Komatireddy Venkat Reddy: టీఆర్ఎస్ నేత పాడె మోసిన ఎంపీ కోమటి రెడ్డి.. అంత్యక్రియలకు హాజరు
అంత్యక్రియల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని స్వయంగా వారి పాడె మోశారు. ఎంపీటీసీ దంపతులతో తనకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో పార్టీలకతీతంగా ఎంపీ కోమటిరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
హైదరాబాద్ శివారులో పెద్ద అంబర్ పేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన ఘోర రోడ్డుప్రమాదంలో ఎంపీటీసీ దంపతులు దొంతం కవిత, టీఆర్ఎస్ నేత వేణుగోపాల్ రెడ్డి దంపతులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. వీరి మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం బుధవారం నల్గొండ జిల్లా దుప్పలపల్లికి తీసుకువచ్చారు. దీంతో ఆ గ్రామంలో కుటుంబ సభ్యులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. ఈ అంత్యక్రియల్లో భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొని స్వయంగా వారి పాడె మోశారు. ఎంపీటీసీ దంపతులతో తనకు ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలో పార్టీలకతీతంగా ఎంపీ కోమటిరెడ్డి అంత్యక్రియలకు హాజరయ్యారు.
అంతకుముందు దొంతం కవిత, వేణుగోపాల్ రెడ్డి మృతదేహాలకు పలువురు ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించారు. నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సైతం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రిలో ఎంపీటీసీ దంపతుల మృతదేహాలను సందర్శించి వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దుప్పలపల్లిలో శాసన మండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కంచర్ల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు దుబ్బాక నరసింహా రెడ్డి, టీఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్ రెడ్డి రవీందర్‌రెడ్డి, ఎంపీపీ విజయలక్ష్మి, ఉప ఎంపీపీ ఏనుగు వెంకట్‌రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ మందడి సైదిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి తదితరులు ఎంపీటీసీ దంపతులకు నివాళులు అర్పించారు.
ఎంపీటీసీ దొంతం కవిత, టీఆర్ఎస్ నేత వేణుగోపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో నివాసం ఉంటున్నారు. వీరికి నల్గొండలో సొంత ఇల్లు ఉంది. రెండు రోజుల క్రితం సొంత పనుల నిమిత్తం వీరిద్దరూ సొంతింటికి వచ్చారు. పనులు ముగించుకుని మంగళవారం రాత్రి 9.30 గంటలకు స్కార్పియో వాహనంలో హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ క్రమంలో సుమారు రాత్రి 11.45 గంటల ప్రాంతంతో ఔటర్ రింగ్ రోడ్డు దాటాక పెద్ద అంబర్‌పేటలో ఓ టిప్పర్ లారీ సడెన్ బ్రేక్ వేయడంతో వెనుక నుంచి వస్తున్న వీరి స్కార్పియో వాహనం లారీని ఢీకొంది. దీంతో కవిత, వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మృతిచెందారు. ఉస్మానియా ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన అనంతరం మృతదేహాలను పోలీసులు అంత్యక్రియల నిమిత్తం సొంత గ్రామమైన దుప్పలపల్లికి తీసుకువచ్చారు.
వివాహం జరిగి పదిరోజులు గడవకముందే..
ఎంపీటీసీ దంపతుల కుమార్తె ప్రీతి రెడ్డి వివాహం పది రోజుల క్రితమే వైభవంగా జరిగింది. కుమార్తె వివాహం అయి పదిరోజులు గడవకముందే తల్లిదండ్రులు ఇద్దరూ అకాల మరణం చెందారు. సెప్టెంబర్ 10, 11 వీరు కుమార్తె, అల్లుడిని తీసుకుని తిరుపతి వెళ్లాల్సి ఉంది. ఇంతలోనే జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులు చనిపోవడం ఆ కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది.