Congress MLA: ఎన్నికల హామీలు నెరవేరుస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే- తాగునీటి పథకం ప్రారంభం
Mancherial MLA Prem Sagar Rao: అసెంబ్లీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు. ఇచ్చిన హామీ మేరకు తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.
Mancherial Congress MLA: మంచిర్యాల: అసెంబ్లీ ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు (Kokkirala Premsagar Rao). ఎన్నికల హామీల్లో భాగంగా మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీ లో ప్రతిరోజు స్వచ్ఛమైన తాగునీరు పథకాన్ని సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రారంభించారు.
- ఎన్నికల హామీలను నెరవేరుస్తున్న ప్రేమ్ సాగర్ రావు
- మంచిర్యాల, నస్ఫూర్ లకు తాగు నీటి పథకం ప్రారంభం
- పూజా కార్యక్రమాల చేసి తాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే
కాలేజ్ లో చదువుకునే సమయంలో అద్దెకు ఉన్న అశోక్ రోడ్ లో పూజా కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం నస్పూర్ మున్సిపాలిటీ లోని 14వ వార్డు రాజీవ్ నగర్ లో తాగునీటి పథకాన్ని ప్రారంభించారు. నల్లా నీటిని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు తాగారు. తాగునీరు పథకం పనులను వేగవంతంగా పూర్తి చేసిన మున్సిపల్, మిషన్ భగీరథ, ఆర్.డబ్ల్యు.ఎస్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పూలమాల వేసి, శాలువా కప్పి సన్మానించారు. ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడాలని స్థానిక అధికారులకు సూచించారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు..
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రతిరోజు తాగునీటి పథకం ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం గంట, సాయంత్రం అరగంట పాటు తాగునీరు కచ్చితంగా సరఫరా అవుతుందన్నారు. తాగునీరు వృథా చేయకుండా అవసరమైన మేరకు వాడుకుని నల్లా కట్టేయాలని ప్రజలకు ఆయన సూచించారు.
అభయహస్తం దరఖాస్తులు ఆన్ లైన్‌లో డేటా ఎంట్రీ..
కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీ హామీలను అమలు చేసి తీరుతామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తరహాలో అసత్య హామీలు, బూటకపు మాటలు కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పరని ఆయన అన్నారు. డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజల నుంచి స్వీకరించిన ప్రజా పాలన అభయహస్తం దరఖాస్తులు ఆన్ లైన్ లో సేవ్ చేస్తున్నామని చెప్పారు. డేటీ ఎంట్రీ పూర్తయ్యాక.. అధికారులు దరఖాస్తు దారుల వద్దకు వచ్చి వివరాలపై ఆరా తీసి, అర్హులను పథకాల కోసం ఎంపిక చేస్తారని వివరించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ మోతిలాల్ మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాలను లబ్ధిపొందడానికి దరఖాస్తు చేసుకోవాలని ప్రజలకు సూచించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే తప్పకుండా నెరవేరుస్తారని మున్సిపల్ చైర్మన్ పదవి రేసులో ఉన్న డాక్టర్ రావుల ఉప్పలయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి, పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, సల్ల మహేష్, 17వ వార్డు కౌన్సిలర్ పూదరి సునీత ప్రభాకర్, ఇతర వార్డుల కౌన్సిలర్ లు, తదితరులు పాల్గొన్నారు.
Also Read: హైదరాబాద్‌లో వరుస విషాదాలు- భవనం పైనుంచి పడి యువకుడు, మాంజా దారం మెడకు చుట్టుకుని జవాన్ మృతి