Khammam Politics: ఉందామా..? వెళ్దామా..? భవిష్యత్‌పై డైలమాలో ఖమ్మం నేతలు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి రగులుతుంది. కారులో సీటు దొరక్కపోతే ఏం చేయాలనే విషయంపై నేతలు అంతర్మథనంలో పడ్డారు. ఇప్పటికే కొందరు దుకాణం సర్దేయగా మరికొందరు ఆలోచనలో పడ్డారు.
ఇప్పుడిప్పుడే జిల్లాలో ఎన్నికల వేడి రాజుకుంటున్న క్రమంలో ఇప్పటి వరకు స్తబ్దుగా ఉన్న నేతలు తమ అంబులపొదిలో ఉన్న అస్త్రశస్త్రాలు సిద్ధం చేసే పనిలో నియగ్నమయ్యారు. ఆగస్ట్ నెలాఖరుకల్లా తమ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించుకునేందుకు కార్యాచరణ రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది. జిల్లాలో రాజకీయ సందడి ప్రారంభమైంది. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా పార్టీల్లో కీలకంగా ఉన్న నేతలు, టికెట్ ఆశిస్తున్న నేతల అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో తమ మార్క్ రాజకీయాలకు తెరలేపారు. రాజకీయ ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు అందరి దృష్టి తమ వైపునకు తిప్పుకునేందుకు వ్యూహరచన సాగుతోంది. అందివచ్చిన అవకాశాలను చేజార్చుకోకుండా సద్వినియోగం చేసుకునేందుకు నేతల ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే పార్టీ కార్యక్రమాల్లో తమ సత్తా చాటేందుకు వెనుకడుగు వేయడం లేదు. పార్టీలో ఉన్న తమ ప్రత్యర్థులను నిలువరించేందుకు దూకుడుగా వ్యవహరిస్తున్నారు.
ఒక్కొనియోజకవర్గంలో ముగ్గురుపైనే పోటీ..
టీఆర్‌ఎస్ పార్టీలో టికెట్లు ఆశిస్తున్న వారి సంఖ్య ఒక్కో నియోజకవర్గంలో ముగ్గురి నుంచి నలుగురి వరకు ఉంటుంది. అయితే పీకే సర్వేతోపాటు పార్టీ కోసం పనిచేసే వారినే టికెట్ కేటాయింపులో పరిగణలోకి తీసుకుంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేయడంతో ఆ పార్టీలో నేతలు బహుముఖ వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీలో తమకు మనుగడ లేదనుకునే నేతలు తట్టా బుట్ట సర్దుకునేందుకు మంచి సమయం కోసం వేచి చూస్తున్నారు. ఇదే తరహాలో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్ బాట పట్టారు.
ఇక టికెట్ ఎలాగైనా సంపాదించుకోవాలనుకునే నేతలు బల ప్రదర్శనలు చేయడంతోపాటు రాష్ట్ర నాయకత్వం దష్టిలో పడేందుకు ప్రయత్నిస్తున్నారు. వైరా మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్‌లాల్ వర్గం బలప్రదర్శనకు దిగారు. కొణిజర్ల మండలం అమ్మపాలెంలో ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కొణిజర్ల నుంచి అమ్మపాలెం వరకు మదన్‌లాల్ నేతృత్వంలో మోటారు సైకిల్ ర్యాలీ సాగింది. వైరా నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే రాములు నాయక్‌తోపాటు మాజీ ఎమ్మెల్యేలు బానోత్ మదన్‌లాల్, చంద్రావతి కూడా టికెట్లను ఆశిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారే ప్రజల్లోకి వెళ్లేందుకు ఏదో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. జిల్లాలోని ఇతర నియోజకవర్గాల్లోని టీఆర్‌ఎస్ పార్టీలో అనేకమంది టికెట్ ఆశిస్తుండటంతో ఇప్పటి నుంచే దూకుడు పెంచేశారు.
ఆగస్టు వరకు ఆచితూచి..
వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న నేతల ఆలోచనలు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా సాగుతున్నాయి. జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తున్న ఆయా నేతలు అందుకు తగిన రీతిలో స్పందించేందుకు సిద్ధమవుతున్నారు. తమకు పోటీ చేసేందుకు టికెట్ వచ్చే అవకాశాలు.. అధిష్ఠానం తమ పట్ల ఎలాంటి దక్పథంతో ఉంది తదితర అంశాలను బేరీజు వేసుకుంటున్నట్లు సమాచారం. ఏ నిర్ణయం తీసుకుంటే తమ రాజకీయ ప్రస్థానం సజావుగా సాగుతుందనే దానిపై సన్నిహితులు, అనుయాయులతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో నెలకొన్న పరిస్థితులు, నియోజకవర్గంలో తమ గెలుపునకు గల అవకాశాలను చూసుకుని ముందుకు సాగాలని భావిస్తున్నారు. వీటన్నింటిపై ఆగస్ట్ నెలాఖరులోగా ఒక స్పష్టతకు వచ్చి.. అప్పుడు నిర్ణయం తీసుకునేందుకు కీలక నేతలు సిద్ధమవుతున్నారు. జిల్లా రాజకీయాల్లో వచ్చే ఆగస్ట్ పెనుమార్పులకు వేదిక అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.