును తయారు చేస్తారు. ఆముదం నూనెతో దీపం వెలిగించి దానిపై పెంక పెట్టి ఆ పెంకకు పడే మసీని సేకరిస్తారు. ఈ మసిని వీరు తమ భాషలో "కాజుని" అని అంటారు. అలాగే అడవుల్లో లభించే "వెంగూర్ చెక్క".. గోండి భాషలో "బివ్లా చెక్క" అని అంటారు. ఈ మసిని, ఓ కప్పులో వేసి బివ్లా చెక్కను వేసి కొన్నీ నీళ్లు పోసి కలుపుతారు. అప్పుడు ఈ పచ్చబొట్టు యొక్క రంగు తయారవుతుంది.
తమ దైవ రహస్యమని చెబుతున్న ఆదివాసీలు
సూదికి చేతిలో పట్టు ఉండేలా దారాన్ని చుట్టి ఈ రంగును వేసే చోట ఓ కట్టేపుల్ల ద్వారా మొదటగా చుక్క వేసి.. ఆపై సూది ద్వారా పచ్చబొట్టు ఉన్న భాగం మొత్తం పొడుస్తుంటారు. కొంతమేర నొప్పిగా ఉంటుంది. కొంత రక్తస్రావము, నీరు బయటకు వస్తుంది కానీ, ఈ పచ్చబొట్టు మిశ్రమ రంగు నీళ్లు పోయగానే అది కనపడదు. ఆపై అది మటుమాయమైపోయి.. శరీరంపై పచ్చగా కనబడుతుంది. ఈ పచ్చని రంగు శరీరంలో జీవం ఉన్నంతవరకు అలాగే ఉంటుంది. ఇదంతా తమ దైవ రహస్యమని పూర్వికులు తమకు అందించిన వరప్రదాయమని, బ్రహ్మరాత నుదుటిపై కనబడదు.. కానీ తోటి తెగవారు వేసిన ఈ పచ్చబొట్టు రాత మాత్రం జీవం ఉన్నంతవరకు శరీరంపై కనిపిస్తుందని ఇది తమ ఆది దైవాల ఆదేశం మేరకే.. నేటికీ తమ సాంప్రదాయాన్ని ఇలా కొనసాగిస్తున్నామని ఈ పచ్చబొట్టు ఉంటేనే తమ ఆడపిల్లలకు పెళ్లి అవుతుందని, పచ్చబొట్టు లేకుంటే పెళ్లి కాదని, ఇది తమ సాంప్రదాయమని ఈ ఆచారం తమ కొన్ని తెగల్లో మాత్రమే ఉందని, ఈ పచ్చబొట్లను తమకు సంబంధించిన కొన్ని తెగలకు మాత్రమే వేస్తామని ఇతరులకు అస్సలు వేయమని, తోటి తెగ ఆదివాసీ మహిళలు మర్సుకోల కళావతి మరియు పెందూర్ సత్తమ్మ ఏబిపి దేశంతో తెలిపారు.
సింగార్ ఉంటేనే తమ తెగవారిగా గుర్తింపు
పచ్చబొట్లు.. చుక్క బొట్లు అని ఇలా తెలుగు భాషలో అంటారు. దీన్నే ఆదివాసీలు తమ భాషలో "సింగార్" అని అంటారు. పూర్వకాలంలో తమ పెద్దలు సింగార్ ఉంటేనే తమ తెగవారిగా గుర్తించేవారని, నేటికీ సైతం అదే ఆచారాన్ని తమ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా కొనసాగిస్తున్నారు. తమ ఆది దైవమైన సూర్యచంద్రులను వంశ పారంపర్యంగా కొలుస్తుంటారు. ఆదివాసీలు తమ దేవస్థానాల వద్ద సైతం తెల్లటి వస్త్రంలో ఈ సూర్యచంద్రుల చిహ్నలను వేస్తుంటారు. అలాగే ఆదివాసీ మహిళలు తమ నుదుటిపైన చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు ఒక చుక్క బొట్టు అయినా సరే.. ఈ సూర్యచంద్రుల చిహ్నాలను తమ ఆచార సంప్రదాయంలో భాగంగా పచ్చని చుక్కబొట్లు వేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చేతుల పైన ఇతర తమ సాంప్రదాయ చిహ్నాలను బొమ్మలను వేసుకుంటారు. అలాగే ఎవరికైనా నొప్పులు ఉన్నా కూడా ఆ నొప్పులు ఉన్నచోట రెండు మూడు గీతలు ఈ పచ్చని చుక్క బొట్లను వేసుకోవడం వల్ల నొప్పులు సైతం మటుమాయమవుతాయని ఆదివాసీలు చెబుతున్నారు. అలా నొప్పులు మటుమాయమైన విషయాన్ని తోషం గ్రామానికి చెందిన తోడసం మారుతి abp దేశంతో వివరించారు.
