RTC Driver Heart Attack: డ్రైవింగ్ సీట్లోనే గుండెపోటు.. ప్రయాణికులు క్షేమం, ఆర్టీసీ డ్రైవర్ మృతితో తీవ్ర విషాదం
డ్రైవింగ్ చేస్తుండగా ఛాతీలో నొప్పి వచ్చింది, అయితే ప్రయాణికుల క్షేమం కోసం రోడ్డు పక్కన బస్సును నిలిపివేశాడు ఆర్టీసీడ్రైవర్. ఆసుపత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన డాక్టర్లు ఆయన చనిపోయినట్లు నిర్ధారించారు.

చౌటుప్పల్: హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతిచెందాడు. ఛాతీలో నొప్పి రావడంతో రోడ్డు పక్కకు బస్సు నిలిపివేసి, ప్రయాణికులను సురక్షితంగా ఉంచాడు. కానీ ఆయనను ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన డాక్టర్లు ఆర్టీసీ డ్రైవర్ చనిపోయాడని నిర్ధారించారు.
అసలేం జరిగిందంటే..
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు గుండెపోటుతో కన్నుమూశాడు. హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి విజయవాడకు బస్సు నడుపుతుండగా మార్గం మధ్యలో చౌటుప్పల్ సమీపంలో ఆయనకు ఒక్కసారిగా ఛాతీలో నొప్పి మొదలైంది. తీవ్రమైన నొప్పి వస్తున్నప్పటికీ, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నాగరాజు ఎంతో చాకచక్యంగా వ్యవహరించి బస్సును సర్వీస్ రోడ్డు వైపు మళ్లించి నిలిపివేశారు. ఆయన చేసిన పని వల్ల బస్సులోని 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.

బస్సు ఆగిన వెంటనే తోటి సిబ్బంది, స్థానికులు కలిసి నాగరాజును చికిత్స నిమిత్తం ఆటోలో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు ఈసీజీ నిర్వహించి, నాగరాజు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. మృతుడు నాగరాజు విజయవాడ డిపోకు చెందిన గొల్లపూడి ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఆయనకు భార్య మరియు ఇద్దరు పిల్లలు ఉన్నారని సమాచారం.
అనంతరం బస్సులోని ప్రయాణికులను ఆర్టీసీ అధికారులు వేరే బస్సులో విజయవాడకు పంపించారు. ప్రాణాపాయ స్థితిలో ఉండి కూడా ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన డ్రైవర్ నాగరాజు సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. డ్రైవర్ నాగరాజు మరణవార్తతో గొల్లపూడిలోని ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

డ్రైవర్‌కు సీపీఆర్ చేయలేదా..
డ్రైవర్ నాగరాజుకు ఛాతీలో నొప్పి రావడంతో బస్సును రోడ్డు పక్కన నిలిపివేశారు. అయితే ఇది గమనించిన ప్రయాణికులు డ్రైవర్‌కు సీపీఆర్ చేశారా లేదా అని చర్చ జరుగుతోంది. ఒకవేళ ఎవరైనా ముందుకొచ్చి సీపీఆర్ చేసి ఉంటే డ్రైవర్ నాగరాజు బతికేవాడు అని అంటున్నారు. ఆయన వయసు సైతం 40 ఏళ్లలోపే ఉంది. సీపీఆర్ చేసిన తరువాత ఆసుపత్రికి తరలించి ఉంటే ప్రాణాలు దక్కేవని ఆర్టీసీ సిబ్బంది అంటున్నారు.





















