Mahabubabad News: టీచర్ నన్ను కొట్టిండు, పోలీస్ స్టేషన్ లో రెండో తరగతి విద్యార్థి ఫిర్యాదు!
Mahabubabad News: టీచర్ కొట్టాడని రెండో తరగతి చదువుతున్న ఓ పిల్లాడు ఏకంగా పోలీస్ స్టేషన్ వెళ్లి ఫిర్యాదు చేశాడు. టీచర్ పై చర్యలు తీసుకోవాలని ఎస్సైకి కంప్లైంట్ చేశాడు.
Mahabubabad News: స్కూలులో టీచర్ కొట్టాడని పిల్లలు ఇంటికి వచ్చి తల్లిదండ్రులకు కంప్లైంట్ చేయడం సహజమే. పిల్లలు చెప్పింది నిజమే అయితే ఉపాధ్యాయులను అడుగుతారు తల్లిదండ్రులు. కొన్ని తల్లిదండ్రులే విద్యార్థికి చదువు రావాలని మందలించాలని టీచర్లకు చెబుతారు. కానీ ఇక్కడ అకారణంగా టీచర్లు తనను కొడుతున్నారని ఓ బుడ్డోడు పోలీసు స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని ఓ ఫ్రైవేట్ స్కూల్ లో అనిల్ రెండో తరగతి చదువుతున్నాడు. టీచర్ తనను కొట్టిండని అతనిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఎస్ఐ రమాదేవికి ఫిర్యాదు చేశాడు అనిల్. 2వ తరగతి చదువుతున్న విద్యార్థి పోలీస్ స్టేషన్ కు రావడంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. టీచర్ పై చర్యలు తీసుకుంటామని విద్యార్థికి నచ్చజెప్పి పంపించారు పోలీసులు. బుడ్డోడి తెగువ, ధైర్యాన్ని పోలీసులు మెచ్చుకున్నారు.
వైరల్ అవుతున్న వీడియో
ఈ మధ్య కాలంలో పిల్లలు భయం లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి సదరు అధికారులకు ఫిర్యాదులు చేస్తున్న సంఘటనలు చూస్తున్నాం. తాజాగా మహబూబాబాద్ మండలం బయ్యారం మండల కేంద్రంలో ఓ ప్రైవేట్ పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న అనిల్ టీచర్ మందలించాడని కొడుతున్నాడంటూ బయ్యారం పోలీసు స్టేషన్ కి చేరుకుని ఎస్సై రమాదేవిని కలిసి ఫిర్యాదు చేశాడు. దీనికి స్పందించిన ఎస్సై రమాదేవి ఆ చిన్నోడిని వివరాలు అడిగి తెలుసుకుని విచారణ చేపడతామని హామీ ఇచ్చి పంపించివేశారు. ఈ వీడియోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
కర్రతో కొడుతున్నాడని ఎస్సైకి ఫిర్యాదు
ఉపాధ్యాయుడు ఎందుకు కొడుతున్నాడని ఎస్సై రమాదేవి చిన్నారిని అడగగా... ఊరికే కొడుతున్నాడని సమాధానం ఇచ్చాడు. కర్రతో కొడుతున్నాడని, మెడిటేషన్ చేయాలని కొట్టాడని అనిల్ ఎస్సైకు చెప్పాడు. విద్యార్థిని కొట్టవద్దని టీచర్ పలుమార్లు చెప్పామని విద్యార్థి బంధువులు అంటున్నారు. అయినా టీచర్ కావాలనే తమ పిల్లాడిని కొడుతున్నారని ఆరోపిస్తున్నారు.
పిల్లల్లో పెరుగుతున్న అవగాహన
ఇటీవల కాలంలో పిల్లల్లో అవగాహన పెరుగుతోంది. ఏదైనా సమస్య ఉంటే అధికారులు, పోలీసులు వరకూ తీసుకెళ్తున్నారు. ఇటీవల ఓ చిన్నారి తమ ఇంటి ఫుట్ పాత్ నిర్మించలేదని ఏకంగా మంత్రి కేటీఆర్ కు లేఖ రాశాడు. ఈ లేఖపై మంత్రి కేటీఆర్ కూడా స్పందించారు. అధికారులను ఆదేశించి సమస్యను పరిష్కరించారు మంత్రి కేటీఆర్. ఇలాంటి ఘటనలు ఇటీవల తరచూ చూస్తున్నాం. పిల్లలు సమస్యలపై పెట్టిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.