MP Kavitha: సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచే చేస్తా: ఎంపీ మాలోత్ కవిత
MP Kavitha: వచ్చే అసెంబ్లీ ఎన్నికల గురించి ఎంపీ మాలోత్ కవిత మాట్లాడారు. సీఎం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తానన్నారు.
MP Kavitha: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేసేందుకు తాను సిద్ధమని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈక్రమంలోనే ఆమె ఈ కామెంట్లు చేశారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఎంపీగా విజయం సాధించానని, పార్లమెంట్ లో అడుగు పెట్టిన తొలి బంజారా మహిళగా తనకు మంచి గుర్తింపు దక్కిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయాలని కార్యకర్తలు, ప్రజలు తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. మహబూబాబాద్, డోర్నకల్, ఇల్లందు అసెంబ్లీ స్థానాలు తన పార్లమెంటరీ నియోజక వర్గం పరిధిలోనే ఉన్నందున ఆయా ప్రాంతాల ప్రజల అందరికీ తెలిసిన దాన్నేనంటూ ఎంపీ కవిత చెప్పుకొచ్చారు. కాగా ఎస్టీ జాబితా నుంచి బంజారాలను తొలగించాలన్న ఎంపీ సోయం బాపూరావు వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు.
గిరిజనులు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని... ఈ తరుణంలో బాపూరావు వైషమ్యాలు రెచ్చగొట్టడం దారుణం అన్నారు. అంతకుముందు ఎంపీ కవిత ఇటీవల వర్షాలకు కూలిపోయిన ఇళ్లను పరిశీలించి, బాధితులను పరామర్శించారు.