
Hyderabad - Vijayawada Route: వర్షాల ఎఫెక్ట్, హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్ లు ఇవే
Heavy Rains In Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనేక ప్రాంతాల్లో రహదారులపైకి నీరు చేరడంతో ప్రయాణాలు వద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Heavy Rains In Telugu States : రెండు తెలుగు రాష్ట్రాల్లో గడిచిన కొద్ది రోజుల నుంచి భారీగా వర్షాలు కుడుస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో అనేక ప్రాంతాల మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రయాణాలు సాగించే ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. కొన్ని మార్గాల గుండా ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కూడా సూచిస్తున్నారు.
తెలంగాణలోని కోదాడ మండలం నల్లబండగూడెం వద్ద పాలేరు వాగు ఉధృతికి జాతీయ రహదారిపై నీరు భారీగా చేరింది. దీంతో హైదరాబాద్ - విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. సూర్యాపేట మీదుగా ఖమ్మం, విజయవాడ వెళ్లే ప్రజలు ప్రయాణం వాయిదా వేసుకోవాలని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ సూచించారు. సూర్యాపేట నుంచి ఖమ్మం వెళ్లే మార్గంలో నాయకిని గూడెం వద్ద పాలేరు వాగు ఉదృతంగా ప్రవహిస్తోందని ఆయన వెల్లడించారు. రక్షణ చర్యల్లో భాగంగా ఈ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిపివేసినట్లు ఎస్పీ వెల్లడించారు.
హైదరాబాద్ నుంచి ఖమ్మం- విజయవాడ వెళ్లేందుకు కొత్త రూట్ లు..
హైదరాబాద్ - విజయవాడ
హైదరాబాద్ నుంచి చౌటుప్పల్-చిట్యాల- నార్కట్‌పల్లి- నల్గొండ- మిర్యాలగూడ- పిడుగురాళ్ల- గుంటూరు- విజయవాడ వెళ్లాలని పోలీసులు సూచించారు.
హైదరాబాద్ - ఖమ్మం..
చౌటుప్పల్- చిట్యాల- నార్కట్‌పల్లి- అరవపల్లి- తుంగతుర్తి- మద్దిరాల- మరిపెడ మీదుగా వెళ్లాలని పోలీసుల సూచించారు.
హైవేపై అనుమతించబోము అన్న అధికారులు..
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం అయితవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై మున్నేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. హైవేపై మోకాళ్ళ లోతులో వరద వస్తుండడంతో వాహనాల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు. విజయవాడ - హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలు రాకుండా పోలీసు, రెవెన్యూ అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. దీనిలో భాగంగా హైదరాబాద్ వైపు చిలకల్లు టోల్ ప్లాజా వద్ద, విజయవాడ వైపు కేసర టోల్ ప్లాజా వద్ద వాహనాలను నిలిపివేశారు. దీంతో హైవే పూర్తిగా స్తంభించిపోయింది. వరద తగ్గేంతవరకు హైవేపై ఎవరిని అనుమతించబోమని నందిగామ ఆర్డీవో రవీంద్రరావు వెల్లడించారు.
పలు రైళ్లు రద్దు.. కొన్ని దారి మళ్లింపు..
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఇప్పటికే 30కిపైగా రైళ్ళను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ నుంచి తిరుపతికి వెళ్లే కాకినాడ పోర్టు ఎక్స్ప్రెస్ ను రాజమండ్రిలో నిలిపివేసి రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వస్తున్న రత్నాచల్ ఎక్స్ప్రెస్ లో భీమవరం మీదుగా దారి మళ్ళించారు. ట్రాకులు కొట్టుకుపోవడంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కాజీపేట, రాయనపాడులో ట్రాకులు తెగిపోవడంతో రైళ్ళు నిలిపివేశారు. ఆదివారం, సోమవారం కలిపి మొత్తం 80 రైళ్లు రద్దు చేయగా, మరో 48 రైళ్లను దారి మళ్ళించారు. హైదరాబాద్ - విజయవాడ రూట్ లోనే అత్యధిక రైళ్లు రద్దు అయ్యాయి. మరోవైపు పలు ప్రాంతాలకు వెళ్లే రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి.
Also Read: Chandrababu: బాలకృష్ణ స్వర్ణోత్సవ వేడుకలకు చంద్రబాబు గైర్హాజరు, ఫోన్లోనే బాలయ్యకు విషెస్
అధికారులను అప్రమత్తం చేసిన మంత్రి టీజీ భరత్
సుంకేసుల డ్యాం భద్రతపై కర్నూలు జిల్లా అధికారులను మంత్రి టీజీ భరత్ అప్రమత్తం చేశారు. సుంకేసుల డ్యామ్ వద్ద తెలంగాణ వైపు మట్టి కరకట్ట కుంగిన ఘటనపై అధికారులతో మంత్రి మాట్లాడి వివరాలను తెలుసుకున్నారు. ప్రజలెవరు ఆందోళన చెందవద్దని ఈ సందర్భంగా మంత్రి కోరారు. వరదలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఎప్పటికప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలెవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం అన్ని రకాల జాగ్రత్త చర్యలను తీసుకుందని మంత్రి వెల్లడించారు. జిల్లా యంత్రాంగం పూర్తిగా అందుబాటులో ఉందని, విపత్తు నిర్వహణ పనులను సమర్ధవంతంగా చేపడుతున్నట్లు మంత్రి వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
