Telangana Rains: తెలంగాణలో వరుణుడి బీభత్సం- ఈ జిల్లాల ప్రజలు బయటకు రావద్దని అధికారుల సూచన
Telangana: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. హైదరాబాద్‌లో కాస్త తగ్గినా ఇంకా ప్రమాదం పోలేదని అధికారులు చెబుతున్నారు. 9 జిల్లాల ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Hyderabad: తెలంగాణలో కూడా వర్షాలు బీభత్సం సృష్టించాయి. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో వానలు ఏకదాటిగా కురుస్తుండటంతో చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఖమ్మం జిల్లా మరింతగా నష్టపోయింది. దీంతో అధికారులు ఖమ్మం జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇవాళ కూడా దాదాపు 9 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి నారాయణపేట, గద్వాల జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. 20 సెంటీమీటర్లకుపైగా వర్షపాత నమోదు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు.
కుమ్రం భీం, మంచిర్యాల, జగిత్యాల, జయశంకర్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, మెదర్ జిల్లా ఎల్లో ఆలర్ట్ హెచ్చరికలు అధికారులు జారీ చేశారు.
రెడ్ అలర్ట్ జారీ అయిన జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖాధికారులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే కురిసిన వానలకు పలు ప్రాంతాలు నీట మునిగాయని... ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల వల్ల వరదలు మరింత పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. అందుకే ప్రయాణాలు, ఇతర పనులు వాయిదా వేసుకోవాలని సూచిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన వర్షాలకు ఇప్పటి వరకు దాదాపు పదిమంది వరకు మృతి చెందారు.
Also Read: అల్పపీడనం అంటే ఏమిటి? తుపాన్ ఎలా ఏర్పడుతుంది? తుపాన్లకు ఆ పేర్లు ఎలా పెడతారు
భారీగా కురిసిన వర్షాలకు జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. తెలంగాణలో భారీ నష్టం ఖమ్మం జిల్లాకు జరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఆ జిల్లాలో వరద బీభత్సానికి జనజీవనం పూర్తిగా అస్తవ్యస్థమైంది. మున్నేరు వాగు ధాటికి దిగువ ప్రాంతాలు నీట మునిగిపోయాయి. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అక్కడే ఉంటూ పరిస్థితులపై సమీక్ష చేస్తున్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో చాలా కాలనీలు ఇంకా నీటిలోనే ఉన్నాయి.
పాలేరు వాగు ప్రవాహం ధాటికి కోదాడ సమీపంలోని రామాపురం వద్ద ఉన్న క్రాస్ రోడ్డ బ్రిడ్జి తెగిపోయింది. దీంతో ఏపీకి వెళ్లే వాహనాలన్నీ నిలిచిపోయాయి. ఇరు ప్రాంతాల మధ్య రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అటు వర్షాల ధాటికి సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి కూడా ఆగిపోయింది.
అన్ని ప్రాంతాలకు వర్షాలు భారీగా కురిసే ప్రమాదం ఉందని గ్రహించిన అధికారులు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు.
రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తూ ఉంది. దీంతో వాగులో గొర్రెల కాపరులు కొట్టుకుపోయారు. వాగు ఉద్ధృతి ఒక్కసారిగా పెరగడంతో చంద్రయ్య, అంకుష్ జారిపడిపోయారు. వాళ్లిద్దరిని స్థానికులు అతి కష్టమ్మీద కాపాడారు. వాళ్లను కాపాడినప్పటికీ 80 గొర్రెలు మాత్రం వాగులో చిక్కుకున్నాయి.
Also Read: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్ లు ఇవే