తాను చిన్న వయసులో బావిలో పడడం జరిగిందని, అప్పుడు నడుము నొప్పి కాలినొప్పులు అతిగా ఉండేవని, తాను సరిగా నిలబడలేక పోవడం, నడవలేకపోవడం జరిగిందని, అప్పుడు ఆయనకు తన అమ్మమ్మ పచ్చబొట్లను నొప్పులు ఉన్నచోట నడుముపై కాళ్లపై వేయించిందని అప్పటినుండి నొప్పులు మాయమైపోయాయని, తాను ఇప్పుడు వృద్ధ వయసు వరకు వచ్చినప్పటికిని ఎలాంటి నొప్పి లేదని, తాను ఇప్పటికీ మంచిగా నడుస్తూ వెళ్లడం జరుగుతుందని, ఈ పచ్చబొట్లలో తమ అడవుల్లో లభించే వనమూలికల ఔషధ గుణాలు తమ ఆదిదైవం అందించిన వరప్రదాయమని, ఈ చుక్కబొట్ల ద్వారా తమకు ఇలా తమ సంస్కృతి సాంప్రదాయంలో భాగంగాను,, తమ ఆరోగ్యానికి సైతం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
తోటి ఆదివాసి తెగలమైన తమకి ఈ చుక్క బొట్లు వేసే ఆచారం పూర్వకాలం నుండి పెద్దలు అందించిన క్రమంగానే నేటికీ ఇప్పటి కాలం వరకు ఆచార వ్యవహారాన్ని మర్చిపోకుండా పచ్చబొట్లు వేయడం.. అలాగే తాము వేసుకోవడం జరుగుతుందని, ముఖ్యంగా పెళ్లికాని ఆడపిల్లలు కచ్చితంగా ఒక్క చుక్క బొట్టు అయినా వేసుకోవాలని ఇది తమ ఆచారమని చుక్కబొట్టు వేయకుంటే పెళ్లి చేయరని అందుకు ఎవరు ముందు రారని ఖచ్చితంగా పెళ్లి సమయంలోనైనా ఒక్క చుక్క బొట్టు అయినా సరే వేయడం జరుగుతుందని ఇది ఆచార సాంప్రదాయంలో ఒక భాగం అని తోటి ఆదివాసి మహిళ తొడసం నీలాబాయి abp దేశంతో తెలిపారు.
ఆదివాసిల్లోని కొన్ని తెగలు ఆచార సాంప్రదాయంలో భాగంగా ఎక్కువగా యువతులు, మహిళలు ఈ పచ్చబొట్లు వేసుకోవడం జరుగుతుందని, మహిళలు యువతులు తమకిష్టమైన బొమ్మలను వివిధ రకాల చిహ్నాలను వేసుకోవడం జరుగుతుందని, ఎక్కువగా తమ సాంప్రదాయంలో తమ ఆది దైవమైన సూర్యచంద్రులను కొలుస్తూ ఆ చిహ్నాలనే నుదుటిపైన ఎక్కువగా వేసుకోవడం జరుగుతుందని, తోషం గ్రామానికి చెందిన కుమ్ర మధుమిత ఏబిపీ దేశంతో వివరించారు. ఇంటర్ చదువుతున్న తాను తొలిసారిగా సూర్యచంద్రుల చిహ్నాల పచ్చబొట్లను నుదుటిపైన అలాగే కుడి ఎడమ కన్నుల పక్కన.. పెదవి కింద సాంప్రదాయ చుక్కలను వేసుకున్నారు.
పచ్చబొట్ల వల్ల ఉద్యోగాల ఎంపికలో రిజెక్ట్
కొంతమంది యువతులు చేతులపైన అక్కా చెల్లెళ్ల బంధము, అలాగే బావి వద్ద నీళ్లకు వెళ్లే దృశ్యము, రథము, తులసి చెట్టు, తదితర చిహ్నాలను సైతం వేసుకుంటారని, ప్రస్తుతం ఇటీవలి కాలంలో ఎక్కువగా యువతి యువకులు ఈ పచ్చబొట్లను వేసుకోవడం లేదని, చదువు రంగాలలో ఉన్న విద్యార్థులు పోలీస్ ఆర్మీ ఉద్యోగాల ఎంపికలో ఈ పచ్చబొట్లు ఉండడం వల్ల రిజెక్ట్ అవుతున్నారని అందుకే పచ్చబోట్లు వేసుకోవడం లేదనన్నారు. ముఖ్యంగా తమ తెగల్లో పెళ్లి కానీ యువతులకు ఖచ్చితంగా ఒక చుక్క చిన్నదైనా సరే పచ్చబొట్టు వేయడం తమ సాంప్రదాయమని, అందుకుగాను ఈ పచ్చబొట్లను అలా వేసుకోవడం జరుగుతుందన్నారు.
సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ తమ ఆచార వ్యవహారాలను పూర్వకాలం నుండి నేటికీ పాటిస్తూ ఈ పచ్చబొట్లు వేయడం.. తమ తెగల్లోని సాంప్రదాయ వాయిద్యాలైనా డక్కి.. కిక్రి.. వాయిద్యాలను వాయిస్తూ ఇలా తమ జీవనం కొనసాగిస్తున్నామని తమకు ఎలాంటి ఉపాధి లేదని తమ తోటి ఆదిమ తెగ.. ప్రిమిటివ్ వర్ణరైబుల్ ట్రెబ్ గ్రూప్(PVTG)లో ఉన్నప్పటికిని తమకి ఐటీడీఏ ద్వారా సరైన ఉపాధి అవకాశాలు ఉద్యోగాలు అందడం లేదని కులవృత్తులను నమ్ముకుని ఇలా తమ జీవనం కొనసాగిస్తున్నామని తమకు ఐటీడీఏ ద్వారా ఉద్యోగ ఉపాధ్యాయ అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేయాలని కోరుతున్నారు.