Minister KTR: వరదలపై అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష- సమస్యలు లేకుండా చూడాలని ఆదేశాలు
KTR Review Meeting: వరదలు తగ్గుముఖం పట్టిన క్రమంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
KTR Review Meeting: పది రోజులుగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టడంతో తెలంగాణ ప్రజలకు ఊపిరి పీల్చుకున్నారు. వరద తగ్గుముఖం పట్టింది. ఈ నేపథ్యంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పురపాలక శాఖ ఉన్నతాధికారులు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద ప్రభావంతో గ్రామాల్లో దెబ్బతిన్న వాటికి యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని, తక్షణమే తాత్కాలికంగా ఉపశమనం కలిగేలా చర్యలు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వం తరుఫున ఎలాంటి సహకారమైనా తక్షణమే అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యాధులు ప్రబలకుండా వైద్య, ఆరోగ్య సంరక్షణ, పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా భారీగా కురిసిన వర్షాలు తగ్గుముఖం పట్టాయని.. సహాయక చర్యలు, సమస్యలు లేకుండా ఎలాంటి చర్యలు చేపట్టాలని, కార్యక్రమాలపైన పురపాలక శాఖ అధికారులకు మంత్రి సూచనలు, ఆదేశాలు జారీ చేశారు.
సమన్వయంతో పనిచేయండి
పారిశుద్ధ్య నిర్వహణ, సురక్షిత తాగునీటి సరఫరాపై దృష్టిసారించాలని, నీటి సంబంధిత వ్యాధులు రాకుండా చేపట్టాల్సిన వైద్య ఆరోగ్య కార్యక్రమాల పై చర్చించారు. సహాయ కార్యక్రమాలను ఒక సవాలుగా తీసుకోవాలని, నిబద్ధతతో ముందుకు వెళ్లాలని అధికారులకు మంత్రి పిలుపునిచ్చారు. సహాయ కార్యక్రమాల్లో ఇతర శాఖలతోనూ సమన్వయం చేసుకొని ముందుకు పోవాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు అందరికీ సెలవులను ఇప్పటికే రద్దు చేశామని, ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు వారికి సదుపాయాలు అందించాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. పట్టణాల్లో దెబ్బతిన్న రోడ్లకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని సూచించారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా ముందస్తు ప్రణాళికతో ఉండాలన్నారు.
పారిశుద్ధ్యానికి ప్రత్యేక డ్రైవ్‌లు
ప్రతి పట్టణంలో ప్రత్యేకంగా పారిశుద్ధ్య డ్రైవ్ నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. బ్లీచింగ్ పౌడర్, సోడియం హైపోక్లోరైడ్, దోమల నివారణ మందుల పిచికారి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని ఆదేశించారు. పునరావస కేంద్రాల్లో తలదాచుకుంటున్న వారికి మౌలిక వసతులు అందించాలన్నారు. వరద ముంపు పూర్తిగా తగ్గిపోతే వారి సొంత ప్రదేశాలకి తరలించే ఏర్పాట్లు చేయాలని చెప్పారు. వరద ప్రవాహం కొనసాగున్న నేపథ్యంలో చెరువులు పూర్తిగా నిండాయన్నారు. నిండు కుండల్లా ఉన్న కుంటలు, చెరువులను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. ఎట్టి పరిస్థితులలో ప్రాణ నష్టం జరగకుండా చూడాలని సూచించారు.
వైద్య శిబిరాలు
పట్టణాల్లో అవసరమైతే సాగునీటి శాఖతో మాట్లాడి ప్రస్తుతం ఉన్న మార్గదర్శకాల మేరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అవసరమైతే తరలించాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పట్టణాల్లో ప్రధాన రహదారులపై పేరుకుపోయిన బురదను వెంటనే తొలగించే కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు నిర్వహించాలని ప్రజలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయాలని అధికారులకు సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు సురక్షిత నీరు తీసుకునేలా, పారిశుధ్య ప్రాముఖ్యతను వివరిస్తూ అవగాహన కల్పించాలని మంత్రి ఆదేశించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు తొలగించాలని, విద్యుత్ అధికారులతో సమన్వయం చేసుకుని మరమ్మతు పనులు చేపట్టాలని సూచించారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial