Harish Rao Temple Visit: రేపటి నుంచి హరీష్ రావు ఆలయాల యాత్ర! కారణం ఏంటంటే
Telangana News | తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రేవంత్ రెడ్డి చేసిన దొంగ ప్రమాణాలకు ప్రజల్ని శిక్షించవద్దని దేవుళ్లను ప్రార్థిస్తామన్నారు హరీష్ రావు.
BRS MLA Harish rao announced temple visit from Yadadri Temple | హైదరాబాద్: రైతు రుణమాఫీపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ల మీద ఒట్టేసి అన్నదాతల్ని దగా చేశారని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ముఖ్యమంత్రి చేసిన పాపానికి తెలంగాణ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూసేలా ఆలయాలకు వెళ్లి దేవుళ్లకు పూజలు చేస్తానని ఇటీవల హరీష్ రావు ప్రకటించారు. ఇందులో భాగంగా రేపట్నుంచి హరీష్ రావు ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టనున్నారని తెలుస్తోంది. గురువారం (ఆగస్టు 22) నాడు యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని హరీష్ రావు ఆలయాల యాత్ర మొదలు పెట్టనున్నారని పార్టీ వర్గాల సమాచారం.
దేవుడి మీద ఒట్టు ఏమైంది రేవంత్ రెడ్డి ?
‘యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టినా, ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేయలేకపోయారు సీఎం రేవంత్ రెడ్డి. దేవుడి మీద ఒట్టు పెట్టినా రైతులకు రుణమాఫీపై మాట తప్పారు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో కలిసి గురువారం యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకొని పూజలు చేయబోతున్నాం. దేవుడా ఈ పాపాత్ముడైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని క్షమించు, తెలంగాణ ప్రజలపై దయ ఉంచు అని స్వామి వారిని వేడుకుంటాం. ముఖ్యమంత్రి చేసిన పాపం ప్రజలకు శాపం కాకుండా ప్రజలను రక్షించాలని నరసింహ స్వామిని ప్రార్థిస్తాం.
ఆగస్టు15 లోగా రైతులందరికి రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి యాదాద్రి లక్ష్మీ నర్సింహాస్వామి మీద ఒట్టు పెట్టి మాట తప్పారు.
— Harish Rao Thanneeru (@BRSHarish) August 21, 2024
సీఎం రేవంత్ రెడ్డి పాప పరిహారం కోసం, తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోసం రేపు యాదాద్రి దేవాలయం దర్శించుకొని బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులతో కలిసి… pic.twitter.com/WwPQS3HQOC
రేవంత్ ఒకమాట, మంత్రులది మరో మాట.. ఏది నిజం?
రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ మాటలు ఇలా ఉన్నాయి. గత డిసెంబర్ నెలలో 49వేల కోట్ల వ్యవసాయ రుణాలు ఉన్నాయని చెప్పారు. కొన్నిరోజులు కడుపు కట్టుకుంటే చాలు ఏడాదిలో 40వేల కోట్ల రుణమాఫీ చేస్తానని జనవరిలో చెప్పారు. తరువాత తెలంగాణ కేబినెట్ భేటీలో నిర్ణయించిన 31వేల కోట్లు రుణాలు మాఫీ చేస్తామని దేవుళ్ల మీద ఒట్లు పెట్టారు. ఇటీవల పూర్తి స్థాయి బడ్జెట్ కేటాయింపుల్లో ఆ మొత్తాన్ని రూ.26 వేల కోట్లకు కుదించారు. రూ.17 వేల కోట్లు రుణమాఫీ చేశామని ఆగస్టు 15 నాడు చెప్పారు. ఓవైపు రుణమాఫీ పూర్తయిందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతుంటే, మరోవైపు రుణమాఫీ కాలేదని మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు.
17 లక్షల మందికి ఇంకా రుణమాఫీ కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. రుణమాఫీ పూర్తిగా జరగలేదని, మిగిలిన 12 వేల కోట్లు కూడా విడుదల చేస్తామని మరో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఇందులో సీఎం మాట నిజమా, మంత్రుల మాట నిజమా.. అసలు రుణమాఫీ అయిందో కాలేదో అర్థంకాక రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రుణమాఫీపై అసలు విషయం తెలియక వ్యవసాయ కార్యాలయాలు, బ్యాంకులు, కలెక్టరేట్ల చూట్టూ రైతులు చెప్పులరిగేలా తిరుగుతున్నారని’ హరీష్ రావు మండిపడ్డారు.
Also Read: Hyderabad ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం భూ సేకరణకు ఆదేశాలు, అలైన్‌మెంట్‌లో మార్పులకు రేవంత్ రెడ్డి సూచన